మాయమాటలు చెబుతూ.. హతమార్చుతూ..

మాయమాటలు చెబుతూ.. ఆరుగురు మహిళలను దారుణంగా హత్య చేసిన యువకుడు పోలీసులకు చిక్కాడు.

Published : 30 Jun 2024 04:23 IST

ఆరుగురు మహిళలను హత్య చేసిన నిందితుడి పట్టివేత

మహబూబ్‌నగర్‌ నేరవిభాగం, న్యూస్‌టుడే: మాయమాటలు చెబుతూ.. ఆరుగురు మహిళలను దారుణంగా హత్య చేసిన యువకుడు పోలీసులకు చిక్కాడు. మహబూబ్‌నగర్‌ జిల్లా ఎస్పీ డి.జానకి శనివారం తన కార్యాలయంలో ఏఎస్పీ రాములు, డీఎస్పీ వెంకటేశ్వర్లుతో కలిసి విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. జోగులాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం చింతలకుంటకు చెందిన బోయ కాసమయ్య అలియాస్‌ ఖాసీం(25) కూలి పనిచేసేవాడు. మద్యానికి బానిసై, జల్సాలకు అలవాటుపడిన అతడు రెండున్నర ఏళ్ల క్రితం మహబూబ్‌నగర్‌కు మకాం మార్చాడు. కూలి పనులు చేస్తూ.. వచ్చిన డబ్బును మద్యానికి, తిండికి ఖర్చు పెట్టేవాడు. బస్టాండ్లలో, ఫుట్‌పాత్‌లపై పడుకునేవాడు. కూలీలు, అమాయకులైన మహిళలకు మాయమాటలు చెప్పి, డబ్బులు ఇస్తానని నమ్మించి.. దూర ప్రాంతాలకు తీసుకెళ్లి శారీరకంగా అనుభవించేవాడు. తర్వాత డబ్బులు ఇవ్వకుండా చంపేవాడు. ఇలా ఆరుగురు మహిళలను వివిధ ప్రాంతాల్లో హత్య చేశాడు. మే 23న మహబూబ్‌నగర్‌ పట్టణం టీడీగుట్టలోని కూలీల అడ్డా నుంచి ఓ మహిళను కాసమయ్య తన వెంటబెట్టుకొని భూత్పూర్‌ పురపాలిక అమిస్తాపూర్‌ ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఆమెతో శారీరకంగా కలిశాడు. ఆమె డబ్బులు అడగగా.. తనవద్ద ఉన్న టవల్‌ను ఆమె మెడకు చుట్టి.. బ్లేడుతో గొంతు కోశాడు. రాయితో ముఖంపై మోదీ చంపేశాడు. ఆమె కాళ్లకు ఉన్న పట్టీలను తస్కరించాడు. మే 24న మృతదేహాన్ని గుర్తించిన భూత్పూర్‌ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శనివారం మహబూబ్‌నగర్‌ షాసాబ్‌గుట్ట వద్ద కాసమయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో 2022 నుంచి ఆరుగురు మహిళలను హత్య చేసినట్లు ఒప్పుకొన్నాడు. భూత్పూర్‌ పరిధిలో ఇద్దరిని, హన్వాడ, వనపర్తి, బిజినేపల్లి, మహబూబ్‌నగర్‌ గ్రామీణ ఠాణాల పరిధిలో ఒక్కొక్కరిని హత్య చేశాడని.. కాసమయ్యపై కేసులు నమోదుచేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని