కస్టమ్స్‌లో ఇంటి దొంగలు

శంషాబాద్‌ విమానాశ్రయం కస్టమ్స్‌ విభాగంలో ఇంటి దొంగల బాగోతం బహిర్గతమైంది. విదేశీ కరెన్సీని అక్రమంగా మార్పిడి చేసినందుకు ఇద్దరు కస్టమ్స్‌ విభాగం ఆఫీస్‌ సూపరింటెండెంట్లు, ఓ ఇన్‌స్పెక్టర్‌పై హైదరాబాద్‌ సీబీఐ కేసు నమోదు చేసింది.

Published : 30 Jun 2024 04:21 IST

విదేశీ కరెన్సీని మారుస్తుండగా పట్టివేత
ముగ్గురిపై సీబీఐ కేసు నమోదు

ఈనాడు, హైదరాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయం కస్టమ్స్‌ విభాగంలో ఇంటి దొంగల బాగోతం బహిర్గతమైంది. విదేశీ కరెన్సీని అక్రమంగా మార్పిడి చేసినందుకు ఇద్దరు కస్టమ్స్‌ విభాగం ఆఫీస్‌ సూపరింటెండెంట్లు, ఓ ఇన్‌స్పెక్టర్‌పై హైదరాబాద్‌ సీబీఐ కేసు నమోదు చేసింది. విమానాశ్రయం కస్టమ్స్‌ విభాగంలో ఓంప్రకాశ్‌ దత్తా ఆఫీస్‌బాయ్‌గా.. సంజయ్‌పాల్‌ లోడర్‌గా పనిచేస్తున్నారు. వీరిద్దరూ 2023 మార్చి 16న అరైవల్‌ సర్వీస్‌రోడ్డులో ఉన్న కారు వద్దకు వెళ్లారు.   కారులో ఉన్న మరో ఇద్దరికి వీరు విదేశీ కరెన్సీ ఇస్తున్నట్లు గుర్తించిన సీఐఎస్‌ఎఫ్‌లోని క్రైమ్‌ అండ్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం సిబ్బంది ఆ నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. కారులో ఉన్న వ్యక్తులను బహదూర్‌పురాకు చెందిన గులామ్‌అలీ (34), సాజిద్‌ (34)గా గుర్తించారు. వారివద్ద విదేశీ, మన కరెన్సీని  స్వాధీనం చేసుకుంది. ఓంప్రకాశ్‌ను విచారించడంతో విదేశీ కరెన్సీని తనకు కస్టమ్స్‌ విభాగం ఆఫీస్‌ సూపరింటెండెంట్లు వై.శ్రీనివాసులు, పేరి చక్రపాణి, ఇన్‌స్పెక్టర్‌ పంకజ్‌గౌతమ్‌ ఇచ్చినట్లు అంగీకరించాడు. సంజయ్‌పాల్‌తో కలిసి వెళ్లి వాటిని గులాంఅలీ, సాజిద్‌ వద్ద మార్చుకురావాలని పంపినట్లు వెల్లడించాడు. కరెన్సీ స్వాధీనం చేసుకున్న సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు దాన్ని కస్టమ్స్‌ ఉన్నతాధికారులకు అప్పగించారు. దీనిపై ఆర్‌జీఐఏ కస్టమ్స్‌ కమిషనరేట్‌ డిప్యూటీ కమిషనర్‌ అలేఖ్య బల్లా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ ముగ్గురిపై తాజాగా సీబీఐ కేసు నమోదు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని