రూ.4.37 కోట్ల పరిహారం పక్క‘దారి’

కుమురంభీం జిల్లాలో నాలుగు వరుసల జాతీయ రహదారి విస్తరణలో భాగంగా భూములు కోల్పోయిన వారికి చెల్లించిన పరిహారంలో రూ.4.37 కోట్ల మేర అక్రమాలకు పాల్పడ్డారన్న ఫిర్యాదు నేపథ్యంలో అనిశా(ఏసీబీ) అధికారులు శనివారం అప్పటి ఆసిఫాబాద్‌ ఆర్డీఓ సిడాం దత్తు (ప్రస్తుత వరంగల్‌ ఆర్డీఓ), ఆసిఫాబాద్‌ డిప్యూటీ తహసీల్దార్‌ మెస్రం నాగోరావుతో పాటు స్థిరాస్తి వ్యాపారులు సుబ్బ శంభుదాస్, లక్ష్మీనారాయణగౌడ్‌లను అదుపులోకి తీసుకున్నారు.

Published : 30 Jun 2024 05:48 IST

లేఅవుట్లలోని రోడ్లకు మంజూరైన సొమ్ము.. స్థిరాస్తి వ్యాపారుల ఖాతాల్లోకి
ఆర్డీఓ సహా నలుగురిని అదుపులోకి తీసుకున్న అనిశా

ఈనాడు, ఆసిఫాబాద్‌: కుమురంభీం జిల్లాలో నాలుగు వరుసల జాతీయ రహదారి విస్తరణలో భాగంగా భూములు కోల్పోయిన వారికి చెల్లించిన పరిహారంలో రూ.4.37 కోట్ల మేర అక్రమాలకు పాల్పడ్డారన్న ఫిర్యాదు నేపథ్యంలో అనిశా(ఏసీబీ) అధికారులు శనివారం అప్పటి ఆసిఫాబాద్‌ ఆర్డీఓ సిడాం దత్తు (ప్రస్తుత వరంగల్‌ ఆర్డీఓ), ఆసిఫాబాద్‌ డిప్యూటీ తహసీల్దార్‌ మెస్రం నాగోరావుతో పాటు స్థిరాస్తి వ్యాపారులు సుబ్బ శంభుదాస్, లక్ష్మీనారాయణగౌడ్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారిని కరీంనగర్‌ అనిశా కార్యాలయానికి తరలించారు. ఈ వ్యవహారంపై అనిశా అధికారులు మే 1న కేసు నమోదు చేశారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో విచారణ కొలిక్కిరాలేదు. ఎన్నికల కోడ్‌ ముగిశాక తాజాగా విచారణ వేగం పుంజుకుంది. 

ఇదీ జరిగింది..

కుమురం భీం జిల్లాలోని ఆసిఫాబాద్‌ పట్టణాన్ని ఆనుకుని ఉండే జన్కాపూర్‌ శివారు ప్రాంతంలోని సర్వే నంబర్లు 9, 10లలో సుబ్బ శంభుదాస్, లక్ష్మీనారాయణగౌడ్‌లు 1992లో 15 ఎకరాల్లో జాయింట్‌ వెంచర్‌ వేసి, ప్లాట్లు విక్రయించారు. అమ్మిన ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు సైతం జరిగాయి. ఈ లేఅవుట్‌ల గుండా జాతీయ రహదారి 363 నిర్మాణం చేపట్టారు. ఇందుకోసం ఈ లేఅవుట్లలోని 6 ఎకరాల 12 గుంటలను సేకరించినట్లు రెవెన్యూ అధికారులు చూపారు. వాటికి రూ.4.32 కోట్ల పరిహారం మంజూరైంది. వెంచర్లలో రహదారుల కోసం వదిలిన స్థలాలకు సైతం మంజూరైన పరిహారాన్ని పంచాయతీకి ఇవ్వాల్సి ఉండగా.. శంభుదాస్, లక్ష్మీనారాయణగౌడ్‌లు అక్రమంగా తీసుకున్నారు. ధరణిలో పట్టాదారులుగా వీరిద్దరి పేర్లు ఉండటంతో పరిహారాన్ని పక్కదారి పట్టించినట్లు విచారణలో అధికారులు గుర్తించారు. మరోవైపు, ప్లాట్లు కొన్నవారికి సైతం పరిహారం వచ్చింది. 

సహకరించిన రెవెన్యూ అధికారులు..

స్థిరాస్తి వ్యాపారులకు అయాచితంగా పరిహారం డబ్బులు వచ్చేలా 2019లో పనిచేసిన రెవెన్యూ అధికారులు సహకరించారు. ఇందుకు ప్రతిఫలంగా లక్ష్మీనారాయణగౌడ్‌ బ్యాంకు ఖాతా నుంచి సుబ్బ శంభుదాస్‌ వద్ద అప్పట్లో డ్రైవర్‌గా పనిచేసిన తిరుపతి బ్యాంకు ఖాతాకు రూ.1,15,19,000 వరకు జమ అయ్యాయి. వాటిని ఆయన ఆర్డీఓ సిడాం దత్తు తల్లి సిడాం మల్కుబాయి ఖాతాలో రూ.65 లక్షలు, డిప్యూటీ తహసీల్దార్‌ మేస్రం నాగోరావు సోదరుడు మేస్రం చత్రుషా ఖాతాలో రూ.30 లక్షలు జమ చేశారు. సర్వేయర్‌ భరత్‌కు రూ.10 లక్షల నగదు ఇవ్వడంతో పాటు రూ.2 లక్షల విలువైన ద్విచక్ర వాహనం కొనుగోలు చేసి ఇచ్చారని అధికారులు గుర్తించారు. నిందితుల బ్యాంకు స్టేట్‌మెంట్లు, డ్రైవర్‌ వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. ఈ వ్యవహారంలో నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని కరీంనగర్‌ అనిశా డీఎస్పీ రమణమూర్తి వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని