కత్తి దూసిన ప్రేమోన్మాదం

తన కుమార్తెతో ప్రేమ వ్యవహారం వద్దని మందలించడమే ఆ తండ్రికి శాపమైంది. తన ఇంటికి వచ్చి కుటుంబసభ్యులతో గట్టిగా మాట్లాడారన్న కోపంతో ప్రేమోన్మాది పగ పెంచుకున్నాడు.

Updated : 29 Jun 2024 17:09 IST

పెళ్లికి అంగీకరించలేదని యువతి తండ్రిని నరికి చంపిన యువకుడు
విజయవాడలో నడిరోడ్డుపై దారుణం

యువతి వద్దని ప్రాధేయపడుతున్నా కత్తితో నరుకుతున్న మణికంఠ

ఈనాడు- అమరావతి, న్యూస్‌టుడే- కృష్ణలంక: తన కుమార్తెతో ప్రేమ వ్యవహారం వద్దని మందలించడమే ఆ తండ్రికి శాపమైంది. తన ఇంటికి వచ్చి కుటుంబసభ్యులతో గట్టిగా మాట్లాడారన్న కోపంతో ప్రేమోన్మాది పగ పెంచుకున్నాడు. అదునుచూసి గురువారం రాత్రి పొద్దుపోయాక నడిరోడ్డుపైనే అత్యంత కిరాతకంగా నరికి చంపాడు. యువతి ప్రాధేయపడుతున్నా వినకుండా, ఆమె కళ్ల ముందే కత్తితో విచక్షణారహితంగా ముఖం, ఛాతీపై నరికాడు. ఆసుపత్రికి తరలించే లోగానే ఆ తండ్రి ప్రాణం విడిచారు. విజయవాడ నగరంలో సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి వివరాలివీ..

విజయవాడ నగరంలోని విద్యాధరపురంలో చెరువు సెంటర్‌కు చెందిన కంకిపాటి శ్రీరామప్రసాద్‌ (56)కు భార్య, ఇద్దరు కుమార్తెలు. కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బృందావన్‌ కాలనీ సింధూభవన్‌ వీధిలో వంశీ జనరల్‌ స్టోర్స్‌ పేరుతో కిరాణా దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. పెద్ద కుమార్తె దర్శిని ఇంజినీరింగ్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. స్నేహితురాలి ద్వారా కుమ్మరిపాలెం సెంటర్‌కు చెందిన గడ్డం శివమణికంఠ (26)తో నాలుగేళ్ల కిందట పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. ఇద్దరివి వేర్వేరు సామాజికవర్గాలు కావడంతో ఆమె తండ్రి వివాహానికి అంగీకరించలేదు. ప్రేమ పక్కనపెట్టి బాగా చదువుకోవాలని కుమార్తెను వారించారు. దీంతో మణికంఠతో పెళ్లి ప్రతిపాదనను ఆమె తిరస్కరించింది. ఈ విషయమై శ్రీరామప్రసాద్‌ నాలుగు నెలల కిందట పలువురిని వెంటబెట్టుకుని మణికంఠ ఇంటికి వెళ్లి.. అక్కడ పంచాయితీ పెట్టారు. దీంతో ఆ యువకుడు పగ పెంచుకున్నాడు. పెళ్లి చేసుకోకుంటే తనతో దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెడతానని దర్శినిని బెదిరించేవాడు. 


యువతి కళ్ల ముందే ఘాతుకం

గురువారం రాత్రి కిరాణా దుకాణాన్ని మూసిన అనంతరం శ్రీరామప్రసాద్, దర్శిని ఇద్దరూ ద్విచక్రవాహనంపై ఇంటికి బయలుదేరారు. అప్పటికే అక్కడ మాటువేసిన మణికంఠ.. కిరాణా దుకాణానికి సుమారు 100 మీటర్ల దూరంలో బైకుపై వెళ్లి శ్రీరామప్రసాద్‌ వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడు. కిందపడిపోయిన శ్రీరామప్రసాద్‌ ముఖంపై  మాంసం కొట్టే కత్తితో వేటు వేశాడు. రక్తపు మడుగులో రోడ్డుపై పడిపోయిన తండ్రిని లేపి.. పక్కకు తీసుకెళ్లి సిమెంటు దిమ్మెపై కూర్చోబెట్టింది యువతి. తండ్రిని చంపేందుకు వస్తున్న మణికంఠను అడ్డుకోవడానికి ఆమె ఎంత పెనుగులాడినా, ఎంత ప్రాధేయపడినా అతను వినలేదు. ‘నా దగ్గర మన సెల్ఫీలు, వీడియోలు, కాల్‌ రికార్డులు ఉన్నాయి. పది మందితో ఇంటికి వచ్చి మా అమ్మతో మాట్లాడతాడా..’ అని అరుస్తూ విచక్షణారహితంగా పలు దఫాలు కత్తితో ముఖంపై నరికాడు. చుట్టుపక్కలవారు పోగవడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. అచేతనంగా ఉన్న తండ్రిని దర్శిని 108లో ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 


పోలీసుల అదుపులో నిందితుడు 

నిందితుడు గడ్డం శివ మణికంఠ బీపీటీ చదివి, భవానీపురంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. హత్య చేసి, పరారైన అతణ్ని పోలీసులు భవానీపురంలో అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి మాంసం కత్తిని స్వాధీనం చేసుకుని కృష్ణలంక స్టేషన్‌కు తరలించారు. నిందితుడిపై హత్యపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. ప్రభుత్వాసుపత్రి వద్ద మృతుడి కుటుంబసభ్యులు నిందితుడిని కఠినంగా శిక్షించాల్సిందిగా కోరారు. తనకు ఇష్టం లేదని చెబుతున్నప్పటికీ తన వెంటపడి వేధించేవాడని దర్శిని ఆవేదన వ్యక్తం చేసింది. గతంలో అతడితో తను తీసుకున్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరించేవాడని చెప్పింది. తన తల్లిదండ్రులను అసభ్యంగా దూషిస్తుండేవాడని, ఇప్పుడు తన తండ్రిని పొట్టనబెట్టుకున్నాడని కన్నీటి పర్యంతమైంది. మణికంఠను కఠినంగా శిక్షించాలని వేడుకుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని