మదర్సాలో బాలిక అనుమానాస్పద మృతి

విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌ లూనా సెంటర్‌లోని ఓ మదర్సాలో శుక్రవారం ఉదయం బాలిక కరిష్మా (17) అనుమానాస్పద స్థితిలో చనిపోయింది.

Published : 29 Jun 2024 05:33 IST

కలుషిత ఆహారమా?మరేదైనా కారణమా?
చనిపోయాకే ఆసుపత్రికి తీసుకొచ్చిన నిర్వాహకులు

ఫ్రీజర్‌లో నిల్వ ఉంచిన మాంసం 

ఈనాడు, అమరావతి-మధురానగర్, న్యూస్‌టుడే: విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌ లూనా సెంటర్‌లోని ఓ మదర్సాలో శుక్రవారం ఉదయం బాలిక కరిష్మా (17) అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. బాలిక తల్లిదండ్రులు, పోలీసులు, వైద్యాధికారుల వివరాల మేరకు.. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం అంగలూరుకు చెందిన కరిష్మా ఏడో తరగతి పూర్తి చేసింది. మూడేళ్ల అరబిక్‌ కోర్సు చదివేందుకు ఏడాది కిందట మదర్సాలో చేరింది. బాలికకు అనారోగ్యంగా ఉందంటూ మదర్సా నిర్వాహకులు తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి వారు వచ్చేలోగానే విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తీసుకొచ్చేసరికే బాలిక చనిపోయిందని వైద్యులు ప్రకటించారు. ఈ మేరకు కుటుంబసభ్యులకు, పోలీసులకు తెలియజేశారు. కరిష్మా మృతిపై అనుమానాలున్నాయని, తమకు న్యాయం చేసే వరకూ మృతదేహాన్ని తీసుకెళ్లేది లేదని మదర్సా వద్దకు వచ్చి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేపట్టారు. మదర్సా నిర్వాహకుల వల్లే మృతి చెందిందంటూ కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా నడుపుతున్న ఈ మదర్సాలో 63 మంది బాలికలు చదువుకుంటున్నారు. 

అనారోగ్యమంటూ వచ్చి మాయమయ్యారు..

కరిష్మా మృతి చెందిందని వైద్యులు ప్రకటించాక మరో ఎనిమిది మంది బాలికలను అంబులెన్సులో ప్రభుత్వ ఆసుపత్రికి మదర్సా నిర్వాహకులు తీసుకొచ్చారు. ఆహారం కలుషితమై అనారోగ్యం పాలయ్యారని చెప్పారు. వైద్యుల పరీక్షలో బాలికలకు అనారోగ్యం కనిపించలేదు. దీనిపై ప్రశ్నించగా.. రెండు మూడు రోజుల కిందట వాంతులయ్యాయంటూ పొంతన లేని సమాధానాలు చెప్పి అంతలోనే అంతా కనిపించకుండా వెళ్లిపోయారు. 

వంద కిలోలకు పైగా కుళ్లిన మాంసం

విద్యార్థిని చనిపోయిందని తెలియడంతో విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, జిల్లా వైద్య శాఖ, ఇతర ఉన్నతాధికారులు మదర్సాకు వెళ్లి వంట గదిని చూసి నిర్ఘాంతపోయారు. కూలింగ్‌ ఫ్రీజర్‌లో వంద కిలోలకుపైగా మటన్, పశు మాంసం, చికెన్‌ సంచుల్లో కనిపించాయి. ఫ్రీజర్‌లో నిల్వ ఉంచిన మాంసానికి బూజు పట్టి వాసన వస్తున్నట్లు గమనించారు. మురికిగా ఉన్న వాటర్‌కూలర్‌ నుంచి నమూనాలను సేకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని