కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది దుర్మరణం

కర్ణాటకలోని హావేరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో 13 మంది మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

Published : 29 Jun 2024 04:25 IST

హావేరి, న్యూస్‌టుడే: కర్ణాటకలోని హావేరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో 13 మంది మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బ్యాడగి తాలూకా గుండేనహళ్లి సమీపంలో బెంగళూరు-పుణె జాతీయ రహదారిపై శుక్రవారం వేకువజామున ఈ ప్రమాదం సంభవించింది. పొగమంచు దట్టంగా అలముకుని ఉండడంతో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీని గమనించకుండా.. ప్రయాణికుల వాహనం వెనకనుంచి ఢీకొట్టింది. మృతులంతా శివమొగ్గ జిల్లా భద్రావతి సమీపంలోని ఎమ్మెహట్టి గ్రామానికి చెందినవారే. వీరంతా సమీప బంధువులు. వీరంతా టెంపో ట్రావెలర్‌లో శివమొగ్గ నుంచి మహారాష్ట్రలోని తివారీ లక్ష్మీ దేవాలయానికి వెళ్లారు. వాహనానికి పూజ చేయించి, తుల్జా భవాని దేవాలయాన్ని సందర్శించారు. అక్కడి నుంచి కలబురగి జిల్లా చించోళి మాయమ్మ ఆలయం, బెళగావి జిల్లా సవదత్తి రేణుకా యల్లమ్మను దర్శించుకున్నారు. గురువారం రాత్రి సవదత్తి నుంచి తిరుగు పయనం ప్రారంభించి.. సొంత ఊరికి చేరుకోవడానికి కొద్ది సమయం ముందు ఈ ప్రమాదానికి గురయ్యారు. 

అంధుల ఫుట్‌బాల్‌ జట్టు కెప్టెన్‌ కూడా..

భారత అంధుల ఫుట్‌బాల్‌ జట్టు సభ్యురాలైన మానస.. ఈ ప్రమాదంలోనే విగతజీవిగా మారారు. శుక్రవారం ఉదయం ఇంటికి చేరుకుంటామని మానస గురువారం రాత్రి ఫోన్‌ చేసి చెప్పిందంటూ ఆమె సోదరి మహాలక్ష్మి కన్నీరుమున్నీరయ్యారు. ఆమెకు రెండు కళ్లూ కనిపించకపోవడంతో ఇటీవలే శస్త్రచికిత్స చేయించామని గుర్తు చేసుకున్నారు. మృతులలో ఒకరైన మానస భారత అంధుల ఫుట్బాల్‌ మహిళా జట్టు కెప్టెన్‌. అంధత్వాన్ని అవరోధంగా భావించకుండా ఆమె ఇటీవలే ఎమ్మెస్సీ పూర్తిచేశారు. సివిల్స్‌ సాధించే లక్ష్యంతో బెంగళూరులో ఉండి చదువుకుంటూ.. విరామం లభించడంతో సొంత ఊరికి ఆదివారమే వెళ్లి.. బంధువులతో పాటు ఆలయాల సందర్శనకు బయల్దేరి ఇలా ప్రమాదంలో చిక్కింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని