వీధి కుక్కల దాడిలో బాలుడి మృతి

ఆరేళ్ల బాలుడిని వీధి కుక్కలు చుట్టుముట్టి కరవడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచిన ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఠాణా పరిధిలో జరిగింది.

Published : 29 Jun 2024 04:24 IST

మరో ఘటనలో 7 నెలల చిన్నారికి గాయాలు

పటాన్‌చెరు అర్బన్, న్యూస్‌టుడే: ఆరేళ్ల బాలుడిని వీధి కుక్కలు చుట్టుముట్టి కరవడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచిన ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఠాణా పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌కు చెందిన బాల్కన్‌ తన భార్య ప్రమీల, ముగ్గురు పిల్లలతో కలిసి నెల క్రితం పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌కు వచ్చి.. మహీధర వెంచర్‌ సమీపంలో మేస్త్రీ దగ్గర కూలీగా పని చేస్తూ స్థానికంగా గుడిసెలో నివసిస్తున్నారు. శుక్రవారం ఉదయం అతని చిన్న కుమారుడు బిశాల్‌(6) ఇంటి సమీపంలో బహిర్భూమికి వెళ్లగా మూడు కుక్కలు ఒకేసారి అతనిపై దాడి చేశాయి. మెడ ఇతర శరీర భాగాలపై తీవ్రంగా కరిచాయి. చుట్టుపక్కల వారు గమనించి వెళ్లే సరికి బాలుడు అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు.  

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన భార్యాభర్తలు గోకిరాం, రోత్న ముత్తంగి గ్రామం నాగార్జునకాలనీలో కూలి పనులు చేసుకుంటూ నివసిస్తున్నారు. వారి 7 నెలల కుమార్తె స్వాతి ఇంట్లో పడుకుని ఉండగా.. ఓ వీధి కుక్క వచ్చి ఆమె కంటిపై కరవడంతో తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారిని వెంటనే ఆసుపత్రికి, అనంతరం నిలోఫర్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని