మద్యం మాయం కేసులో బగ్గా అరెస్ట్‌

డిస్టిలరీ నుంచి మద్యం మాయం కేసులో బగ్గా డిస్టిలరీ డైరెక్టర్‌ జస్మిత్‌సింగ్‌ బగ్గాను శంషాబాద్‌ ఎక్సైజ్‌ అధికారులు అరెస్టుచేశారు.

Published : 28 Jun 2024 05:29 IST

ఈనాడు, హైదరాబాద్‌: డిస్టిలరీ నుంచి మద్యం మాయం కేసులో బగ్గా డిస్టిలరీ డైరెక్టర్‌ జస్మిత్‌సింగ్‌ బగ్గాను శంషాబాద్‌ ఎక్సైజ్‌ అధికారులు అరెస్టుచేశారు. అతడితో పాటు డిస్టిలరీ ప్రొడక్షన్‌ ఇన్‌ఛార్జి పాశం లింగారెడ్డి, గోదాం ఇన్‌ఛార్జి మామిండ్ల అశోక్, స్కానింగ్‌ ఇన్‌ఛార్జి వెంకటేశ్‌లనూ అదుపులోకి తీసుకున్నారు. వీరందరికీ 41ఏ సీఆర్పీసీ నోటీసు జారీచేశారు. అనంతరం రూ.15వేల చొప్పున వ్యక్తిగత పూచీకత్తు తీసుకొని పంపించారు. ఇదే కేసులో ఇప్పటికే డిస్టిలరీ జనరల్‌ మేనేజర్‌ బి.రమేశ్‌ను ఈనెల 20న అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే. అతడిని న్యాయస్థానంలో హాజరుపరిచిన అనంతరం స్పాట్‌ బెయిల్‌ పొంది విడుదలయ్యాడు. శంషాబాద్‌ మండలం సాతంరాయిలోని బగ్గా డిస్టిలరీలో 100 కార్టన్ల డౌన్‌టౌన్‌ విస్కీ బాటిళ్లు మాయమైన ఉదంతంలో వీరిపై కేసు నమోదైంది. ఒక్కో కార్టన్‌లో 48 బాటిళ్ల చొప్పున ఉన్న ఆ మద్యం విలువ రూ.5.60 లక్షలుగా ఎక్సైజ్‌ అధికారులు గుర్తించారు. ఈ కేసులో సంస్థ జీఎం రమేశ్‌ను అరెస్ట్‌ చేసి మరుసటి రోజు న్యాయస్థానంలో హాజరుపరిచారు. దర్యాప్తు క్రమంలో బగ్గా మార్గదర్శకత్వంలోనే ఈ తతంగం నడిచినట్లు వెల్లడి కావడంతో తాజాగా బగ్గాతోపాటు ఇతర నిందితులను అరెస్ట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని