మూడు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురి దుర్మరణం

పల్నాడు జిల్లా వినుకొండ మండల పరిధిలోని అనంతపురం- గుంటూరు జాతీయ రహదారిపై ఒక్కరోజు వ్యవధిలో మూడు వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. ఐదుగురు గాయపడ్డారు.

Published : 28 Jun 2024 05:24 IST

మృతుల్లో దంపతులు, తండ్రీకుమారులు

విషాదంలో బాలగంగాధర్‌ శర్మ మనవడు కార్తిక్‌

వినుకొండ, గుంటూరు(పట్టాభిపురం), న్యూస్‌టుడే: పల్నాడు జిల్లా వినుకొండ మండల పరిధిలోని అనంతపురం- గుంటూరు జాతీయ రహదారిపై ఒక్కరోజు వ్యవధిలో మూడు వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. ఐదుగురు గాయపడ్డారు. మృతుల్లో దంపతులతో పాటు ప్రకాశం జిల్లాకు చెందిన తండ్రీ కుమారులు, ఆర్నెల్ల క్రితం పెళ్లి అయిన యువకుడు ఉన్నారు. తితిదే విశ్రాంత ఉద్యోగి, గుంటూరు పట్టణానికి చెందిన సోమాసి బాలగంగాధరశర్మ (78) భార్య యశోద (67) కుమారుడు హెచ్‌ఎస్‌వై శర్మ, కోడలు నాగ సంధ్య, మనవడు కార్తిక్, మనవరాలు అనుపమ కలిసి బళ్లారి నుంచి కారులో గుంటూరు వస్తున్నారు. గురువారం తెల్లవారుజామున వినుకొండ సమీపంలోని కొత్తపాలెం దాటగానే కారు అదుపు తప్పి రోడ్డు పక్కన చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలగంగాధర శర్మ ఆయన భార్యతో పాటు  తెనాలి మారిస్‌పేటకు చెందిన డ్రైవర్‌ నిర్మలకుమార్‌(45) అక్కడికక్కడే మృతి చెందారు. కుమారుడు, కోడలు, మనవరాలికి తీవ్రగాయాలయ్యాయి. అంతకుముందు బుధవారం రాత్రి 10.30కి ఇదే రహదారిలో ద్విచక్ర వాహనంపై వస్తున్న ప్రకాశం జిల్లా ఉమ్మడివరానికి చెందిన మాలపాటి ఆంజనేయులు(40) ఆయన కుమారుడు అంజిబాబు(14)లను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. దీంతో వారు మృతి చెందారు. బుధవారం రాత్రి తొమ్మిది గంటలకు షేక్‌ మీరావలి (28) వినుకొండ నుంచి స్వగ్రామం నూజండ్ల మండలం నాగిరెడ్డిపల్లె ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా రామిరెడ్డిపాలెం వద్ద నాలుగు చక్రాల ఆటో ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. అతనితో పాటు ఉన్న నాసరవలి గాయాలతో బయట పడ్డాడు. మీరావలికి ఆరునెలల క్రితమే వివాహమైంది. 

విపత్కర పరిస్థితిలోనూ బాలుడి సమయస్ఫూర్తి

వినుకొండ మండలం కొత్తపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కారులో వెనుక సీటులో కూర్చున్న బాలగంగాధర శర్మ మనవడు ఏడేళ్ల కార్తిక్‌ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. తన తాత, నాయనమ్మతో పాటు డ్రైవర్‌ మృతి చెందగా.. అమ్మానాన్నలు, చెల్లికి గాయాలై స్పృహ కోల్పోయిన పరిస్థితిలో బాలుడు సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. ప్రమాదం జరిగిన విషయాన్ని వినుకొండలో ఉన్న తన అత్తకు ఫోన్‌ చేసి చెప్పాడు. దీంతో బంధువులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం వారు స్థానికులతో కలసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పట్టణ సీఐ సాంబశివరావు సిబ్బంది మృతదేహాలను వినుకొండ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి సకాలంలో చికిత్స అందేలా చేయడం గమనార్హం. విపత్కర పరిస్థితిలో కార్తిక్‌ చూపిన సమయస్ఫూర్తి అందరి మన్ననలు అందుకుంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని