చాయ్‌ పెట్టలేదని కోడలిని కడతేర్చిన అత్త

చాయ్‌ పెట్టే విషయంలో అత్తాకోడళ్ల మధ్య తలెత్తిన వివాదం కోడలి హత్యకు దారితీసింది.

Updated : 28 Jun 2024 06:48 IST

రాజేంద్రనగర్, న్యూస్‌టుడే: చాయ్‌ పెట్టే విషయంలో అత్తాకోడళ్ల మధ్య తలెత్తిన వివాదం కోడలి హత్యకు దారితీసింది. అత్తాపూర్‌ ఠాణా పరిధిలోని హసన్‌నగర్‌లో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ వెంకట్‌రామిరెడ్డి తెలిపిన వివరాలు.. వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేట మండలం టేకులపల్లి గ్రామానికి చెందిన అజ్మీరాబేగం(28)కు హసన్‌నగర్‌కు చెందిన అబ్బాస్‌తో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. పెళ్లైనప్పటి నుంచి అజ్మీరాబేగం, అత్త ఫర్జానాబేగంల మధ్య గొడవలు జరుగుతున్నాయి. రోజు ఏదో విషయంలో గొడవ పడేవారు. గురువారం ఉదయం చాయ్‌పెట్టాలని అత్త కోడల్ని ఆదేశించింది. పిల్లలను పాఠశాలకు పంపే హడావిడిలో ఉన్న అజ్మీరాబేగం అత్త మాటను పెడచెవిన పెట్టింది. పిల్లలిద్దర్నీ పాఠశాలకు పంపించి వచ్చాక ఇద్దరి మధ్య మరోమారు వాగ్వాదం జరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన ఫర్జానాబేగం కోడలు ధరించిన చున్నీని ఆమె మెడకు బిగించి హత్య చేసింది. ఆ సమయంలో భర్త, మామ ఇద్దరు ఇంట్లో లేరు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. హతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఫర్జానాబేగం, మహ్మద్‌ నూర్‌ దంపతులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని