కూతురిపై అసభ్య ప్రవర్తన

తాగిన మైకంలో కన్న కూతురిపై అసభ్యకరంగా ప్రవర్తించబోయిన భర్తను.. భార్య గొడ్డలితో నరికి దారుణంగా హతమార్చింది.

Updated : 28 Jun 2024 09:33 IST

భర్తను నరికి చంపిన భార్య

జోగిపేట న్యూస్‌టుడే: తాగిన మైకంలో కన్న కూతురిపై అసభ్యకరంగా ప్రవర్తించబోయిన భర్తను.. భార్య గొడ్డలితో నరికి దారుణంగా హతమార్చింది. బుధవారం అర్ధరాత్రి సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలం సుల్తాన్‌పూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పుల్కల్‌ ఎస్సై శ్రీకాంత్‌ తెలిపిన వివరాలు.. సుల్తాన్‌పూర్‌కు చెందిన మన్నె మాణయ్యకు భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. మొదటి కుమార్తె సుకన్యకు పెళ్లి చేయగా ఆమెకు పాప జన్మించింది. భర్తతో విభేదాల కారణంతో ఆమె రెండేళ్లుగా తల్లిగారింట్లోనే ఉంటోంది. కుమారుడు ప్రవీణ్‌కుమార్‌కు వివాహమైంది. భార్యతో గొడవల కారణంతో ఆయన ఏడు నెలల క్రితం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పటి నుంచి మాణయ్య ఇంట్లో భార్య ఇందిరమ్మ, కూతుళ్లు, మనవరాలితో కలిసి ఉంటున్నారు. ఈ క్రమంలో కొంతకాలంగా మాణయ్య మద్యానికి బానిసయ్యాడు. నిత్యం భార్య, కూతుళ్లను దూషించేవాడు. బుధవారం అర్ధరాత్రి అతిగా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. తలుపులు వేసి ఉండటంతో భార్య, కూతుళ్లను దుర్భాషలాడుతూ.. అక్కడే ఉన్న గడ్డపార, గొడ్డలితో తలుపులు విరగ్గొట్టే ప్రయత్నం చేశాడు. తల్లీకూతుళ్లు బయటకు వచ్చి మాణయ్య వద్ద ఉన్న గొడ్డలి, గడ్డపారను లాక్కున్నారు. దీంతో ఆగ్రహించిన మాణయ్య కుమార్తె సుకన్యపై అసభ్యంగా ప్రవర్తించే ప్రయత్నం చేశాడు. కోపోద్రిక్తురాలైన ఇందిరమ్మ తన వద్ద ఉన్న గొడ్డలితో భర్తను మెడపై నరికింది. తీవ్రంగా గాయపడిన మాణయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామస్థుల ద్వారా విషయం తెలుసుకున్న జోగిపేట సీఐ అనిల్‌కుమార్, పుల్కల్‌ ఎస్సై శ్రీకాంత్‌ అదే రాత్రి ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. వివరాలు సేకరించారు. ఇందిరమ్మను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు