బాలుడి ఊపిరి తీసిన చీర ఊయల!

ఊయల ఊగుతున్న పదకొండేళ్ల బాలుడు.. మెలితిరిగిన చీర ఊయల మెడకు చుట్టుకోవడంతో ఊపిరాడక మృతి చెందాడు. తెలంగాణలోని కుమురంభీం జిల్లా చింతలమానెపల్లి మండలంలోని దిందా గ్రామంలో మంగళవారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

Updated : 26 Jun 2024 06:13 IST

మెలి తిరిగి మెడకు చుట్టుకోవడంతో అపస్మారక స్థితిలోకి
ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి

చింతలమానెపల్లి, న్యూస్‌టుడే: ఊయల ఊగుతున్న పదకొండేళ్ల బాలుడు.. మెలితిరిగిన చీర ఊయల మెడకు చుట్టుకోవడంతో ఊపిరాడక మృతి చెందాడు. తెలంగాణలోని కుమురంభీం జిల్లా చింతలమానెపల్లి మండలంలోని దిందా గ్రామంలో మంగళవారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన డగే నారాయణ, లక్ష్మి దంపతుల కుమారుడు అంజన్న(11).. ఇంట్లో చీరతో కట్టిన ఊయలపై మంగళవారం ఊగుతూ ఆడుకుంటుండగా.. కుటుంబసభ్యులు ఇంటిబయట చెట్టుకింద ఉన్నారు. వారు వచ్చి చూసేసరికి.. చీర మెలితిరిగి మెడకు చుట్టుకొని బాలుడు అపస్మారక స్థితిలో ఉండడంతో వెంటనే అంబులెన్స్‌ను పిలిపించారు. ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే బాలుడు మృతి చెందాడు. గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి పూర్తిచేసిన అంజన్నను.. ఈ వారంలో పక్క గ్రామమైన కేతినిలోని గిరిజన ఆశ్రమ బాలుర పాఠశాలలో చేర్పించేందుకు తల్లిదండ్రులు సిద్ధమవుతున్నారు. అంతలోనే ఈ ఘటన జరగడంతో వారు గుండెలవిసేలా రోదించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు