భార్యను కడతేర్చిన భర్త

కట్టుకున్నవాడే కాలయముడు అయ్యాడు.. జీవితాంతం ప్రేమతో చూసుకోవాల్సిన భార్యను దారుణంగా కడతేర్చాడు. ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారనే విషయాన్ని మర్చిపోయి హత్య చేశాడు.. ఆమె ఒంటిపై ఉన్న బంగారాన్ని తీసుకుని, ఓ గొర్రె పిల్లను సైతం చంపేసి.. ఆపై ఎవరో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు చిత్రీకరించాడు.

Published : 26 Jun 2024 06:19 IST

సుమత (పాత చిత్రం)

భూపాలపల్లి, న్యూస్‌టుడే : కట్టుకున్నవాడే కాలయముడు అయ్యాడు.. జీవితాంతం ప్రేమతో చూసుకోవాల్సిన భార్యను దారుణంగా కడతేర్చాడు. ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారనే విషయాన్ని మర్చిపోయి హత్య చేశాడు.. ఆమె ఒంటిపై ఉన్న బంగారాన్ని తీసుకుని, ఓ గొర్రె పిల్లను సైతం చంపేసి.. ఆపై ఎవరో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు చిత్రీకరించాడు. ఈ ఘటన భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఆకుదారివాడ గ్రామంలో మంగళవారం వెలుగుచూసింది. మృతురాలి తండ్రి, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని మల్హర్‌ మండలం అనుసాన్‌పల్లి గ్రామానికి చెందిన ఇస్లావత్‌ సుమత(30)ను 2016లో ఆకుదారివాడలో నివాసం ఉంటున్న ఇస్లావత్‌ హతిరాంనకు ఇచ్చి పెళ్లి చేశారు. కొన్నేళ్లు కాపురం సజావుగానే సాగింది. ఏడాదిన్నరగా భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో గొడవలు జరుగుతున్నాయి. రెండుసార్లు గ్రామంలో పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. మంగళవారం ఉదయం హతీరాం పనికి వెళ్లాడు. ఇంట్లో ఇద్దరు చిన్న పిల్లలను పాఠశాలకు పంపించి.. సుమత ఇంటి సమీపంలో సింగరేణి ఓసీ-2 గని సమీపంలో ఖాళీగా ఉన్న పాత ఇళ్ల ప్రాంతంలో గొర్రె పిల్లను మేత కోసం తీసుకెళ్లింది.. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో హతీరాం ఇంటికి రాగా, తాళం వేసి ఉండటంతో ఓసీ-2 సమీపంలోని పాత ఇళ్ల వద్దకు వెళ్లి చూశాడు. అక్కడే ఇద్దరు కాసేపు గొడవపడ్డారు. ఈ క్రమంలో ఆమెను చున్నీతో ఉరేసి చంపాడు. ఒంటిపైనున్న బంగారు గొలుసులు తీసుకున్నాడు. అక్కడే ఉన్న గొర్రె పిల్లను సైతం చంపేశాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతురాలికి ఒక పాప, బాలుడు ఉన్నారు. మృతురాలి తండ్రి గుగులోతు రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నరేష్‌కుమార్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు