Software Engineer Deepthi Murder Case: చెల్లే చంపింది

జగిత్యాల జిల్లా కోరుట్లలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దీప్తి (22)ని.. సొంత చెల్లి చందనే హత్య చేసిందని తేలింది.

Updated : 03 Sep 2023 13:18 IST

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దీప్తి మృతి కేసులో వీడిన మిస్టరీ
ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు జగిత్యాల ఎస్పీ వెల్లడి
నగలు, డబ్బుతో పారిపోబోతుంటే అడ్డుకుందనే అఘాయిత్యం

కరీంనగర్‌, ఈనాడు; జగిత్యాల, కోరుట్ల, న్యూస్‌టుడే: జగిత్యాల జిల్లా కోరుట్లలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దీప్తి (22)ని.. సొంత చెల్లి చందనే హత్య చేసిందని తేలింది. ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోయేందుకు ప్రయత్నించే క్రమంలో అడ్డు వచ్చిందని తోబుట్టువును ప్రియుడితో కలిసి తుదముట్టించినట్లు వెల్లడైంది. జగిత్యాలలో ఎస్పీ భాస్కర్‌ శనివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ‘‘కోరుట్లకు చెందిన బంక శ్రీనివాస్‌రెడ్డి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అయిన పెద్ద కుమార్తె దీప్తి (22) ఇంటి నుంచే విధులు నిర్వహిస్తోంది. రెండో కుమార్తె చందన బీటెక్‌ చేసి ఇంటి వద్దే ఉంటుండగా, కుమారుడు బెంగళూరులో చదువుకుంటున్నాడు. గత నెల 28న శ్రీనివాస్‌రెడ్డి దంపతులు హైదరాబాద్‌లో వివాహానికి వెళ్లగా అక్కాచెల్లెళ్లు మాత్రమే ఇంట్లో ఉన్నారు. 29వ తేదీ దీప్తి సోఫాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండగా.. చందన అదృశ్యమైంది.

ధనముందని చెప్పి.. పెళ్లికి ఒప్పించి..

మేడ్చల్‌ సమీపంలోని ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ చదివిన చందనకు తన క్లాస్‌మేట్‌ ఉమర్‌ షేక్‌ సుల్తాన్‌తో ప్రేమ వ్యవహారం ఉంది. అతను ఇంజినీరింగ్‌లో సీనియర్‌ అయినా డిటైన్‌ కావడంతో ఆమెతో కలిసి చదివాడు. ఉమర్‌ స్వస్థలం నెల్లూరు. ప్రస్తుతం అతని కుటుంబం హైదరాబాద్‌లోని అడ్డగుట్ట, ప్రగతినగర్‌లో నివాసముంటోంది. గత నెల 19న ఉమర్‌ కోరుట్లకు వచ్చాడు. అప్పుడే చందన పెళ్లి ప్రస్తావన తెచ్చింది. జీవితంలో నిలదొక్కుకున్నాక చేసుకుందామని అంటే వినలేదు. తమ ఇంట్లో బంగారం, నగదు ఉన్నాయని చెప్పి అతణ్ని ఒప్పించింది. ఉమర్‌ తన తల్లి సయ్యద్‌ అలియా మహబూబ్‌, చెల్లి షేక్‌ ఆసియా ఫాతిమాతో వాట్సప్‌ కాల్‌లో మాట్లాడించి హైదరాబాద్‌ వెళ్లిపోయాడు. అదను కోసం చూస్తున్న చందన గత నెల 28న తల్లిదండ్రులు హైదరాబాద్‌కు వెళ్లడంతో ప్రియుడికి ఫోన్‌ చేసి రమ్మని చెప్పింది.

అతను అదేరోజు ఉదయం 11 గంటలకు కారులో కోరుట్లకు చేరుకున్నాడు. ఇంటి వెనకాలే కారులో నిరీక్షించాడు. రాత్రి దీప్తి ఓడ్కా తాగింది. చందన బ్రీజర్‌ తాగింది. తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో బీరువా తీసి బంగారం, డబ్బు బ్యాగ్‌లో వేసుకుంటుండగా.. దీప్తి నిద్రలేచి ఆమెను వారిస్తూ పెద్దగా అరవడంతో చందన ప్రియుడిని లోపలికి పిలిచింది. తన స్కార్ఫ్‌తో సోదరి మూతికి, ముక్కుకు చుట్టి, అరవొద్దని గట్టిగా అదిమి పట్టింది. ఉమర్‌.. చున్నీతో చేతులు కట్టేశాడు. అయినా దీప్తి అరుపులు ఆపకపోవడంతో ప్రియుడి సాయంతో చందన.. అక్క మూతికి, ముక్కుకు ప్లాస్టర్‌ వేసింది. దీంతో దీప్తి సోఫాలో పడిపోయింది. కొద్దిసేపటికి ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్నాక.. మందు తాగి మృతి చెందిందని నమ్మించేలా చందన, ఉమర్‌ ఆమెకు వేసిన ప్లాస్టర్‌ను తీసేసి, కట్లు విప్పేసి డబ్బు, నగలతో పారిపోయారు.

నమ్మించడానికి ఆడియో సందేశం

కోరుట్ల నుంచి చందన, ఉమర్‌తో కలిసి హైదరాబాద్‌లోని అతనింటికి వెళ్లింది. తర్వాత చందన తన సోదరుడి సెల్‌ఫోన్‌కు ఆడియో క్లిప్‌ను పంపించింది. ప్రియుడు, అతని తల్లి సూచించడంతో ‘అక్కను తాను చంపలేదని మద్యం తాగిన తరువాత ఏమైందో తనకు తెలియదని’ వాట్సప్‌ చేసింది. తీసుకెళ్లిన బంగారం, డబ్బుతో ముంబయి లేదా నాగ్‌పుర్‌ వెళ్లిపోవాలని ఉమర్‌ కుటుంబీకులు ప్రోత్సహించారు. దీప్తి మృతి సమాచారం తెలిసినప్పటికీ ఉమర్‌ తల్లి, చెల్లి పోలీసులకు చెప్పకపోవడంతో హంతకులకు సహకరించారని వారిపైనా కేసు నమోదు చేశారు. కారులో వీరిని పలుచోట్లకు తీసుకెళ్లిన హఫీజ్‌ అనే స్నేహితుడిపై కూడా కేసు నమోదు చేసి మొత్తం అయిదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా పోలీసులు వారిని పట్టుకున్నారు. శనివారం నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ చౌరస్తాలో వాహన తనిఖీల్లో భాగంగా పట్టుకుని అరెస్టు చేశారు. వారి సెల్‌ఫోన్లతోపాటు కారు, 70 తులాల బంగారు ఆభరణాలు, రూ.1.20 లక్షల నగదును పోలీసులు స్వాధీనపర్చుకున్నారు’’ అని ఎస్పీ తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని