వివాహితతో ప్రేమ.. పట్టపగలు యువకుడి దారుణ హత్య

తను ప్రేమించిన యువతికి పెళ్లయినా.. ఇంకా ఆమెతో మాట్లాడుతున్న నేపథ్యంలో ఒక యువకుడు పట్టపగలే దారుణహత్యకు గురయ్యాడు.

Published : 26 Jun 2023 08:13 IST

సారంగాపూర్‌, న్యూస్‌టుడే: తను ప్రేమించిన యువతికి పెళ్లయినా.. ఇంకా ఆమెతో మాట్లాడుతున్న నేపథ్యంలో ఒక యువకుడు పట్టపగలే దారుణహత్యకు గురయ్యాడు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా బీర్‌పూర్‌ మండలంలో ఆదివారం జరిగింది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. బీర్‌పూర్‌కు చెందిన జువ్వికింది వంశీ (23) తుంగూర్‌లోని డ్రైవింగ్‌ స్కూల్‌లో పనిచేస్తున్నాడు. ఇదే మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి, వంశీ గతంలో ప్రేమించుకున్నారు. ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలియడంతో రెండేళ్ల కిందట ఆమెకు మరో వ్యక్తితో పెళ్లి చేశారు. అయినప్పటికీ వంశీ, ఆ యువతి తరచూ ఫోన్లో మాట్లాడుకుంటున్నారని, కలుసుకుంటున్నారన్న అనుమానంతో ఆమె కుటుంబసభ్యులు అతడిని పలుమార్లు హెచ్చరించారు. అయినా అతడిలో మార్పు రాలేదన్న కోపంతో హత్యకు పాల్పడ్డారని సమాచారం.

వంశీ ఆదివారం కొల్వాయి నుంచి తుంగూర్‌కు ద్విచక్రవాహనంపై వస్తుండగా ఇద్దరు వ్యక్తులు అడ్డగించి గొడ్డలి, ఇతర ఆయుధాలతో తలపై దాడి చేయడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఇది తెలిసి.. వంశీ బంధువులు, గ్రామస్థులు అక్కడికి వచ్చి ఆందోళన చేశారు. నిందితులను తమకు అప్పగించాలంటూ ధర్నాకు దిగారు. మృతదేహాన్ని తరలించేందుకు పోలీసులు యత్నించగా మృతుడి తల్లి భాగ్య, బాబాయి అక్కడే ఉన్న లారీ కింద పడుకున్నారు. డీఎస్పీ ప్రకాశ్‌, సీఐ ఆరీఫ్‌ అలీ, సారంగాపూర్‌, రాయికల్‌ ఎస్‌ఐలు తిరుపతి, అజయ్‌లు వారితో చర్చించారు. నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పి శాంతింపజేశారు. యువతి తండ్రి రమేష్‌, సోదరుడు విష్ణు కలిసి హత్య చేశారంటూ వంశీ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. వంశీ సెల్‌ఫోన్‌ కనిపించడంలేదని, హంతకులు తీసుకెళ్లి ఉంటారని బాధితులు ఆరోపిస్తున్నారు. భాగ్య కూలి పనులు చేసుకుంటుండగా తండ్రి శ్రీహరి ఉపాధి నిమిత్తం ముంబయిలో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని