Fire Accident: షాద్‌నగర్‌లోని పరిశ్రమలో భారీ పేలుడు.. ఐదుగురు దుర్మరణం

షాద్‌నగర్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక సౌత్‌ గ్లాసు ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో కంప్రెషర్‌ పేలడంతో పలువురు కార్మికులు మృతిచెందారు.

Updated : 28 Jun 2024 21:37 IST

ఘటనాస్థలిలో చెల్లాచెదురుగా పడిన శరీరభాగాలు (ఇన్‌సెట్‌లో)

షాద్‌నగర్‌: రంగారెడ్డి జిల్లాలోని షాద్‌నగర్‌లో పెను విషాదం చోటు చేసుకుంది. స్థానిక సౌత్‌ గ్లాసు పరిశ్రమలో కంప్రెషర్‌ పేలడంతో ఐదుగురు మృతి చెందారు. ఈ పేలుడుతో పరిశ్రమ వద్ద భీతావహ వాతావరణం నెలకొంది. గాజు పరిశ్రమ కావడంతో కార్మికుల మృతదేహాలు ఛిద్రమయ్యాయి. ఈ ఘటనలో 15మందికి గాయాలు కాగా.. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలు అదుపు చేశారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ఘటనాస్థలిని జిల్లా కలెక్టర్‌ శశాంక పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కంప్రెషర్‌ సేఫ్టీ వాల్‌ పనిచేయకపోవడం వల్లే పేలుడు జరిగింది. ప్రమాదంలో ఐదుగురు చనిపోయినట్లు ప్రాథమికంగా నిర్థరణకు వచ్చాం. బాధితులంతా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారే. సహాయక చర్యలు కొనసాగిస్తున్నాం’’అని తెలిపారు. 

మృతులను బిహార్‌కు చెందిన రాం ప్రకాశ్‌ (31), చిత్తరంజన్‌ (31), యూపీకి చెందిన నిఖిత్‌ కుమార్‌ (22), రాంసేతు (24); ఒడిశాకు చెందిన రథికాంత్‌ (25)గా గుర్తించారు.  ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు కార్మికసంఘం నేతలు చెబుతున్నారు. గతంలో ఇక్కడ ఇలాంటి ఘటన జరిగినప్పుడే కార్మికుల భద్రత దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోవాలని ఇచ్చిన సూచనల్ని ఏ మేరకు పాటించారనే విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సౌత్‌ గ్లాస్‌ పరిశ్రమను శంషాబాద్‌ డీసీపీ రాజేశ్ పరిశీలించారు.

క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని సీఎం ఆదేశం

షాద్‌నగర్‌లో జరిగిన ప్రమాదంపై సీఎం రేవంత్‌ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారుల్ని అప్రమత్తం చేసిన ఆయన.. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సూచించారు.

  • ఈ దుర్ఘటనపై భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని