Rajamahendravaram: వైకాపా ప్రచార రథం తగలబెట్టింది మాజీ ఎంపీ భరత్‌రామ్‌ అనుచరుడే

రాజమహేంద్రవరం మాజీ ఎంపీ భరత్‌రామ్‌ ఎన్నికల ప్రచార రథం దగ్ధం కేసులో అసలు నిజాలు బయటికొచ్చాయి.

Published : 05 Jul 2024 04:47 IST

సానుభూతి కోసమే దుశ్చర్యకు పాల్పడినట్లు పోలీసుల వెల్లడి

రాజమహేంద్రవరం నేరవార్తలు, న్యూస్‌టుడే: రాజమహేంద్రవరం మాజీ ఎంపీ భరత్‌రామ్‌ ఎన్నికల ప్రచార రథం దగ్ధం కేసులో అసలు నిజాలు బయటికొచ్చాయి. తమ నాయకుడికి సానుభూతి కోసం వైకాపా కార్యకర్తే ఆ రథాన్ని కాల్చినట్లు వెల్లడైంది. గురువారం ఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ ఎం.కిషోర్‌కుమార్‌ ఈ కేసు వివరాలు వెల్లడించారు. జూన్‌ 28న రాత్రి రాజమహేంద్రవరం వీఎల్‌పురం వద్ద ఉన్న మాజీ ఎంపీ భరత్‌రామ్‌ కార్యాలయ ఆవరణలో ఆయన ప్రచార రథం పూర్తిగా దగ్ధమైంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడం మానేసి, ఆయన ప్రెస్‌మీట్‌ పెట్టి తెదేపా నాయకులు రథాన్ని కాల్చేశారంటూ విరుచుకుపడ్డారు. నాలుగు రోజుల తర్వాత డీజీపీకి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిఘా పెట్టి మాజీ ఎంపీ అనుచర వర్గంలోని వ్యక్తే అసలు కారకుడిగా నిర్ధారించారు. దంగేటి శివాజీ మాజీ ఎంపీ భరత్‌రామ్‌తో పాటు ఆయన తండ్రి నాగేశ్వరరావుకు ప్రధాన అనుచరుడు. అతడిపై స్థానిక స్టేషన్లలో పలు కొట్లాట కేసులు కూడా ఉన్నాయి. భరత్‌ అనుచరులు నిత్యం కార్యాలయ ఆవరణలో మద్యం తాగుతుంటారు. ఘటన జరిగిన రోజు రాత్రి శివాజీ మద్యం తాగి అందరూ వెళ్లిపోయిన తర్వాత రాత్రి 11 గంటల సమయంలో ఓ పాలిథిన్‌ కవర్‌లో పెట్రోల్‌ పోసి దానిని ప్రచార రథం ముందు టైరుపై ఉంచాడు. దోమలకు వినియోగించే కాయిల్‌ ముక్కను వెలిగించి కవర్‌పై ఉంచి కొంత సమయం తర్వాత నిప్పు అంటుకునేలా టైరుపై ఉంచి పరారయ్యాడు. నిమిషాల వ్యవధిలో టైరు కాలి వాహనానికి పూర్తిగా మంటలు వ్యాపించాయి. తానే ఈ పని చేసినట్లు శివాజీ ఒప్పుకొన్నట్లుగా పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండ్‌ విధించినట్లు డీఎస్పీ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని