Explosion: బతుకులు ఛిద్రం!

రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. షాద్‌నగర్‌లోని సౌత్‌ గ్లాస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీలో శుక్రవారం జరిగిన పేలుడు ఘటనలో అయిదుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు.

Published : 29 Jun 2024 04:32 IST

సౌత్‌గ్లాస్‌ పరిశ్రమలో పేలుడు
అయిదుగురు కార్మికుల దుర్మరణం..
13 మందికి గాయాలు..వారిలో పలువురి పరిస్థితి విషమం
చెల్లాచెదురైన మృతదేహాలు, తెగిపడిన శరీర భాగాలతో భీతావహం
మృతులు ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, ఒడిశా వాసులుగా గుర్తింపు
షాద్‌నగర్‌లో దుర్ఘటన.. సీఎం దిగ్భ్రాంతి

పేలుడు ధాటికి చెల్లాచెదురైన పరిశ్రమలోని యంత్ర భాగాలు

ఈనాడు, హైదరాబాద్, న్యూస్‌టుడే, షాద్‌నగర్, షాద్‌నగర్‌ న్యూటౌన్‌: రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. షాద్‌నగర్‌లోని సౌత్‌ గ్లాస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీలో శుక్రవారం జరిగిన పేలుడు ఘటనలో అయిదుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. 13 మందికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని హుటాహుటిన చాంద్రాయణగుట్టలోని డీఆర్‌డీవో ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారిని స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. మృతులు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన నికిత్‌కుమార్‌ (22) రామ్‌సేథ్‌(24), బిహార్‌కు చెందిన చిత్తరంజన్‌ (31), రామ్‌ప్రకాష్‌ (31), ఒడిశాకు చెందిన రథీకాంత్‌(25)గా గుర్తించారు. గాయపడిన వారిలో షాద్‌నగర్‌ సమీప కాశిరెడ్డిగూడకు చెందిన రోజు వారీ కూలీలు నీలమ్మ, మమత, బూర్గులకు చెందిన సుజాత (24) ఉన్నారని, మిగిలిన వారు బిహార్, ఝార్ఖండ్‌ వాసులని పోలీసులు నిర్ధారించారు.

ప్రమాదానికి కారణమైన ఫర్నేస్‌ కంప్రెషర్‌ ఇదే..

కీహోల్‌ తెరుచుకోకపోవడంతో..

పరిశ్రమ ఆవరణలో రెండు యూనిట్లున్నాయి. కార్మికులు రెండు షిఫ్టుల్లో పనిచేస్తున్నారు. ఒక షిఫ్టు సాయంత్రం 5గంటలకు పూర్తవుతుంది. దానికి 15 నిమిషాల ముందు ఆటోక్లేవ్‌ యూనిట్‌లో ఫర్నేస్‌ కంప్రెషర్‌ (వాహనాల అద్దాలను తయారుచేసే యంత్రం) పేలినట్లు పరిశ్రమల శాఖ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ‘‘గ్లాస్‌ లామినేషన్‌ ప్రక్రియలో ఫర్నేస్‌ కంప్రెషర్‌ పైనఉండే కీహోల్‌ దానంతటదే తెరుచుకుంటుంది. పీడనం పెరుగుతున్నా అది తెరుచుకోకపోవడంతో ఒత్తిడి ఎక్కువై పేలుడు జరిగినట్లు గుర్తించాం. ఆ సమయంలో యూనిట్‌లో 130 డిగ్రీల ఉష్ణోగత నమోదైంది. 115 మంది కార్మికులు పనిచేస్తున్నారు’’ అని పేర్కొన్నారు.

కార్మికులకు రక్షణ కిట్‌లు ఇవ్వకుండానే..

ప్రమాదకరమైన ఈ యూనిట్‌లో కార్మికులు రక్షణ కిట్‌లు లేకుండానే టీషర్ట్, టోపీలతో పనిచేస్తున్నట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. ఈ కారణంగానే పేలుడు ధాటికి మృతదేహాలు ఛిద్రమయ్యాయి. వారి తాలూకు శరీర భాగాలు తెగిపోయి చెల్లాచెదురుగా పడటంతో అక్కడ భీతావహ వాతావరణం నెలకొంది. మృతులు ఎవరనేది గుర్తించేందుకు చాలా సమయం పట్టిందని పోలీసులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ కె.శశాంక మాట్లాడుతూ... క్షతగాత్రులను హుటాహుటిన ప్రైవేటు ఆసుపత్రికి తరలించామని, మృతులు, బాధితుల కుటుంబాలకు సమాచారం ఇచ్చామన్నారు. డీసీపీ రాజేశ్‌ మాట్లాడుతూ... యాజమాన్యానికి సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామన్నారు.


సమన్వయంతో సహాయక చర్యలు

-సీఎం

పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. గాయపడిన వారికి వైద్య చికిత్సలు అందించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక, కార్మిక, పరిశ్రమల శాఖలు సమన్వయంతో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశాలిచ్చారు.

ప్రమాదంపై భారాస అధినేత కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన కుటుంబాలకు సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని, గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌ మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలిపారు.


గతంలోనూ అనేక ఘటనలు

షాద్‌నగర్‌ పరిధిలోని బూర్గుల గ్రామ సమీపంలో పదుల సంఖ్యలో పరిశ్రమలున్నాయి. సౌత్‌గ్లాస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సమీపంలో ఉన్న ‘బ్లైండ్‌ కలర్‌’ పరిశ్రమలో గతేడాది ఇలాంటి ఘటనే జరిగింది. పరిశ్రమలో కార్మికులు పనిచేస్తున్న సమయంలోనే బాయిలర్‌లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. నలుగురు చికిత్స పొందుతూ మృతి చెందారు.

  • 2014లో కొత్తూరులోని వినాయక స్టీల్‌ పరిశ్రమలో బాయిలర్‌ పేలి పదిమంది మృతి చెందారు.
  • 2014లో కొత్తూరులోని రాయలసీమ పరిశ్రమలో ప్రమాదం జరిగి నలుగురు కార్మికులు మృతి చెందారు.
  • 2015లో షాద్‌నగర్‌లో టీమ్‌ కోర్‌ పరిశ్రమలో ఫర్నేస్‌ పేలి 12 మంది కార్మికులు మృత్యువాత పడ్డారు.
  • గత ఆరేళ్ల కాలంలో మొగిలిగిద్ద, ఎలికట్టలోని ఐరన్‌ పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగి ఆరుగురు కార్మికులు బలయ్యారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని