Crime news: అమ్మాయితో ప్రేమ వివాదం.. బీరు సీసాలతో కొట్టి హత్య

అమ్మాయి విషయంలో గొడవపడి తోటి స్నేహితుడిని దారుణంగా హత్య చేశారు కొందరు విద్యార్థులు.

Updated : 29 Jun 2024 19:36 IST

హైదరాబాద్‌: అమ్మాయి విషయంలో గొడవపడి తోటి స్నేహితుడిని దారుణంగా హత్య చేశారు కొందరు విద్యార్థులు. ఎవరికీ తెలియకుండా మృతదేహాన్ని రైలు పట్టాలపై పారేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఈ కేసును ఛేదించిన అల్లాపూర్ పోలీసులు నిందితులను శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు. నిందితులంతా 20 ఏళ్లలోపు వారే కావడం గమనార్హం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్‌పల్లి అల్లాపూర్‌కు చెందిన అహ్మద్, అన్వరీ బేగం కుమారుడు డానీష్(17) యూసఫ్‌గూడలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. అదే కళాశాలలో చదువుతున్న ఓ రౌడీషీటర్ కుమారుడు, మరికొంత మందితో అతనికి స్నేహం ఉంది. తనతో బంధుత్వం ఉన్న యువతితో డానీష్‌ చనువుగా ఉండడాన్ని రౌడీషీటర్‌ కుమారుడు జీర్ణించుకోలేకపోయాడు. తాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న యువతితో నువ్వెందుకు తిరుగుతున్నావంటూ పలుమార్లు గొడవపడ్డాడు.

ఈ నేపథ్యంలో ఈ నెల 22న రాత్రి 9.30 గంటలకు ఇంటి నుంచి వెళ్లిన డానీష్ తిరిగి రాలేదు. మరుసటి రోజు బోరబండ రైల్వే స్టేషన్ సమీపంలోని రైలు పట్టాలపై ఛిద్రమైన స్థితిలో అతని మృతదేహం లభించింది. హత్య కావొచ్చని మృతుడి తల్లిదండ్రులు అల్లాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేయగా.. బీరు సీసాలతో విచక్షణారహితంగా కొట్టి డానీష్‌ను అడ్డు తొలగించుకోవాలని రౌడీషీటర్ కుమారుడు మిత్రులతో కలిసి కుట్ర పన్నినట్లు తెలిసింది. ఫోన్‌ చేసి డానీష్‌ను అక్కడికి రప్పించారని పోలీసులు తెలిపారు. అతడు వచ్చాక రౌడీషీటర్‌ కుమారుడు, అతడి మిత్రులు కలిసి కొంతసేపు గంజాయి తాగి, ముందే సిద్ధంగా ఉంచుకున్న ఖాళీ బీరు సీసాలతో దాడి చేశారు. అప్పటికీ డానీష్ చనిపోకపోవడంతో గొంతుపిసికి ప్రాణాలు తీసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని రైలు పట్టాలపై పడేశారని తెలిపారు. హత్య జరిగిన ప్రదేశంలోని చరవాణి సిగ్నల్స్‌ ఆధారాలతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఐదుగురిని కోర్టులో హాజరుపరిచి.. జువైనల్ హోమ్‌కు తరలించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు