Crime News: బాలికపై సామూహిక అత్యాచారం

బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం గరువుపాలెం శివారులో బాలికపై అయిదుగురు యువకులు సామూహికంగా అత్యాచారం చేశారు.

Updated : 30 Jun 2024 06:32 IST

అయిదుగురు నిందితులపై పోక్సో కేసు నమోదు 

రేపల్లె అర్బన్, నిజాంపట్నం, న్యూస్‌టుడే: బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం గరువుపాలెం శివారులో బాలికపై అయిదుగురు యువకులు సామూహికంగా అత్యాచారం చేశారు. ఈ ఘటనకు సంబంధించి నిందితులపై పోక్సో కేసు నమోదైంది. రేపల్లె గ్రామీణ సీఐ కార్యాలయంలో డీఎస్పీ మురళీకృష్ణ శనివారం విలేకరులకు కేసు వివరాలు వెల్లడించారు. వేమూరు మండలం పెరవలి గ్రామానికి చెందిన ఓ బాలిక మూడురోజుల క్రితం నిజాంపట్నం మండలం గరువుపాలెంలోని అమ్మమ్మ ఇంటికి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న పెరవలికి చెందిన ఇద్దరు బాలురుతో పాటు వెంకటేశ్, సతీష్, వేణు అనే యువకులు శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో గరువుపాలెం వెళ్లారు. యువకులతో పాటు వెళ్లిన ఓ బాలుడికి బాలికతో పరిచయం ఉంది. ఆ బాలుడు.. బాలిక అమ్మమ్మ ఇంటి వద్దకు వెళ్లి ఫోన్‌ చేయగా ఆమె బయటకు వచ్చింది. అనంతరం ఇద్దరు బాలురు కలిసి బాలికను ద్విచక్ర వాహనంపై గరువుపాలెం శివారులోని మామిడితోటలోకి తీసుకెళ్లారు. అప్పటికే అక్కడ ఉన్న మరో ముగ్గురు యువకులతో కలిసి బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రాత్రి పది గంటల సమయంలో బాలిక ఇంట్లో కనిపించకపోవడంతో కంగారుపడిన అమ్మమ్మ, మేనమామ వెతకడం ప్రారంభించారు. అంతలో గ్రామ శివారు నుంచి ఏడుస్తూ వస్తున్న బాలికను చూసి మేనమామ ఏం జరిగిందని నిలదీయగా అత్యాచారం విషయం చెప్పింది. ఆయన పోలీసులకు సమాచారం అందించడంతో అడవులదీవి ఎస్సై వెంకటరవి గరువుపాలెం వచ్చి వివరాలు సేకరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులపై కిడ్నాప్, అత్యాచారం, పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. బాధితురాలు పదోతరగతి తప్పడంతో ఇటీవల సప్లిమెంటరీ పరీక్ష రాసింది. నిందితులు అయిదుగురూ పదోతరగతి వరకు చదివి డీజే పనులు చేస్తున్నారు. నిందితులను నగరం మండలం సజ్జావారిపాలెం వద్ద అరెస్టు చేశామని డీఎస్పీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని