ITR: ఆదాయ పన్ను రిటర్నులు.. మీకు ఏ ఫారం వర్తిస్తుందో తెలుసా?

ITR: పొరపాటున తప్పు ఫారాన్ని ఎంచుకుంటే ఆదాయపు పన్ను శాఖ దానిని ‘డిఫెక్టివ్‌ రిటర్ను’గా పరిగణించే ప్రమాదం ఉంది.

Published : 20 Jun 2024 12:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గత ఆర్థిక సంవత్సరానికి గానూ ఆదాయపు పన్ను రిటర్నులను (Income Tax Returns- ITR) దాఖలు చేసేందుకు సమయం వచ్చేసింది. జులై 31 లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఐటీఆర్‌ దాఖలు చేసేందుకు సరైన ఫారాన్ని ఎంచుకోవడం తప్పనిసరి. కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం (CBDT) ఇప్పటికే ఈ ఫారాలను నోటిఫై చేసింది. పొరపాటున తప్పు ఫారాన్ని ఎంచుకుంటే, ఆదాయపు పన్ను శాఖ దానిని అంగీకరించకపోవచ్చు. అప్పుడు అది ‘డిఫెక్టివ్‌ రిటర్ను’గా పరిగణిస్తారు.

ఆదాయం, నివాస స్థితి, వ్యాపారం తదితరాల ఆధారంగా ఈ ఫారాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. మొత్తం ఏడు ఫారాలు ఉన్నప్పటికీ ప్రధానంగా మూడు ఫారాలే మనకు ఉపయోగపడతాయి.

ఐటీఆర్‌ 1: ఇది చాలా సరళమైనది. రూ.50లక్షల లోపు వేతనం, ఒకే ఇంటిపై ఆదాయం, వడ్డీ, ఇతర మార్గాల్లో ఆదాయం అందుకున్నప్పుడు ఈ ఫారం వర్తిస్తుంది.

ఐటీఆర్‌ 2: రూ.50 లక్షలకు మించి ఆదాయం, మూలధన లాభాలు, వ్యాపార ఆదాయం, విదేశీ ఆదాయం, ఒకటికి మించి ఇళ్ల ద్వారా ఆదాయం వచ్చినప్పుడు ఈ ఫారాన్ని ఎంచుకోవచ్చు.

ఐటీఆర్‌ 3: సాధారణంగా హిందూ అవిభాజ్య కుటుంబం (HUF), వ్యాపారం, వృత్తి ద్వారా ఆదాయం ఆర్జించేవారు దీన్ని ఉపయోగించాలి.

ఐటీఆర్‌-4: వ్యక్తులు, హెచ్‌యూఎఫ్‌లు, భాగస్వామ్య సంస్థలు, సెక్షన్‌ 44AD లేదా 44AE ప్రకారం అంచనా ఆధారంగా ఆదాయాన్ని పేర్కొనేవారు, వేతనం లేదా పింఛను ద్వారా రూ.50 లక్షల వరకు ఆదాయం ఆర్జిస్తున్నవారు, ఒక ఇంటి నుంచి రూ.50 లక్షలకు మించని ఆదాయం ఉన్నవారు, ఇతర ఆదాయమార్గాల ద్వారా రూ.50 లక్షలు మించకుండా ఆర్జిస్తున్నవారు (లాటరీ, గుర్రపు పందేల్లో గెలుచుకున్న ఆదాయం ఉంటే ఈ ఫారం వర్తించదు) ఈ ఫారం వాడాలి.

ఐటీఆర్‌-5: ఈ ఫారం కంపెనీలు, ఎల్‌ఎల్‌పీ (Limited Liability Partnership), ఏఓపీలు (Association of Persons), బీఓఐలు (Body of Individuals), ఆర్టిఫిషియల్‌ జురిడికల్‌ పర్సన్‌ (AJP), ఎస్టేట్‌ ఆఫ్‌ డిసీజ్డ్‌, ఎస్టేట్‌ ఆఫ్‌ ఇన్‌సాల్వెంట్‌, బిజినెస్‌ ట్రస్ట్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ విభాగాల పరిధిలోకి వచ్చేవారు సమర్పించాలి.

ఐటీఆర్ ఫారం-6: సెక్షన్‌ 11 (ఛారిటీ, మతపరమైన అవసరాల కోసం ఉన్న ఆస్తి ద్వారా లభించిన ఆదాయం) కింద మినహాయింపు కోరని కంపెనీలు ఈ ఫారంను ఉపయోగించుకోవాలి. దీన్ని కచ్చితంగా ఎలక్ట్రానిక్‌ రూపంలోనే దాఖలు చేయాలి.

ఐటీఆర్ ఫారం-7: సెక్షన్‌ 139 (4ఏ), 139 (4బీ), 139 (4సీ), 139 (4డీ), 139 (4ఈ), 139 (4ఎఫ్‌) ప్రకారం రిట‌ర్నులు దాఖ‌లు చేసే వ్యక్తులు, కంపెనీల‌కు ఈ ఫారం వ‌ర్తిస్తుంది. ట్రస్టులు, రాజకీయ పార్టీలు, సంస్థలు, కళాశాల‌లు, మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థలు దీని పరిధిలోకి వ‌స్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని