Nithin Kamath: ఎఫ్‌డీ కంటే మెరుగైన రిటర్నులు.. స్టాక్స్‌ కంటే తక్కువ రిస్క్‌

Nithin Kamath: కార్పొరేట్‌ బాండ్ మార్కెట్లో రిటైల్ మదుపర్లు పాల్గొనేందుకు డెట్‌ సెక్యూరిటీల ముఖ విలువను తగ్గించడంపై జెరోదా సహ వ్యవస్థాపకుడు నితిన్‌ కామత్ హర్షం వ్యక్తం చేశారు.

Updated : 01 May 2024 16:53 IST

Nithin Kamath | ఇంటర్నెట్‌డెస్క్‌: కష్టపడిన సంపాదన నుంచి మెరుగైన రాబడిని అందించే మార్గాల కోసం ప్రతిఒక్కరూ అన్వేషించడం సహజం. అయితే వీటిలో ఒక్కొక్కరిదీ ఒక్కో అభిప్రాయం. కొందరు ఎఫ్‌డీలో పెట్టుబడి పెట్టడం మంచిదంటే.. మరికొందరేమో స్టాక్స్‌లో మదుపు చేయటమే బెటర్‌ అని అంటుంటారు. అయితే బాండ్లలో ఇన్వెస్ట్ చేయటం ఉత్తమం అంటారు జెరోదా (Zerodha) సహ వ్యవస్థాపకుడు, కంపెనీ సీఈఓ నితిన్‌ కామత్‌ (Nithin Kamath). సెబీ తీసుకున్న కొత్త నిర్ణయంపై తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.

కార్పొరేట్‌ బాండ్‌ మార్కెట్లో రిటైల్‌ మదుపర్లు మరింతమంది పాల్గొనడం కోసం ఆయా డెట్‌ సెక్యూరిటీల ముఖ విలువను ప్రస్తుతం ఉన్న రూ.లక్ష నుంచి రూ.10,000కు తగ్గించాలన్న ప్రతిపాదనకు మార్కెట్‌ నియంత్రణాధికార సంస్థ సెబీ ఆమోదం తెలిపింది. దీనిపై హర్షం వ్యక్తంచేసిన నితిన్‌ ఓ ట్వీట్‌ చేశారు. ‘‘కంపెనీలు రూ.10,000 ముఖ విలువతో బాండ్లను జారీ చేయవచ్చు. రిటైల్‌ మదుపరుల్ని బాండ్ల వైపు ఆకర్షించేందుకు తీసుకున్న గొప్ప చర్య ఇది. చాలాకాలం తర్వాత పలు మార్పులతో చిన్న పెట్టుబడిదారులకు బాండ్లను అందుబాటులో తీసుకురావడానికి సెబీ (SEBI) అద్భుతమైన పని చేసింది’’ అని కొనియాడారు.

మ్యూచువల్‌ ఫండ్ల కొత్త రూల్‌.. జాయింట్‌ ఖాతాలకు నామినీ తప్పనిసరేం కాదు!

‘‘చాలామంది భారతీయులకు సరైన పెట్టుబడి సాధనం బాండ్లనే మేము ఎల్లప్పుడూ విశ్వసిస్తాం. ఎందుకంటే ఇవి ఎఫ్‌డీ కంటే మెరుగైన రాబడి ఇస్తాయి, అలాగే స్టాక్‌ కంటే తక్కువ రిస్క్‌’’ అని కామత్‌ గతంలో కూడా బాండ్లపై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. బాండ్లు.. ఇప్పటివరకు సంపన్న భారతీయులు మాత్రమే ఇన్వెస్ట్‌ చేసే మదుపు సాధనంగా ఉండేవి. తాజాగా సెబీ ఆయా డెట్‌ సెక్యూరిటీల ముఖ విలువను తగ్గించడంతో రిటైల్‌ ఇన్వెస్టర్లు కూడా మదుపు చేసే అవకాశం కలిగింది. 

గమనిక: ఈ వార్త/కథనం సమాచారం కోసం మాత్రమే. ఫలానా వాటిలో పెట్టుబడులు పెట్టాలని ఈనాడు.నెట్‌ సూచించడం లేదు. ఆర్థిక నిపుణుల సలహాలు, సూచనలు మేరకు పెట్టుబడి నిర్ణయాలు తీసుకోండి..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని