Indexation: ఇండెక్సేషన్‌ అంటే ఏంటి ? ఇది పన్ను భారాన్ని ఎలా తగ్గిస్తుంది?

Indexation: పెట్టుబడులు, కొనుగోలు ధరల విలువ ద్రవ్యోల్బణానికి అనుగుణంగా తరిగిపోకుండా సర్దుబాటు చేసే పద్ధతే ఇండెక్సేషన్‌. ఇది పన్ను భారాన్ని ఎలా తగ్గిస్తుందో చూద్దాం..!

Updated : 25 Jun 2024 11:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు (ITR Filing) సమయం వచ్చేసింది. దీంతో చాలామంది పన్ను భారాన్ని ఎలా తగ్గించుకోవాలో ఆలోచిస్తుంటారు. ఈ విషయంలో ఇన్వెస్టర్లకు ఇండెక్సేషన్‌ (Indexation) చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఇంతకీ దీనర్థం ఏంటి? మదుపర్లకు ఎలాంటి ప్రయోజనం ఉంటుందో చూద్దాం..!

ఇండెక్సేషన్‌ అంటే..

ఇండెక్సేషన్ (Indexation) అనేది స్టాక్‌లు, బాండ్లు, రియల్‌ ఎస్టేట్‌ వంటి పెట్టుబడులను ద్రవ్యోల్బణానికి అనుగుణంగా సర్దుబాటు చేసే పద్ధతి. సాధారణంగా వీటిలో పెట్టుబడి ప్రస్తుత ధరలకు అనుగుణంగా ఉంటాయి. కాలక్రమేణా ద్రవ్యోల్బణం కారణంగా మన వాస్తవ పెట్టుబడి విలువ తరిగిపోతుంది. ఈనేపథ్యంలో దాన్ని తాజా ధరలకు అనుగుణంగా సర్దుబాటు చేసేందుకు ఇండెక్సేషన్‌ ఉపయుక్తంగా ఉంటుంది. ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసే రిటైల్‌ ద్రవ్యోల్బణ (Consumer Price Index- CPI) గణాంకాల ఆధారంగా ఇండెక్సేషన్‌ను అంచనా వేస్తారు. మూలధన లాభాలను కచ్చితంగా నిర్ణయించడంలో ఇది సహాయపడుతుంది. ద్రవ్యోల్బణాన్ని అధిగమించి వాస్తవ లాభాలపై మాత్రమే పన్నులు వర్తించేందుకు దోహదం చేస్తుంది.

ఉదాహరణ..

ఒక పెన్నును రూ.100లకు కొన్నామనుకొందాం. సంవత్సరం తర్వాత దాని ధర రూ.120కి చేరింది. అంటే అదే పెన్ను ధర ఇప్పుడు రూ.20 పెరిగింది. ఇప్పుడు దాన్ని మీరు ఓ రూ.10 లాభంతో విక్రయించారు. అంటే మీకు రూ.30 లాభం వచ్చింది. కానీ, ఇప్పుడు దాని ధర మార్కెట్‌లో రూ.120. ఈ నేపథ్యంలో కొనుగోలు ధరను తాజా ద్రవ్యోల్బణానికి అనుగుణంగా సర్దుబాటు చేసేందుకు ఇండెక్సేషన్‌కు (Indexation) ప్రభుత్వం అనుమతిస్తుంది. అంటే మీరు అమ్మిన ధర నుంచి ఆ పెన్ను ప్రస్తుత ధరను తీసేయాలి. అప్పుడు మీ లాభం రూ.10. కేవలం ఈ రూ.10పై మాత్రమే ప్రభుత్వం పన్ను విధిస్తుంది. తద్వారా మీపై పన్ను భారం తగ్గుతుంది. అలాకాకుండా రూ.30లపై పన్ను విధిస్తే.. తాజా ద్రవ్యోల్బణం ప్రకారం మీకు మిగిలే మొత్తం చాలా తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు మదుపర్లు దీర్ఘకాల పెట్టుబడులకు వెనకాడతారు.

ఎలా లెక్కిస్తారు?

రుసుములతో కలిపి ఏదైనా ఆస్తి కొనుగోలు ధర/పెట్టుబడిని నిర్ధరించాలి. అనంతరం ‘కాస్ట్‌ ఇన్‌ఫ్లేషన్‌ ఇండెక్స్‌ (CII)’ను కనుక్కోవాలి. ఇది గత ఏడాది వినియోగదారుల ధరల సూచీ (CPI) సగటు పెరుగుదలలో 75 శాతానికి సమానం. సీఐఐ ప్రస్తుత ధరలను క్రితం ఏడాది ధరలతో పోలుస్తుంది. ఇలా పెట్టుబడి పెట్టిన లేదా కొనుగోలు చేసిన సంవత్సరంతో పాటు ప్రస్తుత ఏడాది సీఐఐని తెలుసుకోవాలి. ప్రస్తుత సంవత్సరం సీఐఐని పెట్టుబడి పెట్టిన సంవత్సరపు సీఐఐతో భాగించాలి. వచ్చిన ఫలితాన్ని కొనుగోలు ధర లేదా పెట్టుబడి మొత్తంతో గుణిస్తే ఇండెక్సేషన్‌ (Indexation) వచ్చేస్తుంది.

ప్రయోజనాలివే..

  • పెట్టుబడి లేదా కొనుగోలు ధరను ఆర్థిక వ్యవస్థలోని ద్రవ్యోల్బణానికి అనుగుణంగా సర్దుబాటు చేస్తుంది.
  • తద్వారా పన్ను చెల్లింపుదారులపై పన్ను భారాన్ని తగ్గిస్తుంది.
  • ఇండెక్సేషన్‌ సర్దుబాటు వల్ల చాలామంది దీర్ఘకాల మదుపునకు ముందుకువస్తారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు