Vodafone Idea: జియో, ఎయిర్‌టెల్‌ బాటలోనే వీఐ.. టారిఫ్‌ల పెంపు

Vodafone Idea: ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్‌ ఐడియా కూడా మొబైల్‌ టారిఫ్‌లను పెంచుతున్నట్లు ప్రకటించింది. 

Updated : 29 Jun 2024 17:30 IST

Vodafone Idea | ఇంటర్నెట్‌డెస్క్‌: రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌ బాటలోనే వొడాఫోన్‌ ఐడియా (Vodafone Idea) సైతం తమ మొబైల్‌ సేవల టారిఫ్‌లను పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రీపెయిడ్‌, పోస్ట్‌ పెయిడ్‌ మొబైల్‌ టారిఫ్‌లను 11-24 శాతం వరకు పెంచుతున్నట్లు తెలిపింది. జులై 4 నుంచి కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి. 

అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ ప్లాన్‌ల టారిఫ్‌లను పెంచింది. రూ.179 ప్లాన్‌ ధర రూ.199కు; రూ.459 ప్లాన్‌ రూ.509కు; రూ.1,799 ప్లాన్‌ రూ.1,999కు పెరిగింది. రోజువారీ డేటా అందించే ప్రీ పెయిడ్‌ ప్లాన్‌ విషయానికొస్తే.. 28 రోజుల వ్యాలిడిటీతో 1 జీబీ డేటా లభించే ప్లాన్‌ ఛార్జీని రూ.299 నుంచి రూ.349కు పెంచారు. 56 రోజుల పాటు వ్యాలిడిటీ రోజుకు 2జీబీ డేటా ఇచ్చే రూ.479 ప్లాన్‌ ఛార్జీని రూ.579కు,     84 రోజుల పాటు రోజుకు 2జీబీ డేటా అందించే ప్లాన్‌ ధరను రూ.839 నుంచి రూ.979కు పెంచారు. 

యాడ్‌ ఆన్‌ డేటా ప్లాన్‌లు కూడా పెరిగాయి. ఒక్కరోజు వ్యాలిడిటీతో రోజుకు 1 జీబీ డేటా ప్లాన్‌ ధర రూ.19 నుంచి రూ.22కు పెంచారు. 6 జీబీ రీఛార్జీ ధర రూ.39 నుంచి రూ.48కు పెరిగింది. పోస్ట్‌ పెయిడ్‌ ప్లాన్‌ ధరలు పెరిగాయి. నెలవారీ కాలపరిమితితో తీసుకొచ్చిన రూ.401 ప్లాన్‌ ధరను రూ.451కు, రూ.501 ప్లాన్‌ రూ.551కి పెంచారు. ప్లాన్‌ ప్రయోజనాల్లో మాత్రం ఎటువంటి మార్పులు లేవు.

పోర్టింగ్‌కు కొత్త రూల్‌.. సిమ్‌ మార్చాక 7 రోజులు ఆగాల్సిందే..!

తమ టెలికాం అందిస్తున్న 4జీ సదుపాయాన్ని మరింత మెరుగుపరచాలని చూస్తున్నట్లు వీఐ పేర్కొంది. దీంతోపాటు 5జీ సేవల్ని ప్రారంభించేందుకు రానున్న త్రైమాసికంలో గణనీయమైన పెట్టుబడులు తీసుకొస్తున్నట్లు ఈసందర్భంగా వెల్లడించింది. స్పెక్ట్రమ్‌ వేలం ముగిసిన కొన్ని రోజులకే టెలికాం సంస్థల నుంచి టారిఫ్‌ల పెంపు ప్రకటనలు వెలువడ్డాయి. ఇదిలాఉండగా.. మొబైల్‌ వాయిస్‌ కాల్స్‌, డేటా కోసం కేంద్రం నిర్వహించిన టెలికాం స్పెక్ట్రమ్‌ వేలం (Spectrum auction)లో వొడాఫోన్‌ ఐడియా రూ.3,510.4 కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని