T20 World Cup: స్టాక్స్‌.. టీ20 కప్‌ విజయం మధ్య సారూప్యతేంటి?.. వివరించిన సెహ్వాగ్‌!

T20 World Cup: స్టాక్స్‌, భారత్‌ టీ20 వరల్డ్‌ కప్‌ గెలవడాన్ని పోల్చుతూ వీరేంద్ర సెహ్వాగ్‌ చక్కని వివరణ ఇచ్చారు. ఇకపై భారత జట్టు విజయపరంపర కొనసాగాలని ఆకాంక్షించారు.

Published : 30 Jun 2024 18:57 IST

దిల్లీ: స్టాక్స్‌, భారత్‌ టీ20 కప్‌ (T20 World Cup) గెలవడం మధ్య సారూప్యత ఏమైనా ఉందా?.. ఏంటా అని ఆలోచిస్తున్నారు కదా! భారత మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ఈ రెండింటి మధ్య చక్కని పోలికను వివరించారు. కప్పు గెలిచిన సందర్భంగా భారత జట్టుకు శుభాకాంక్షలు తెలుపుతూ.. దాన్ని స్టాక్‌మార్కెట్‌కు అన్వయిస్తూ ఎక్స్‌లో ఓ పోస్ట్‌ చేశారు.

స్టాక్‌లలో లాగా సుదీర్ఘ స్థిరీకరణ తర్వాత భారత జట్టుకు ఒక బ్రేకౌట్ లభించింది. ఏళ్లపాటు నిరోధం (Resistance) ఎదుర్కొన్న స్టాక్‌ ఒక్కసారిగా కొన్నేళ్ల రికార్డును దాటుతుంటుంది. టీమ్‌ఇండియాకు కూడా బహుశా అలాంటి బ్రేకౌట్ విజయమే. ఏళ్లుగా ఒక రేంజ్‌లో నిలకడగా ఆడుతూ వచ్చింది. జట్టు చక్కగా కుదురుకుంది. కానీ, ఐసీసీ ట్రోఫీల్లాంటి నిరోధాలను మాత్రం అధిగమించలేకపోయింది. తాజాగా లభించిన విజయం బహుశా 13 ఏళ్ల బ్రేకౌట్‌గా అనిపించింది. ఇక నుంచి ఐసీసీ టోర్నీల్లో భారత్‌ వరుస విజయాలను నమోదు చేస్తుందని విశ్వసిస్తున్నా’’ అని సెహ్వాగ్‌ పోస్ట్‌ చేశారు. భారత్‌ 2011లో వన్డే వరల్డ్‌ కప్‌ సాధించిన తర్వాత ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా సొంతం చేసుకోలేదు.

స్టాక్ మార్కెట్‌లో ఒక షేరు నిర్దిష్ఠ స్థాయికి చేరుకున్న తర్వాత నిరోధం ఎదుర్కొంటుంటుంది. అంటే ఆ స్థాయిని మించి పైకి వెళ్లలేకపోతుంది. ఇది కంపెనీ పనితీరు, మార్కెట్‌ పరిస్థితులు, ఇన్వెస్టర్ల ఆసక్తిపై ఆధారపడి ఉంటుంది. అయితే, పరిస్థితులు అనుకూలించినప్పుడు దాన్ని దాటుకొని ఒక్కసారిగా భారీ లాభాల్లోకి దూసుకెళ్తుంది. దీన్ని బ్రేకౌట్‌గా వ్యవహరిస్తారు. అప్పుడు ఆ స్టాక్‌కు కొత్త రికార్డులను నెలకొల్పుతూ నూతన నిరోధ స్థాయిని ఏర్పరచుకుంటుంది. సాధారణంగా స్టాక్ విలువ గరిష్ఠానికి చేరినప్పుడు నిరోధం ఎదురవుతుంది. అంటే ఆ షేరుకు అంతకు మించి వెచ్చించడం అవసరం లేదని మదుపర్ల భావన!

తాజాగా భారత జట్టు సైతం ఏళ్లుగా నిరోధ స్థాయిని ఎదుర్కొందని సెహ్వాగ్‌ అభిప్రాయపడ్డారు. ఇక్కడ ఐసీసీ ట్రోఫీలను ఆయన నిరోధంగా వ్యవహరించారు. తాజాగా దాన్ని అధిగమించి విజయం సాధించటంతో బ్రేకౌట్‌ లభించినట్లు అభివర్ణించారు. ఇకపై వరుస విజయాలతో రికార్డులు నెలకొల్పుతుందని ఆకాంక్షించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని