Today Stock Market: పరిమిత శ్రేణిలోనే ట్రేడింగ్‌

స్టాక్‌ మార్కెట్లు ఈ వారం చాలా తక్కువ శ్రేణిలోనే కదలాడొచ్చని విశ్లేషకులు అంటున్నారు. ఎటువంటి ప్రధాన వార్తలూ లేకపోవడానికి తోడు, కొద్ది రోజుల ర్యాలీతో షేర్ల ధరలు అధిక స్థాయిలకు చేరడం ఇందుకు కారణంగా నిలవవచ్చని చెబుతున్నారు.

Published : 01 Jul 2024 03:29 IST

షేర్లు అధిక విలువకు చేరడమే కారణం
ఔషధ, ఐటీ షేర్లు రాణించొచ్చు
విశ్లేషకుల అంచనాలు 
స్టాక్‌ మార్కెట్‌ 
ఈ వారం

స్టాక్‌ మార్కెట్లు ఈ వారం చాలా తక్కువ శ్రేణిలోనే కదలాడొచ్చని విశ్లేషకులు అంటున్నారు. ఎటువంటి ప్రధాన వార్తలూ లేకపోవడానికి తోడు, కొద్ది రోజుల ర్యాలీతో షేర్ల ధరలు అధిక స్థాయిలకు చేరడం ఇందుకు కారణంగా నిలవవచ్చని చెబుతున్నారు. ప్రస్తుత మార్కెట్‌ సెంటిమెంటు, సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకుంటే.. ఈ వారం నిఫ్టీ 23,700 స్థాయిని పరీక్షించే అవకాశం లేకపోలేదని మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు. నిఫ్టీ 24,200-23,700 మధ్య చలించొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రతికూల ధోరణితో కదిలినపుడల్లా, కొనుగోళ్లకు అవకాశంగా భావించొచ్చని డెరివేటివ్‌ విశ్లేషకులు చెబుతున్నారు. మనదేశం, అమెరికాల్లో వడ్డీరేట్ల కోత ఎప్పుడు ప్రారంభం అవుతుందనే అంశంపై మదుపర్లు దృష్టి సారించొచ్చు. రుతుపవనాల కదలిక, ముడిచమురు ధరలు, డాలర్‌తో పోలిస్తే రూపాయి కదలికలు ప్రభావం చూపుతాయి. వివిధ రంగాలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

  • ప్రభావం చూపే వార్తలేవీ లేనందున ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లలో పరిమిత లాభాలే కనిపించొచ్చు. బడ్జెట్‌ ప్రకటన వరకు స్తబ్దుగానే చలనాలు ఉండొచ్చు. గత రెండేళ్లుగా బలహీన రుతుపవనాల వల్ల డీలాపడ్డ ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లు వెలుగులోకి రావొచ్చని అంచనా.
  • బ్యాంక్‌ నిఫ్టీ 53,200 స్థాయిని అధిగమిస్తే కనుక 54,000 పాయింట్ల దిశగా ర్యాలీ జరగొచ్చు. 51,000 వద్ద మద్దతు, 53,700 వద్ద నిరోధం కనిపిస్తున్నాయి. బ్యాంకుల త్రైమాసిక పనితీరు నివేదికలపై మదుపర్లు దృష్టి సారించొచ్చు. 
  • చాలా వరకు వాహన కంపెనీల షేర్లు ఒక శ్రేణికి లోబడి కదలాడొచ్చు. జూన్‌ విక్రయాల్లో వృద్ధి వల్ల కొన్ని షేర్లలో లాభాలు కనిపించొచ్చు. స్వల్పకాలంలో ఆటో సూచీలో కొంత ఊగిసలాటలు కనిపించొచ్చు. 24,800 స్థాయి పైకి వెళ్లగలిగితే లాభాలుంటాయి. లేదంటే 24,500కు పడిపోవచ్చు. 
  • టారిఫ్‌ల పెంపు నేపథ్యంలో   టెలికాం కంపెనీలైన భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియా పరిమిత లాభాలు నమోదు చేయొచ్చు. టారిఫ్‌ల పెంపు ప్రభావం ఇప్పటికే షేర్లపై కనిపించడం ఇందుకు నేపథ్యం. జియో మాతృసంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు మాత్రం పెరిగే అవకాశం ఉందని ఒక విశ్లేషకుడు పేర్కొన్నారు.
  • బలమైన ఆర్థిక ఫలితాల అంచనాల మధ్య యంత్ర పరికరాల షేర్లు రాణించొచ్చు. అయితే కొద్ది నెలల ర్యాలీ వల్ల షేర్లకు ఏర్పడ్డ అధిక విలువల కారణంగా లాభాలు పరిమితంగానే ఉండొచ్చు. 
  • మార్కెట్లో ఇప్పటికే అధిక కొనుగోళ్లు జరిగినందున, ఔషధ షేర్లు రాణించే అవకాశం ఉంది.  
  • ప్రభావం చూపే వార్తలు లేనందున రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మినహా   చమురు ఉత్పత్తి, మార్కెటింగ్‌ కంపెనీలు చాలా తక్కువ శ్రేణిలో చలించొచ్చు. అంతర్జాతీయ చమురు ధరలు, రూపాయి విలువలను పరిశీలించొచ్చు. 
  • సిమెంటు రంగంలో చోటుచేసుకుంటున్న కంపెనీల స్వాధీనతలు, ఈ రంగ స్థిరత్వానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. 
  • ఇటీవలి లాభాల అనంతరం లోహ కంపెనీల షేర్లు ఒక శ్రేణిలో చలించొచ్చు. ఈ వారం లోహ సూచీ 9,000 పాయింట్లకు పడిపోవచ్చు. 10,050 వద్ద నిరోధం ఎదురుకావొచ్చు. 
  • ఐటీ కంపెనీల షేర్లు లాభాలను అందించొచ్చు. అమెరికా ఫెడ్‌ రేట్ల కోత అమలు సమయం, ఎంత పరిమాణంలో ఉండొచ్చనే అంశాలు ప్రభావం చూపుతాయి. సమీప కాలంలో నిఫ్టీ ఐటీ సూచీ 37,500కు చేరొచ్చు. తదుపరి లక్ష్యం 39,000 వద్ద ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని