Two Wheeler Sales: అక్టోబర్‌లో అమ్మకాలపరంగా టాప్‌-5 టూవీలర్‌ కంపెనీలివే..!

Two Wheeler Sales: అక్టోబర్‌లో టూవీలర్ల విక్రయాల్లో పాజిటివ్‌ వృద్ధి నమోదైంది. దాదాపు అన్ని కంపెనీల విక్రయాలు పెరిగాయి. అమ్మకాలపరంగా తొలి ఐదు కంపెనీలేవో చూద్దాం..!

Updated : 13 Nov 2023 17:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌లో వాహన విక్రయాల్లో ద్విచక్రవాహనాలదే (Two wheelers) సింహ భాగం. 2023 అక్టోబర్‌లో 18,95,799 యూనిట్లు అమ్ముడయ్యాయి. చాలా వరకు ద్విచక్ర వాహన తయారీ సంస్థల అమ్మకాల్లో పాజిటివ్‌ వృద్ధి నమోదైంది. ఈ నేపథ్యంలో వరుసగా అత్యధిక విక్రయాలు నమోదైన కంపెనీల వివరాలు చూద్దాం..

హీరో మోటోకార్ప్‌..

అక్టోబర్‌లో హీరో మోటోకార్ప్‌ (Hero MotoCorp) 5,59,766 ద్విచక్ర వాహనాలను విక్రయించింది. క్రితం ఏడాది ఈ సంఖ్య 4,42,825 యూనిట్లుగా నమోదైంది. 26.4 శాతం వృద్ధి నమోదైంది. అదే సమయంలో ఎగుమతులు 28.9 శాతం పెరిగి 15,164 యూనిట్లకు చేరాయి.

హోండా..

హీరో మోటోకార్ప్‌ తర్వాత అత్యధిక టూవీలర్లు విక్రయించిన కంపెనీ హోండా (Honda). అక్టోబర్‌లో ఈ కంపెనీ 4,62,747 యూనిట్లు విక్రయించింది. వార్షిక ప్రాతిపదికన 8.6 శాతం వృద్ధి నమోదైంది. 2022 ఇదే నెలలో కంపెనీ విక్రయాలు 4,25,992 యూనిట్లుగా రికార్డయ్యాయి. హోండా ఎగుమతులు 30,137 యూనిట్లకు చేరాయి. 28.6 శాతం వృద్ధి నమోదైంది.

టీవీఎస్‌..

అత్యధిక టూవీలర్ల విక్రయాల్లో మూడో స్థానంలో టీవీఎస్‌ (TVS) ఉంది. క్రితం ఏడాది అక్టోబర్‌లో 2,75,934 యూనిట్లు విక్రయించిన ఈ కంపెనీ ఈసారి ఆ సంఖ్యను 3,44,957కు పెంచుకుంది. వార్షిక ప్రాతిపదికన 25 శాతం వృద్ధి నమోదైంది. ఎగుమతులు 10.1 శాతం పెరిగి 75,653 యూనిట్లకు చేరాయి.

బజాజ్‌..

2023 అక్టోబర్‌లో 2,74,911 యూనిట్ల విక్రయాలతో బజాజ్‌ (Bajaj) నాలుగో స్థానంలో ఉంది. క్రితం ఏడాది ఇదే నెలలో కంపెనీ 2,06,131 యూనిట్లు విక్రయించింది. వార్షిక ప్రాతిపదికన 33 శాతం వృద్ధి నమోదైంది. ఎగుమతుల్లో మాత్రం ఈ కంపెనీదే తొలి స్థానం. ఏకంగా 1,29,658 యూనిట్లను ఇతర దేశాలకు ఎగుమతి చేసింది.

సుజుకీ..

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ను దాటేసి అక్టోబర్‌లో విక్రయాలపరంగా సుజుకీ (Suzuki) ఐదో స్థానానికి చేరింది. 84,302 యూనిట్లను విక్రయించింది. క్రితం ఏడాది ఈ సంఖ్య 69,634గా నమోదైంది. ఏడాది ప్రాతిపదికన 21 శాతం వృద్ధి నమోదైంది. ఎగుమతుల పరంగా చూస్తే 11 శాతం వృద్ధితో 16,205 యూనిట్లకు చేరాయి.

మరోవైపు దసరా నవరాత్రి వేడుకల సమయంలో విక్రయాలు పుంజుకున్నప్పటికీ, అక్టోబరు నెల మొత్తంమీద చూస్తే వాహన విక్రయాలు, ఏడాది క్రితంతో పోలిస్తే 7.73 శాతం తగ్గినట్లు వాహన డీలర్ల సమాఖ్య ఫాడా ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. 2022 అక్టోబరులో 22,95,099 వాహనాలు అమ్ముడుపోగా, గత నెలలో ఆ సంఖ్య 21,17,596కు పరిమితమైంది. ద్విచక్ర వాహన విక్రయాలు తగ్గడం వల్లే, మొత్తం విక్రయాల సంఖ్యపై ప్రభావం పడింది. అక్టోబరు 14 వరకు మంచిరోజులుగా భావించని ముహూర్తం ఉండటమూ ప్రభావం చూపిందని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని