FD rates: ప్రధాన బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ వడ్డీ రేట్లు ఇవే..

Fixed Deposit Rates: ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లో మదుపు చేయాలనుకుంటున్నారా? అయితే వివిధ బ్యాంకులు ఎఫ్‌డీపై అందిస్తున్న వడ్డీ రేట్లపై ఓ లుక్కేయండి.

Published : 03 Jul 2024 11:53 IST

Fixed Deposit Rates | ఇంటర్నెట్‌డెస్క్‌: ఎన్ని పెట్టుబడి సాధనాలు ఉన్నా ఎటువంటి రిస్క్‌ లేకుండా రాబడి వస్తుందని చాలా మంది ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల (FD)పైనే మక్కువ చూపుతారు. ప్రస్తుతం ఆర్‌బీఐ రెపో రేట్లు పెంచిన నేపథ్యంలో బ్యాంకులు ఎఫ్‌డీలపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు అందిస్తున్నాయి. అయితే, బ్యాంకుల్లో ఎవరైనా ఎఫ్‌డీలు చేసే ముందు వడ్డీ రేట్లను సరిపోల్చుకోవడం ముఖ్యం. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్‌ బ్యాంకుల్లో ఎఫ్‌డీ రేట్లు  ఎలా ఉన్నాయో చూసేయండి.. 

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI)

ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఎస్‌బీఐ (SBI) తాజాగా సవరించిన వడ్డీ రేట్లు 2024 జూన్‌ 15 నుంచే అమల్లోకి వచ్చాయి. 7 నుంచి 45 రోజుల ఎఫ్‌డీలపై సాధారణ డిపాజిటర్లకు 3.50 శాతం వడ్డీ ఇస్తుండగా.. ఇదే కాలవ్యవధిపై సీనియర్‌ సిటిజన్లకు 4 శాతం వడ్డీ ఇస్తోంది. 2 నుంచి 3 సంవత్సరాల కాలవ్యవధికి ఎఫ్‌డీ చేస్తే గరిష్ఠంగా 7 శాతం.. 3- 5 ఏళ్ల కాలానికి ఎఫ్‌డీ చేస్తే 6.75 శాతం వడ్డీ ఇస్తోంది. అదే సీనియర్‌ సిటిజన్లకైతే 2-3 ఏళ్ల కాలపరిమితి కలిగిన ఎఫ్‌డీలపై అత్యధికంగా 7.50 శాతం, అదే 3-5 ఏళ్ల మధ్య అయితే 7 శాతం వడ్డీ ఇస్తోంది. 

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ (HDFC)

ప్రముఖ ప్రైవేటు బ్యాంక్‌ హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) 7 నుంచి 14 రోజుల ఎఫ్‌డీలపై సాధారణ డిపాజిటర్లకు 3 శాతం.. సీనియర్‌ సిటిజన్లకు 3.50 శాతం వడ్డీ ఇస్తోంది. ఇక 18 నెలల నుంచి 21 నెలల మధ్య కాలపరిమితితో చేసే వాటిపై సాధారణ డిపాజిటర్లకు గరిష్ఠంగా 7.25 శాతం, సీనియర్‌ సిటిజన్లకు గరిష్ఠంగా 7.75 శాతం వడ్డీని ఆఫర్‌ చేస్తోంది. ఐదేళ్ల ట్యాక్స్‌ సేవింగ్ డిపాజిట్లపై సాధారణ డిపాజిటర్లకు 7 శాతం, సీనియర్‌ సిటిజన్లకు 7.50 శాతం వడ్డీ ఇస్తోంది.

ఐసీఐసీఐ బ్యాంక్‌ (ICICI)

రూ.3 కోట్ల వరకు ఉన్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అందించే రేట్లను ఐసీఐసీఐ బ్యాంక్‌ (ICICI) ఇటీవలే సవరించింది. 7 రోజుల నుంచి 14 రోజులకు చేసే ఎఫ్‌డీపై సాధారణ డిపాజిటర్లకు 3 శాతం వడ్డీ అందిస్తోంది. సీనియర్‌ సిటిజన్లకు  3.50శాతం ఇస్తోంది. 15 నెలల నుంచి 18 నెలల మధ్య కాల వ్యవధి తీరే ఎఫ్‌డీలపై సాధారణ ప్రజలకు గరిష్ఠంగా 7.20 శాతం, సీనియర్‌ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీ అందిస్తోంది. ఐదేళ్లకు పైబడిన ఎఫ్‌డీలపై సాధారణ డిపాజిటర్లకు 7 శాతం, సీనియర్‌ సిటిజన్లకు 7.50శాతం వడ్డీ ఇస్తోంది.

యాక్సిస్‌ బ్యాంక్‌ (Axis bank)

తాజాగా యాక్సిస్‌ బ్యాంక్‌ (Axis Bank) సైతం వడ్డీ రేట్లను సవరించింది. జులై 1 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. 7 రోజుల నుంచి 14 రోజుల కాలవ్యవధితో సాధారణ ప్రజలు చేసే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 3 శాతం వడ్డీ అందిస్తోంది. 17 నెలల నుంచి 18 నెలల మధ్య చేసే ఎఫ్‌డీపై గరిష్ఠంగా 7.20 శాతం వడ్డీ ఇస్తోంది. 5 ఏళ్ల నుంచి 10 సంవత్సరాల మధ్య ఎఫ్‌డీలపై సీనియర్‌ సిటిజన్లకు గరిష్ఠంగా 7.75 శాతం వడ్డీని ఈ బ్యాంక్‌ అందిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని