ITR filing: ఐటీ రిటర్నులు ఫైల్‌ చేస్తే కలిగే ప్రయోజనాలు తెలుసా?

ITR filing 2023-24: ఐటీఆర్‌ దాఖలు చేసే సమయం దగ్గర పడటంతో అందరూ రిటర్నులు ఫైల్‌ చేయడం మొదలు పెట్టేశారు. అసలు రిటర్నులు ఫైల్‌ చేస్తే కలిగే ప్రయోజనాల గురించి తెలుసా?

Updated : 01 Jul 2024 13:01 IST

ITR filing 2023-24 | ఇంటర్నెట్‌డెస్క్‌: గత ఆర్థిక సంవత్సరానికి గానూ ఆదాయపు పన్ను రిటర్నులను (Income Tax Returns- ITR) దాఖలు చేసేందుకు సమయం వచ్చేసింది. జులై 31 లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. నిర్దేశించిన పరిమితికి మించి ఆదాయం ఉన్నప్పుడు.. నిర్ణీత శ్లాబుల్లో పన్ను చెల్లించాలి. నిబంధనల మేరకు ఆదాయపు పన్ను రిటర్నులనూ సమర్పించాలి. ఆదాయపు పన్ను పరిధిలోకి రానివారూ రిటర్నులు దాఖలు చేయొచ్చు. అంతేకాదు నిర్ణీత గడువులోగా రిటర్నులు ఫైల్‌ చేయడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం..

  • రుణం కోసం లేదా వీసా దరఖాస్తు సమయంలోనూ పన్ను రిటర్నులు ఉపయోగపడతాయి. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు రుణం మంజూరుకోసం ఆదాయ రుజువు సమర్పించాల్సి ఉంటుంది. అందుకు రిటర్నులు సాయపడతాయి. దీంతో పాటు వీసా దరఖాస్తు సమయంలో ఐటీఆర్‌ సమర్పించడం వల్ల వీసా జారీ అవకాశాలు పెరుగుతాయి. 
  • ఐటీఆర్‌ ఫైల్‌ చేయడం వల్ల ఒక ఆర్థిక సంవత్సరంలో వచ్చే నష్టాలను తదుపరి సంవత్సరానికి జత చేయొచ్చు. అంటే పాత నష్టాలను భవిష్యత్తు ఆదాయానికి జతచేసి పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చన్నమాట. ముఖ్యంగా స్టాక్‌ మార్కెట్‌ లేదా ఇతర వెంచర్లలో పెట్టుబడులు పెట్టే వారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. 
  • ఐటీ రిటర్నులు గుర్తింపు రుజువుగా ఉపయోగపడతాయి. ఏదైనా అధికారిక పత్రాల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ఈ పత్రాలు ఐడెంటిటీ ప్రూఫ్‌గా ఉపయోగించుకోవచ్చు.
  • నిర్దిష్ట సమయంలో ఐటీఆర్‌లను ఫైల్‌ చేసే వ్యక్తి క్రెడిట్‌ ప్రొఫైల్‌ మెరుగవుతుంది. క్రెడిట్‌ బ్యూరోలు క్రెడిట్‌ యోగ్యతను అంచనా వేసే సమయంలో దీన్ని పరిగణనలోకి తీసుకుంటాయి. దీంతో తక్కువ వడ్డీకే రుణాలు పొందొచ్చు.
  • వ్యాపారాల కోసం, ప్రభుత్వ టెండర్ల కోసం బిడ్డింగ్ చేయాలన్నా.. ఐటీఆర్‌ ఫైల్ చేయడం కీలకం. రుజువుగా ఇది ఉపయోగపడుతుంది. అంతే కాదు టెండర్లను గెలుచుకొనే అవకాశాన్ని పెంచుతుంది. 
  • ఐటీఆర్‌ ఫైల్‌ చేయడం వల్ల సమగ్ర ఆదాయ వివరాలు మీ దగ్గర ఉంటాయి. ఇది ఒకరకంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో ఉపయోగపడుతుంది. ఆదాయం, ఖర్చులు, పెట్టుబడులు వంటివి చూసుకుని భవిష్యత్‌కు తగిన ప్రణాళికలు రూపొందించుకోవచ్చు.
  • వ్యక్తి సంపాదించిన ఆదాయం, మూలధన లాభాలు తదితరాలపైన నిబంధనల మేరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయం పొందినప్పుడు TDS ఉంటుంది. మనం చేసే కొనుగోళ్లకూ టీడీఎస్‌ వసూలు చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో అదనపు పన్నులు చెల్లించి ఉండొచ్చు. వీటిని తిరిగి పొందాలంటే ఐటీఆర్‌లు ఫైల్‌ చేయాలి. సకాలంలో రిటర్నులు ఫైల్‌ చేయని వారిపై జరిమానా పడుతుంది. అందుకనే ఐటీఆర్‌ ఫైల్‌ చేయాలి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని