Investors: పెట్టుబడుల్లో ఈ విషయాలు పట్టించుకోవద్దు

స్టాక్‌ మార్కెట్లు కొత్త జీవన కాలగరిష్ఠాలకు చేరుకున్నాయి. దీంతో చాలామంది పెట్టుబడులు పెట్టాలనే ఆలోచనతో వస్తున్నారు. అదే సమయంలో ఇప్పటికే మదుపు చేసిన వారు లాభాలను స్వీకరించేందుకు సిద్ధం అవుతున్నారు.

Published : 28 Jun 2024 01:04 IST

స్టాక్‌ మార్కెట్లు కొత్త జీవన కాలగరిష్ఠాలకు చేరుకున్నాయి. దీంతో చాలామంది పెట్టుబడులు పెట్టాలనే ఆలోచనతో వస్తున్నారు. అదే సమయంలో ఇప్పటికే మదుపు చేసిన వారు లాభాలను స్వీకరించేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక వ్యూహంతో మార్కెట్లో మదుపు చేసే వారు పట్టించు కోకూడని విషయాలు కొన్ని ఉంటాయి. అవేమిటో పరిశీలిద్దాం..

పెట్టుబడి అనేది వ్యక్తిగత ప్రయాణం. మీ లక్ష్యాలు ఇతరులతో పోల్చినప్పుడు భిన్నంగా ఉంటాయని మర్చిపోవద్దు. అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు అనువైన పథకాన్ని ఎంచుకోవాల్సింది మీరే. ఇతరులకు ప్రయోజనం చేకూర్చినవి మీకు నప్పకపోవచ్చు. అందుకే, పెట్టుబడి నిర్ణయాలు ఎప్పుడూ మీ సొంత పరిశోధనపైనే ఆధారపడి ఉండాలి.

ఇతరుల సంపాదన గురించి అనవసరం

స్టాక్‌ మార్కెట్లో తాము పెద్ద మొత్తంలో సంపాదిస్తున్నాం అంటూ ఇటీవలి కాలంలో సామాజిక వేదికలపై చెబుతున్న వారు పెరిగారు. ఇలాంటి వాటిలో ఎంత మేరకు వాస్తవం ఉందో ఎవరూ చెప్పలేరు. ఒక షేరు ధర పెరుగుతుంది, తగ్గుతుంది అని చెబుతూ ఉన్న వారి మాటలు పట్టించుకోవద్దు. వారు సంపాదిస్తున్నారు కదా అని మనమూ ఆయా షేర్లలో మదుపు చేయడం ప్రారంభిస్తే, నష్టపోయే ప్రమాదం ఉంది. మనం పెట్టుబడులు పెట్టే సమయానికి వారు ఆ షేర్ల నుంచి బయటకు రావచ్చు. తర్వాత వాటిని ఎప్పుడు అమ్మాలో మనకు తెలియదు. తగ్గితే.. ఎప్పుడు కోలుకుంటాయో ఎవరూ చెప్పరు. సామాజిక వేదికలపై తమను అనుసరించే వారిని పెంచుకునేందుకు చెప్పే మాటలు విశ్వసించకూడదు. సెబీ ఇప్పటికే ఈ విషయంపై మదుపరులను పలు సందర్భాల్లో హెచ్చరించిన సంగతి మర్చిపోవద్దు. ప్రతి పెట్టుబడిదారుడి పరిస్థితి ప్రత్యేకంగా ఉంటుంది. ఆర్థిక లక్ష్యాలు, పెట్టుబడి వ్యూహాలు, నష్టభయం భరించే శక్తి మారుతూ ఉంటాయి. వారి తీసుకున్న నిర్ణయాల ప్రభావం మన మీద ఉండకుండా చూసుకోవాలి. ఎవరైనా ఒక షేరు గురించి విపరీతంగా ప్రచారం చేస్తుంటే.. దానికి దూరంగా ఉండటమే కొన్నిసార్లు మేలని స్టాక్‌ మార్కెట్‌ నిపుణుల సూచన. 

స్వల్పకాల హెచ్చుతగ్గులు

స్టాక్‌ మార్కెట్లో ఏం జరుగుతుందన్న విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం మంచిదే. కానీ, రోజువారీ హెచ్చుతగ్గుల్ని చూసి సంతోషించడం లేదా విచారించడం మాత్రం సరికాదు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యూహంతో మదుపు చేస్తున్న వారు స్వల్పకాలిక విషయాలను పట్టించుకోవద్దు. మీరు ఎంచుకున్న షేర్లలో కొన్ని పెరుగుతుంటాయి. మరికొన్ని తగ్గుతాయి. తగ్గిన షేర్లను ఎంచుకోవడం మీరు చేసిన పొరపాటేమీ కాదు. కేవలం కొన్ని సాంకేతిక కారణాల వల్ల అవి తాత్కాలికంగా తగ్గొచ్చు. స్వల్పకాలిక పనితీరును చూసి, దీర్ఘకాలిక అంచనాకు రాలేమని గుర్తించాలి. పెట్టుబడి దీర్ఘకాలిక ప్రయాణం. మీ లక్ష్యాలకు తగ్గట్టుగా అవి ఉన్నాయా లేదా అని మాత్రమే పరిశీలించాలి. క్రమశిక్షణగా, ఓపికగా ఉండాలి. మార్కెట్లో ఎంత ఎక్కువ సమయం ఉంటే.. అంత మంచి రాబడులు వస్తాయని చరిత్ర చెబుతోంది.

భావోద్వేగాలు

స్టాక్‌ మార్కెట్లో మదుపు చేయాలంటే ఉన్నత విద్యావంతులై ఉండాలి అనే అపోహ ఇప్పటికీ చాలామందిలో ఉంది. ఇది నిజం కాదు. మార్కెట్‌ గురించి అర్థం చేసుకునే పరిజ్ఞానం ఉంటే చాలని ఇప్పటికే చాలామంది మదుపరులు నిరూపించారు. క్రమశిక్షణ, ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉండగల సామర్థ్యం ఉంటే చాలు. భావోద్వేగాలను నియంత్రణలో ఉంచుకోవడంతోపాటు, హేతుబద్ధమైన నిర్ణయాలు తీసుకోవడం ప్రధానం. ఆశ, అత్యాశకు మధ్య తేడా తెలుసుకోలేకపోతే పేలవమైన పెట్టుబడి నిర్ణయాలకు దారి తీస్తుంది.

ఎంత ధరకు కొంటున్నాం

ఒక షేరు కోసం ఎంత ధర చెల్లించారు అన్నది ఎప్పుడూ కీలకమే. మంచి షేరును, మంచి ధరకు కొనుగోలు చేయాలన్నది మార్కెట్‌ సూత్రం. ఉదాహరణకు మీరు ఒక షేరును రూ.200 వద్ద కొనుగోలు చేశారు. కంపెనీ పనితీరు బాగాలేక దాని ధర రూ.150కి పడిపోయిందనుకుందాం. సగటు చేసే క్రమంలో మరిన్ని షేర్లను కొంటుంటారు. రూ.100కు పడినా దాన్ని వదలకుండా కొంటూనే ఉంటారనుకుందాం. అప్పుడు మీ దగ్గర ఆ షేర్ల సంఖ్య పెరుగుతుంది. కానీ, లాభాలు కాదు. ధర పడిపోతున్న షేర్లను కొంటూ సగటు చేయాలన్న ఆలోచన ఉండకూడదు. ఒక సంస్థ వాటాలను కొనుగోలు చేసేప్పుడు గత పనితీరు కాకుండా, వర్తమాన, భవిష్యత్తుపై దృష్టి పెట్టాలి. వ్యాపారావకాశాలు ఎలా ఉంటాయని చూడాలి. అప్పుడే లాభదాయకమైన నిర్ణయాలు తీసుకోగలరు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని