koo: ‘కూ’త ఆగింది

దేశీయ సామాజిక మాధ్యమం ‘కూ’ మూతపడింది. ట్విటర్‌ (ప్రస్తుత ఎక్స్‌)కు పోటీగా, ప్రత్యామ్నాయంగా వచ్చామని తొలినాళ్లలో చెప్పుకున్న కూ ఇక పనిచేయదు.

Updated : 04 Jul 2024 06:38 IST

మూతపడిన దేశీయ సామాజిక మాధ్యమం

దిల్లీ: దేశీయ సామాజిక మాధ్యమం ‘కూ’ మూతపడింది. ట్విటర్‌ (ప్రస్తుత ఎక్స్‌)కు పోటీగా, ప్రత్యామ్నాయంగా వచ్చామని తొలినాళ్లలో చెప్పుకున్న కూ ఇక పనిచేయదు. తమ ప్రణాళికలు అనుకున్నట్లు సాగనందునే, ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ సహ వ్యవస్థాపకులు బాధాతప్త హృదయంతో ‘లింక్డ్‌ఇన్‌’లో ఒక లేఖ రాశారు. పసుపు ఛాయలో ఉండే చిన్న పక్షి (యాప్‌ లోగో) ‘గుడ్‌ బై’ చెబుతోందంటూ అప్రమేయ రాధాకృష్ణ, మయాంక్‌ బిడావట్క రాసుకొచ్చారు. తమ ప్లాట్‌ఫాం ప్రజలకు ఇక సేవలు అందించదని తెలిపారు. పలు దిగ్గజ ఇంటర్నెట్‌ కంపెనీలు, మీడియా కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకోవడానికి చేసిన ప్రయత్నాలు అనుకున్నట్లుగా ముందుకు సాగకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ‘భాగస్వాములు లేకున్నా, యాప్‌ను కొనసాగించాలని అనుకున్నాం. అయితే యాప్‌ను నడిపేందుకు అయ్యే సాంకేతిక సేవల వ్యయం పెనుభారంగా మారడంతో’ మూసివేస్తున్నట్లు వెల్లడించారు.

  • ఒక సమయంలో కూలో 21 లక్షల మంది రోజువారీ యాక్టివ్‌ వినియోగదారులు ఉన్నారు. 9,000 మంది ప్రముఖులు సహా కోటి మంది నెలవారీ యాక్టివ్‌ వినియోగదారులుండేవారు.
  • 2022లో అయితే ట్విటర్‌ను అధిగమించేందుకు కూ కు కొద్ది నెలల సమయమే పడుతుందనే అంచనాలు వెలువడినా, మూలధనం సరిపోక వెనుకడుగు వేయాల్సి వచ్చిందని వ్యవస్థాపకులు చెప్పారు.
  • ట్విటర్‌తో భారత ప్రభుత్వ సంఘర్షణ సమయంలో అంటే 2021లో ‘కూ’ మనదేశంలో ఒక వెలుగు వెలిగింది. ప్రభుత్వ విభాగాలతో పాటు మంత్రులు ఈ ప్లాట్‌ఫాంకే మద్దతు పలికారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని