Stock market: రూ.447.30 లక్షల కోట్లకు మదుపర్ల సంపద

ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, టీసీఎస్‌ వంటి పెద్ద షేర్లు రాణించడంతో సెన్సెక్స్‌ చరిత్రలో తొలిసారి 80,000 పాయింట్ల ఎగువన ముగిసింది.

Published : 05 Jul 2024 03:55 IST

80,000 ఎగువన ముగిసిన సెన్సెక్స్‌
సమీక్ష

ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, టీసీఎస్‌ వంటి పెద్ద షేర్లు రాణించడంతో సెన్సెక్స్‌ చరిత్రలో తొలిసారి 80,000 పాయింట్ల ఎగువన ముగిసింది. నిఫ్టీ కూడా తాజా గరిష్ఠానికి చేరింది. సానుకూల అంతర్జాతీయ సంకేతాలు ఇందుకు మద్దతుగా నిలిచాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి పైసా తగ్గి 83.50 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 0.52% నష్టంతో 86.89 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో షాంఘై నష్టపోగా, మిగతావి లాభపడ్డాయి. ఐరోపా సూచీలు మెరుగ్గా ట్రేడయ్యాయి.

  • మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ జీవనకాల గరిష్ఠమైన రూ.447.30 లక్షల కోట్లు (5.36 లక్షల కోట్ల డాలర్లు)గా నమోదైంది.
  • సెన్సెక్స్‌ ఉదయం 80,321.79 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 80,392.64 వద్ద కొత్త గరిష్ఠాన్ని తాకిన సూచీ, లాభాల స్వీకరణతో వెనక్కి వచ్చింది. చివరకు 62.87 పాయింట్ల లాభంతో 80,049.67 వద్ద ముగిసింది. నిఫ్టీ 15.65 పాయింట్లు పెరిగి 24,302.15 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 24,401 దగ్గర రికార్డు గరిష్ఠాన్ని తాకింది.
  • సెన్సెక్స్‌ 30 షేర్లలో 14 లాభాలు నమోదుచేశాయి. హెచ్‌సీఎల్‌ టెక్‌ 2.85%, ఐసీఐసీఐ బ్యాంక్‌ 2.65%, టాటా మోటార్స్‌ 2.40%, సన్‌ఫార్మా 1.66%, టీసీఎస్‌ 1.42%, ఇన్ఫోసిస్‌ 1.32%, కోటక్‌ బ్యాంక్‌ 1.26%, ఎం అండ్‌ ఎం 0.89% చొప్పున లాభపడ్డాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 2.36%, బజాజ్‌ ఫైనాన్స్‌ 1.97%, టెక్‌ మహీంద్రా 1.47%, ఎల్‌ అండ్‌ టీ 1.12%, అల్ట్రాటెక్‌ 0.95% నష్టపోయాయి. రంగాల వారీ సూచీల్లో.. ఆరోగ్య సంరక్షణ 1.17%, ఐటీ 1.12%, టెక్‌ 0.98%, వాహన 0.88%, టెలికాం 0.73% పెరిగాయి. మన్నికైన వినిమయ వస్తువులు, ఎఫ్‌ఎమ్‌సీజీ, ఆర్థిక సేవలు, చమురు-గ్యాస్‌ నీరసించాయి. బీఎస్‌ఈలో 2117 షేర్లు లాభాల్లో ముగియగా, 1821 స్క్రిప్‌లు నష్టపోయాయి. 83 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.
  • రుణరహిత కంపెనీగా ఐనాక్స్‌ విండ్‌: కంపెనీలో ప్రమోటర్‌ సంస్థ ఐనాక్స్‌ విండ్‌ ఎనర్జీ రూ.900 కోట్ల పెట్టుబడులు పెట్టడంతో రుణ రహిత సంస్థగా మారినట్లు ఐనాక్స్‌ విండ్‌ ప్రకటించింది. ఈ వార్తల నేపథ్యంలో ఐనాక్స్‌ విండ్‌ షేరు 10.29% లాభంతో రూ.157 వద్ద ముగిసింది. ఐనాక్స్‌ విండ్‌ ఎనర్జీ షేరు 5% దూసుకెళ్లి రూ.7,562 వద్ద అప్పర్‌ సర్క్యూట్‌ను తాకి, అక్కడే ముగిసింది.
  • ఎంక్యూర్‌ ఫార్మా ఐపీఓ రెండో రోజుకు 4.98 రెట్ల స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా 1,37,03,538 షేర్లను ఆఫర్‌ చేయనుండగా, 6,81,87,028 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. రిటైల్‌ విభాగంలో 3.43 రెట్ల స్పందన నమోదైంది. 
  • బన్సల్‌ వైర్‌ ఇండస్ట్రీస్‌ ఐపీఓ రెండో రోజుకు 5.72 రెట్ల స్పందన దక్కింది. ఇష్యూలో భాగంగా 2,14,60,906 షేర్లను ఆఫర్‌ చేయగా, 12,28,12,970 షేర్లకు బిడ్లు వచ్చాయి. రిటైల్‌ విభాగంలో 6.18 రెట్ల స్పందన కనిపించింది.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని