Stock market: సెన్సెక్స్‌ రికార్డు పరుగు

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ చరిత్రలో బుధవారం మరో చిరస్మరణీయ రోజు. సూచీ తొలిసారిగా 80,000 పాయింట్ల శిఖరాన్ని సునాయాసంగా అధిరోహించింది. 70000 పాయింట్ల నుంచి 80,000 పాయింట్లకు 7 నెలల్లోపే (138 ట్రేడింగ్‌ రోజులు) దూసుకెళ్లడం విశేషం.

Updated : 04 Jul 2024 06:39 IST

1986 జనవరిలో ఆరంభమైన సెన్సెక్స్‌ పయనం తొలుత నిదానంగా సాగినా.. ప్రపంచ ఆర్థిక పరిణామాలకు అనుగుణంగా ఒడుదొడుకులకు లోనైనా.. ఎప్పటికప్పుడు కొత్త మైలురాయిని అధిగమిస్తూ సాగుతోంది. ఇటీవల కాలంలో ఆకాశమే హద్దుగా రాణిస్తున్న ఈ సూచీ బుధవారం 80,000 స్థాయినీ అందుకుంది. తర్వాత కొద్దిగా కిందకు చేరి, 79,986.80 పాయింట్ల వద్ద స్థిరపడింది. తొలి 10,000 పాయింట్లకు చేరేందుకు సెన్సెక్స్‌కు 20 ఏళ్లు పట్టగా.. 70,000 పాయింట్ల నుంచి 80,000కు చేరేందుకు కేవలం 138 ట్రేడింగ్‌ రోజుల (ఏడు నెలల్లోపే) సమయమే తీసుకుంది. బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ, జీవనకాల గరిష్ఠమైన రూ.445.43 లక్షల కోట్లకు చేరింది.

సెన్సెక్స్‌ హెచ్చు,తగ్గుల తీరిలా..
2-1-1986 నుంచి 3-7-2024 వరకు


80000 సునాయాసంగా..

7 నెలల్లోపే 10,000 పాయింట్లు జతచేసుకున్న సెన్సెక్స్‌ 
రూ.445 లక్షల కోట్లకు మదుపర్ల సంపద

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ చరిత్రలో బుధవారం మరో చిరస్మరణీయ రోజు. సూచీ తొలిసారిగా 80,000 పాయింట్ల శిఖరాన్ని సునాయాసంగా అధిరోహించింది. 70000 పాయింట్ల నుంచి 80,000 పాయింట్లకు 7 నెలల్లోపే (138 ట్రేడింగ్‌ రోజులు) దూసుకెళ్లడం విశేషం. కేవలం 4 సెషన్లలోనే సెన్సెక్స్‌ 79000 నుంచి 80,000 పాయింట్లకు చేరుకుంది. సానుకూల అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో బ్యాంకింగ్, ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లు పరుగులు తీశాయి. రాబోయే సాధారణ బడ్జెట్‌పై సానుకూల అంచనాలు ఇందుకు కలిసొచ్చాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్‌ బ్యాంక్, యాక్సిస్‌ బ్యాంక్‌ వంటి పెద్ద షేర్లు మార్కెట్‌ను తాజా గరిష్ఠాల వైపు నడిపించాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి పైసా తగ్గి 83.49 వద్ద ముగిసింది. ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగియగా, ఐరోపా సూచీలు రాణించాయి. 

  • మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ జీవనకాల గరిష్ఠమైన రూ.445.43 లక్షల కోట్లు (5.33 లక్షల కోట్ల డాలర్లు)గా నమోదైంది.
  • సెన్సెక్స్‌ ఉదయం 80,013.77 పాయింట్ల వద్ద దూకుడుగా ప్రారంభమైంది. అనంతరం అదే జోరు కొనసాగించిన సూచీ.. ఇంట్రాడేలో 80,074.30 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 545.35 పాయింట్ల లాభంతో 79,986.80 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 162.65 పాయింట్లు దూసుకెళ్లి 24,286.50 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 24,309.15 వద్ద రికార్డు గరిష్ఠాన్ని నమోదుచేసింది. 

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ధనాధన్‌: ఎమ్‌ఎస్‌సీఐ వర్థమాన మార్కెట్ల సూచీలో వెయిటేజీ పెరగొచ్చన్న వార్తలతో బుధవారం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లకు భారీ గిరాకీ కనిపించింది. ఇంట్రాడేలో 3.54% పెరిగిన షేరు రూ.1,791.90 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 2.18% లాభంతో రూ.1,768.35 వద్ద ముగిసింది. బ్యాంక్‌ మార్కెట్‌ విలువ రూ.28,758.71 కోట్లు పెరిగి రూ.13.45 లక్షల కోట్లకు చేరింది. 

  • భారత విపణిలోకి త్వరలో 2 యాంటీబయాటిక్స్‌ను విడుదల చేయనుండటంతో, వోకార్డ్‌ షేరు 5.35% లాభపడిన షేరు రూ.887.45 వద్ద ముగిసింది. గత 5 రోజుల్లో షేరు 40% పెరిగింది.

24 షేర్లకు లాభాలు: సెన్సెక్స్‌ 30 షేర్లలో 24 లాభపడ్డాయి. అదానీ పోర్ట్స్‌ అధికంగా 2.49% పెరిగింది. కోటక్‌ బ్యాంక్‌ 2.37%, యాక్సిస్‌ బ్యాంక్‌  2.07%, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 1.82%, ఎస్‌బీఐ 1.66%, పవర్‌గ్రిడ్‌ 1.41%, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌  1.25%, బజాజ్‌ ఫైనాన్స్‌ 1.25% చొప్పున మెరిశాయి. టీసీఎస్‌ 1.27%, టైటన్‌ 1.14%, రిలయన్స్‌     0.86%, టాటా మోటార్స్‌ 0.54% డీలాపడ్డాయి. 

మెరిసిన వ్రజ్‌ ఐరన్‌ షేర్లు: వ్రజ్‌ ఐరన్‌ అండ్‌ స్టీల్‌ షేర్లు అరంగేట్రంలో మెరిశాయి. ఇష్యూ ధర రూ.207తో పోలిస్తే బీఎస్‌ఈలో షేరు 15.94% లాభంతో రూ.240 వద్ద ప్రారంభమైంది. చివరకు 21.71% లాభంతో రూ.251.95 వద్ద అప్పర్‌ సర్క్యూట్‌ను తాకి, అక్కడే ముగిసింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.831 కోట్లుగా నమోదైంది. 

  • ఎంక్యూర్‌ ఫార్మా ఐపీఓ మొదటి రోజు 1.32 రెట్ల స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా 1,37,03,538 షేర్లను ఆఫర్‌ చేయగా, 1,80,25,840 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. 
  • ఐపీఓ ద్వారా రూ.3000 కోట్లు సమీకరించేందుకు పునరుత్పాదక ఇంధన సంస్థ ఆక్మే సోలార్‌ హోల్డింగ్స్‌ సెబీ వద్ద ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది.
  • బన్సల్‌ వైర్‌ ఇండస్ట్రీస్‌ ఐపీఓకు మొదటి రోజు  1.76 రెట్ల స్పందన దక్కింది.
  • దాద్రా నగర్‌ హవేలీ కేంద్రంలో తయారీ లోపాలపై సన్‌ఫార్మాకు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ యూఎస్‌ఎఫ్‌డీఏ హెచ్చరిక జారీ చేసింది. 

57 ట్రేడింగ్‌ రోజుల్లో 5000 పాయింట్లు

సెన్సెక్స్‌ 75,000 నుంచి 80,000 పాయింట్లను 57 ట్రేడింగ్‌ రోజుల్లో చేరుకుంది. సూచీకి ఇది మూడో వేగవంతమైన 5,000 పాయింట్ల లాభం. సెన్సెక్స్‌ 55,000 నుంచి 60,000 పాయింట్లను 28 ట్రేడింగ్‌ రోజుల్లో చేరుకుంది. 50,000 నుంచి 55,000 పాయింట్లను 33 ట్రేడింగ్‌ రోజుల్లో చేరింది. సెన్సెక్స్‌ తొలిసారి 5,000 పాయింట్లను చేరడానికి 4,357 ట్రేడింగ్‌ రోజులు పట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని