Stock market: గరిష్ఠాల నుంచి వెనక్కి

మదుపర్ల లాభాల స్వీకరణతో జీవనకాల గరిష్ఠ స్థాయుల నుంచి వెనక్కి వచ్చిన సెన్సెక్స్, నిఫ్టీ.. అతి స్వల్ప నష్టాల్లో ముగిశాయి.

Updated : 03 Jul 2024 03:14 IST

సమీక్ష

మదుపర్ల లాభాల స్వీకరణతో జీవనకాల గరిష్ఠ స్థాయుల నుంచి వెనక్కి వచ్చిన సెన్సెక్స్, నిఫ్టీ.. అతి స్వల్ప నష్టాల్లో ముగిశాయి. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, టెలికాం షేర్లు డీలాపడ్డాయి. ఐటీ షేర్లు మాత్రం కొనుగోళ్లతో కళకళలాడాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 4 పైసలు తగ్గి 83.48 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 0.66% లాభంతో 87.17 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో సియోల్‌ మినహా మిగతావి లాభాల్లో ముగిశాయి. ఐరోపా సూచీలు నష్టాల్లో ట్రేడయ్యాయి.

సెన్సెక్స్‌ ఉదయం 79,840.37 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఆరంభ ట్రేడింగ్‌లో 79,855.87 వద్ద జీవనకాల తాజా గరిష్ఠాన్ని తాకిన సూచీ, అమ్మకాలతో వెనక్కి వచ్చింది. ఒకదశలో 79,231.11 వద్ద కనిష్ఠానికి చేరినా, చివరకు 34.74 పాయింట్ల నష్టంతో 79,441.45 వద్ద ముగిసింది. నిఫ్టీ 18.10 పాయింట్లు తగ్గి 24,123.85 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 24,236.35 వద్ద రికార్డు గరిష్ఠాన్ని నమోదుచేసింది.

  • హిండెన్‌బర్గ్‌ ఆరోపణల నేపథ్యంలో కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేరు 2.16% నష్టపోయి రూ.1,769.60 వద్ద ముగిసింది. సంస్థ మార్కెట్‌ విలువ రూ.7,777.33 కోట్లు తగ్గి రూ.3.51 లక్షల కోట్లకు పరిమితమైంది. గతంలో హిండెన్‌బర్గ్‌ నివేదిక వెలుగు చూశాక, అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు కుదేలయ్యాయి. వీటి నుంచి లాభాలు పొందేందుకు కోటక్‌ బ్యాంక్, బ్రోకరేజీ విదేశీ మదుపరి చేత ఖాతా తెరిచినట్లు హిండెన్‌బర్గ్‌ తాజాగా ఆరోపించింది. 
  • సెన్సెక్స్‌ 30 షేర్లలో 19 డీలాపడ్డాయి. భారతీ ఎయిర్‌టెల్‌ 2.38%, కోటక్‌ బ్యాంక్‌ 2.16%, టాటా మోటార్స్‌ 2.07%, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 1.89%, ఎస్‌బీఐ 1.87%, ఐసీఐసీఐ బ్యాంక్‌ 1.79%, బజాజ్‌ ఫైనాన్స్‌ 1.54%, టైటన్‌ 0.93%, ఐటీసీ 0.92%, నెస్లే 0.86% నష్టపోయాయి.  ఎల్‌ అండ్‌ టీ 2.74%, ఇన్ఫోసిస్‌ 1.97%, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1.51%, టీసీఎస్‌  0.80% లాభపడ్డాయి. రంగాల వారీ సూచీల్లో.. టెలికాం 1.31%, బ్యాంకింగ్‌ 0.91%, వాహన 0.74%, ఆర్థిక సేవలు 0.67% తగ్గాయి. ఐటీ, యంత్ర పరికరాలు, స్థిరాస్తి, టెక్‌ రాణించాయి. బీఎస్‌ఈలో 2036 షేర్లు లాభపడగా, 1880 స్క్రిప్‌లు నష్టపోయాయి. 92 షేర్లలో ఎటువంటి మార్పులేదు.
  • స్టాక్‌ బ్రోకింగ్‌ షేర్లు కుదేల్‌: సభ్యులందరికీ ఒకే విధమైన ఛార్జీలు విధించే వ్యవస్థను అమలు చేయాలని స్టాక్‌ ఎక్స్ఛేంజీలు, ఇతర మార్కెట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థల (ఎంఐఐలు)ను సెబీ ఆదేశించడంతో స్టాక్‌ బ్రోకింగ్‌ కంపెనీల షేర్లు కుదేలయ్యాయి. ఏంజెల్‌ వన్‌ 8.72%, జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ 6.83%, మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ 4.19%, ఎస్‌ఎంసీ గ్లోబల్‌ 2.81%, డోలాట్‌ ఆల్గోటెక్‌ 2.28%, 5పైసా క్యాపిటల్‌ 0.05% నష్టాలు చవిచూశాయి. 
  • డివైన్‌ పవర్‌ ఎనర్జీ దూకుడు: ఇన్సులేటెడ్‌ వైర్‌లు, స్ట్రిప్‌ల తయారీ సంస్థ డివైన్‌ పవర్‌ ఎనర్జీ షేరు అరంగేట్రంలో దూసుకెళ్లింది. ఇష్యూ ధర రూ.40తో పోలిస్తే ఎన్‌ఎస్‌ఈ ఎమర్జ్‌పై 287.50% లాభంతో రూ.155 వద్ద షేరు ట్రేడింగ్‌ ప్రారంభమైంది. చివరకు రూ.150 వద్ద షేరు ముగిసింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.322.01 కోట్లుగా నమోదైంది.
  • అలైడ్‌ బ్లెండర్స్‌ అండ్‌ డిస్టిలర్స్‌ షేరు, ఇష్యూ ధర రూ.281తో పోలిస్తే బీఎస్‌ఈలో 13.20% లాభంతో రూ.318.10 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో రూ.324.40 వద్ద గరిష్ఠాన్ని తాకి, చివరకు 13.11% లాభంతో రూ.317.85 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.8,890.59 కోట్లుగా నమోదైంది. 
  • బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)గా కార్యకలాపాలు జరిపేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వద్ద దాఖలు చేసిన దరఖాస్తును తమ అనుబంధ సంస్థ జొమాటో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ స్వచ్ఛందంగా ఉపసంహరించుకున్నట్లు జొమాటో వెల్లడించింది. రుణ వ్యాపారంలో ముందుకు వెళ్లాలని భావించడం లేదని సంస్థ స్పష్టం చేసింది. బీఎస్‌ఈలో జొమాటో షేరు 2.45% లాభంతో రూ.209.05 వద్ద ముగిసింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని