Stock Market: రికార్డు గరిష్ఠాలకు సూచీలు.. 24,350 ఎగువన నిఫ్టీ

Stock Market Opening bell: ఉదయం 9:28 గంటల సమయంలో సెన్సెక్స్‌ 224 పాయింట్ల లాభంతో 80,210 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 71 పాయింట్లు పుంజుకొని 24,357 వద్ద ట్రేడవుతోంది.

Published : 04 Jul 2024 09:45 IST

Stock Market Opening bell | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలోనే రెండు ప్రధాన సూచీలు రికార్డు గరిష్ఠాలను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు మన సూచీలకు దన్నుగా నిలుస్తున్నాయి. ఉదయం 9:28 గంటల సమయంలో సెన్సెక్స్‌ 224 పాయింట్ల లాభంతో 80,210 వద్ద కొనసాగుతోంది. ఆరంభ ట్రేడింగ్‌లో ఈ సూచీ 80,331 వద్ద జీవనకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. నిఫ్టీ 71 పాయింట్లు పుంజుకొని 24,357 వద్ద ట్రేడవుతోంది. ఓ దశలో 24,372.15 వద్ద రికార్డు స్థాయిని అందుకుంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.54 వద్ద ప్రారంభమైంది.

సెన్సెక్స్‌-30 (Sensex) సూచీలో టాటా మోటార్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, ఎం అండ్ ఎం, హెచ్‌సీఎల్‌ టెక్‌, టాటా స్టీల్‌, ఎల్‌ అండ్‌ టీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, మారుతీ, ఎన్‌టీపీసీ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, సన్‌ఫార్మా, అదానీ పోర్ట్స్‌, హెచ్‌యూఎల్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఐటీసీ, నెస్లే ఇండియా, టెక్‌ మహీంద్రా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ఇటీవల వెలువడిన పలు స్థూల ఆర్థిక గణాంకాలు రేట్ల కోతకు దారితీసే సంకేతాలు కనిపిస్తున్నట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. దీంతో అమెరికా మార్కెట్లు (Stock Market) బుధవారం లాభాలతో ముగిశాయి. అక్కడినుంచి సంకేతాలు అందుకున్న ఆసియా మార్కెట్లు నేడు లాభాల బాటలో పయనిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 86.86 డాలర్ల వద్ద కొనసాగుతోంది. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) బుధవారం నికరంగా రూ.5,484 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) రూ.924 కోట్ల వాటాలను విక్రయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని