Spectrum auction: రెండ్రోజులకే ముగిసిన స్పెక్ట్రమ్‌ వేలం.. ఈసారి ఆదరణ అంతంతే..!

Spectrum auction: టెలికాం స్పెక్ట్రమ్‌ వేలం కేవలం రెండు రోజుల్లోనే ముగిసింది. రూ.11వేల కోట్ల విలువైన స్పెక్ట్రానికే బిడ్లు దాఖలయ్యాయి.

Published : 26 Jun 2024 15:49 IST

Spectrum auction | దిల్లీ: మొబైల్‌ వాయిస్‌ కాల్స్‌, డేటా కోసం కేంద్రం నిర్వహించిన టెలికాం స్పెక్ట్రమ్‌ వేలం (Spectrum auction) ముగిసింది. మొత్తం రూ.96,238 కోట్ల విలువైన 10 GHZ స్పెక్ట్రమ్‌ను వేలానికి ఉంచగా.. కేవలం రెండ్రోజుల్లోనే వేలం ముగిసింది. 12 శాతం స్పెక్ట్రానికి మాత్రమే బిడ్డింగులు వచ్చాయి. తొలిరోజు ఐదు రౌండ్ల బిడ్డింగ్‌లో రూ.11,340 విలువైన బిడ్లను టెలికాం కంపెనీలు సమర్పించగా.. బుధవారం ఎలాంటి బిడ్లూ లేకపోవడంతో ఉదయం 11.30 గంటలకే వేలం ముగిసినట్లు అధికారులు ప్రకటించారు.

జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియా ఈ వేలంలో పాల్గొన్నాయి. బుధవారం వేలం ముగిసే సమయానికి కేవలం 140-150 MHz స్పెక్ట్రానికే బిడ్లు దాఖలైనట్లు తెలుస్తోంది. దీంతో రూ.11వేల కోట్లు మాత్రమే ప్రభుత్వానికి ఆదాయం సమకూరనుంది. 2022లో చివరిసారిగా నిర్వహించిన స్పెక్ట్రమ్‌ వేలం ఏడు రోజుల పాటు సాగింది. మొత్తం రూ.1.5 లక్షల కోట్ల విలువైన 5జీ స్పెక్ట్రమ్‌ను టెలికాం కంపెనీలు కొనుగోలు చేశాయి. ఇందులో జియో టాప్‌ బిడ్డర్‌గా నిలిచింది. సుమారు రూ.88,078 కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ను ఆ కంపెనీ దక్కించుకుంది. ఎయిర్‌టెల్‌ రూ.43,084, వొడాఫోన్‌ ఐడియా రూ.18,799 కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేశాయి. తాజాగా నిర్వహించిన వేలం రెండ్రోజులకే ముగియడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని