Agricultural Loans: వ్యవసాయ రుణాలకు ప్రత్యేక కేంద్రాలు: ఎస్‌బీఐ

వ్యవసాయ రుణాల కోసం అగ్రికల్చరల్‌ సెంట్రలైజ్డ్‌ ప్రాసెసింగ్‌ సెల్స్‌ పేరుతో 35 ప్రత్యేక కేంద్రాలను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ప్రారంభించింది.

Published : 05 Jul 2024 03:51 IST

దిల్లీ: వ్యవసాయ రుణాల కోసం అగ్రికల్చరల్‌ సెంట్రలైజ్డ్‌ ప్రాసెసింగ్‌ సెల్స్‌ పేరుతో 35 ప్రత్యేక కేంద్రాలను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ప్రారంభించింది. ఇప్పటికే గృహరుణాల వంటివి మంజూరు చేసేందుకు ఆర్‌ఏసీపీసీ (రిటైల్‌ అసెట్స్‌ సెంట్రల్‌ ప్రాసెసింగ్‌ సెంటర్‌)లను ఎస్‌బీఐ నిర్వహిస్తున్న సంగతి విదితమే. డిజిటల్‌ బ్యాంకింగ్‌ అనూభూతిని పెంచేందుకు తన యాప్‌లకు మరిన్ని ప్రత్యేకతలను జోడించింది. వీటితో సహా మొత్తం 11 కొత్త కార్యక్రమాలకు తన 69వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఎస్‌బీఐ శ్రీకారం చుట్టింది.  

  • డిజిటల్‌ చెల్లింపుల అనుభూతిని విస్తరించేందుకు రెండు కొత్త ప్రత్యేకతలను ఎస్‌బీఐ పరిచయం చేసింది. బీమ్‌ ఎస్‌బీఐ పే యాప్‌లో ‘టాప్‌ అండ్‌ పే’ సదుపాయంతో పాటు, యోనో యాప్‌లో ‘మ్యూచువల్‌ ఫండ్స్‌పై డిజిటల్‌ రుణాలను అందించేందుకు’ శ్రీకారం చుట్టినట్లు తెలిపింది.
  • ఇళ్ల పైకప్పులపై సౌరపలకలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా, సౌర విద్యుదుత్పత్తికి కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన పీఎం సూర్య ఘర్‌ పథకం కింద రుణాలు ఇచ్చేందుకు ఎస్‌బీఐ ‘సూర్య ఘర్‌ లోన్‌’  పథకాన్ని ప్రారంభించింది. 10 కిలోవాట్‌ సామర్థ్యం వరకు సౌర విద్యుత్తు వ్యవస్థ ఏర్పాటుకు అవసరమైన రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఎంఎన్‌ఆర్‌ఈ/ ఆర్‌ఈసీ పోర్టల్‌లో దరఖాస్తు నమోదు దగ్గర నుంచి రుణ మంజూరు వరకు పూర్తి ప్రక్రియ ఎస్‌బీఐ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారానే జరగనుంది. 
  • ఎన్‌ఆర్‌ఐ వినియోగదార్ల కోసం పంజాబ్‌లోని పటియాలాలో రెండో గ్లోబల్‌ ఎన్‌ఆర్‌ఐ సెంటర్‌ను (జీఎన్‌సీ) ఎస్‌బీఐ ప్రారంభించింది. 
  • న్యాయవాద సమాజానికి మరింతగా సేవలందించేందుకు హైకోర్టు శాఖలను రీడిజైన్‌ చేసే కార్యక్రమానికి ఎస్‌బీఐ శ్రీకారం చుట్టింది. 
  • గృహ రుణాల మంజూరు ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చినట్లు ఎస్‌బీఐ తెలిపింది. రుణ దరఖాస్తు ప్రక్రియ ఏయే దశల్లో ఉందనే విషయాన్ని ఎస్‌ఎమ్‌ఎస్‌లు, మెయిల్‌ ద్వారా రుణ గ్రహీతలకు తెలియజేస్తున్నామని పేర్కొంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని