Stock market: సూచీల రికార్డుల పరుగు.. సెన్సెక్స్‌@ 79000.. నిఫ్టీ@ 24000

Stock market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు రికార్డు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 568 పాయింట్లు, నిఫ్టీ 175 పాయింట్ల లాభంతో ముగిశాయి.

Updated : 27 Jun 2024 16:54 IST

Stock market | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీల ర్యాలీ కొనసాగుతోంది. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు తర్వాత పుంజుకొని సరికొత్త రికార్డులను తిరగరాశాయి. వరుసగా కొత్త జీవనకాల గరిష్ఠాలను నెలకొల్పుతూ వస్తున్న సూచీలు.. మరో కీలక మైలురాయిని అధిగమించాయి. సెన్సెక్స్ 79 వేలు, నిఫ్టీ 24 వేల పాయింట్ల మార్కును దాటాయి. సరికొత్త రికార్డుల ఎగువనే ముగిశాయి. అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, రిలయన్స్‌, ఐటీ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతు దీనికి కారణం.

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ సూచీ ఉదయం 78,758.67 వద్ద ప్రారంభమైంది. ఆరంభంలో నష్టాల్లో కదలాడిన సూచీలు.. తర్వాత పుంజుకున్నాయి. ఈ క్రమంలో సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 79396.03 దగ్గర జీవనకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. నిఫ్టీ సైతం 24 వేల మైలురాయిని దాటి 24,087.45 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సెన్సెక్స్‌ జూన్‌ 25న 78 వేల మైలురాయిని అందుకోగా.. నిఫ్టీ 23 సెషన్లలోనే 23 వేల స్థాయి నుంచి 24 వేల స్థాయికి చేరుకుంది.

సెన్సెక్స్‌ చివరికి 568.93 పాయింట్ల లాభంతో 79,243.18 వద్ద ముగిసింది. నిఫ్టీ 175.70 పాయింట్ల లాభంతో 24,044.50 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌ 30 సూచీలో అల్ట్రాటెక్‌ సిమెంట్, ఎన్టీపీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా మోటార్స్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. ఎల్‌అండ్‌టీ, సన్‌ఫార్మా, నెస్లే ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, మారుతీ సుజుకీ నష్టపోయాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్ ధర 85.57 డాలర్లు, బంగారం ఔన్సు 2323 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ  83.45గా ఉంది.

  • భారత సిమెంట్‌ తయారీ పరిశ్రమలో మరో కీలక ఒప్పందం ఖరారైంది. చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ఇండియా సిమెంట్స్‌ లిమిటెడ్‌లో 23 శాతం వాటాలు కొనుగోలు చేయనున్నట్లు అల్ట్రాటెక్‌ సిమెంట్‌ ప్రకటించింది. ఈ నేపథ్యంలో అల్ట్రాటెక్‌ సిమెంట్‌ షేరు విలువ గురువారం రూ.606.75 (5.45 శాతం) లాభపడి రూ.11,749 వద్ద ముగిసింది. ఇండియా సిమెంట్స్‌ షేరు సైతం రూ.29.13 (11.09 శాతం) లాభంతో రూ.291.75 వద్ద ముగిసింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని