Stock Market Update: సూచీల ర్యాలీ.. 79వేల ఎగువకు సెన్సెక్స్‌, 24 వేలు దాటిన నిఫ్టీ

Stock Market Update: సెన్సెక్స్‌ తొలిసారి 79,000 కీలక మైలురాయిని తాకింది. నిఫ్టీ కూడా 24 వేల మైలురాయిని అధిగమించింది.

Updated : 27 Jun 2024 12:51 IST

Stock Market Update | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీల ర్యాలీ వరుసగా నాలుగో రోజూ కొనసాగుతోంది. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు తర్వాత పుంజుకొని సరికొత్త గరిష్ఠాలకు చేరాయి. సెన్సెక్స్‌ తొలిసారి 79,000 కీలక మైలురాయిని తాకింది. నిఫ్టీ సైతం తొలిసారి 24 వేల మార్కును దాటింది. బ్లూ చిప్‌ స్టాక్స్‌లో వచ్చిన ర్యాలీతో సూచీలు సరికొత్త గరిష్ఠాలను నమోదు చేశాయి.

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ సూచీ ఉదయం 78,530 దగ్గర నష్టాలతో ప్రారంభమైంది. కాసేపటికే పుంజుకొని ఓ దశలో 79,033 దగ్గర జీవనకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. నిఫ్టీ 23,840 దగ్గర ప్రారంభమై.. ఇంట్రాడేలో 24,015.25 వద్ద సరికొత్త శిఖరానికి చేరింది. 23 వేల నుంచి 24 వేల మైలురాయిని కేవలం 23 సెషన్లలోనే నిఫ్టీ అందుకుంది. సెన్సెక్స్‌-30 సూచీలో అల్ట్రాటెక్‌ సిమెంట్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, కోటక్ మహీంద్రా బ్యాంక్‌, టాటా స్టీల్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. మారుతీ, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఎల్‌ అండ్‌ టీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

బ్యాంకింగ్‌, టెలికాం సహా ఇతర రంగాల్లో ఫండమెంటల్‌గా బలంగా ఉన్న లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌లో ర్యాలీ వల్లే మార్కెట్లు రాణిస్తున్నాయని జియోజిట్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్‌ వి.కె.విజయ్‌కుమార్‌ తెలిపారు. బుధవారం వరకు ర్యాలీకి దూరంగా ఉన్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సైతం ఈరోజు సూచీల పరుగుకు తోడైనట్లు వెల్లడించారు. స్వల్పకాలంలో మార్కెట్లలో బుల్లిష్‌ సెంటిమెంట్‌ కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. త్వరలో సెన్సెక్స్‌ 80,000 మార్క్‌నూ తాకే అవకాశం ఉందన్నారు. మరోవైపు నేడు ఆసియా మార్కెట్లలో సియోల్‌, టోక్యో, షాంఘై, హాంకాంగ్‌ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అమెరికా మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి.

సెన్సెక్స్‌ కీలక మైలురాళ్లు ఇలా..

గమనిక: పై సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడి నష్టభయంతో కూడుకొన్న వ్యవహారం. షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం పూర్తిగా మీ వ్యక్తిగత నిర్ణయం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని