Stock market: బ్యాంకింగ్‌ షేర్లలో ఒత్తిడి.. ఆరంభ లాభాలు ఆవిరి

Stock market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్‌ 34, నిఫ్టీ 18 పాయింట్లు చొప్పున నష్టపోయాయి.

Updated : 02 Jul 2024 16:00 IST

Stock market | ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock market) ఫ్లాట్‌గా ముగిశాయి. ఉదయం రికార్డు గరిష్ఠాల వద్ద ప్రారంభమైన సూచీలు.. ఇంట్రాడేలో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్‌ షేర్లలో ఒత్తిడి కారణంగా సూచీలు ఆరంభ లాభాలను కోల్పోయాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా, ఎస్‌బీఐ షేర్లు ప్రధానంగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.

సెన్సెక్స్‌ ఉదయం 79,840.37 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 79855.87 పాయింట్ల వద్ద సరికొత్త జీవనకాల గరిష్ఠాలను నమోదు చేసింది. తర్వాత నష్టాల్లోకి జారుకుంది. చివరికి 34.74 పాయింట్ల నష్టంతో 79,441.45 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 24,236 పాయింట్ల వద్ద ఇంట్రాడే గరిష్ఠాలను నమోదు చేసి చివరికి 18 పాయింట్ల నష్టంతో 24,123.85 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.50గా ఉంది.

సెన్సెక్స్‌ 30 సూచీలో ఎల్‌అండ్‌టీ, ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ షేర్లు లాభపడగా.. భారతీ ఎయిర్‌టెల్‌, కోటక్‌ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, ఇండస్‌ ఇండ్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా షేర్లు నష్టపోయాయి. ఆఫీసర్స్‌ ఛాయిస్‌ విస్కీ తయారీ సంస్థ అలైడ్‌ బ్లెండర్స్‌ అండ్‌ డిస్టిలర్స్‌ సంస్థ స్వల్ప లాభాలతో లిస్టయింది. ఇష్యూ ధర రూ.281 కాగా.. 13.87 శాతం ప్రీమియంతో రూ.320 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో రూ.324 వరకు వెళ్లిన షేరు ధర చివరికి రూ.317.90 వద్ద ముగిసింది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 87 డాలర్ల వద్ద, ఔన్సు బంగారం ధర 2333 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని