Hindenburg: హిండెన్‌బర్గ్‌కు సెబీ షోకాజ్‌

అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్ల విషయంలో ‘సహేతుకం కాని ట్రేడింగ్‌’ జరిపిందంటూ అమెరికా షార్ట్‌సెల్లింగ్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌పై భారత మార్కెట్ల నియంత్రణాధికార సంస్థ సెబీ ఆరోపణలు చేసింది.

Published : 03 Jul 2024 03:04 IST

అవి అర్థం లేని నోటీసులన్న అమెరికా షార్ట్‌సెల్లింగ్‌ సంస్థ
అవినీతిని వెలికితీసేవారి నోరు మూయించేందుకేనని ఆరోపణలు

దిల్లీ: అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్ల విషయంలో ‘సహేతుకం కాని ట్రేడింగ్‌’ జరిపిందంటూ అమెరికా షార్ట్‌సెల్లింగ్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌పై భారత మార్కెట్ల నియంత్రణాధికార సంస్థ సెబీ ఆరోపణలు చేసింది. ఆ సంస్థకు షోకాజ్‌ నోటీసు సైతం జారీ చేసింది. 2023 జనవరిలో విడుదల చేసిన నివేదికలో ‘సంచలనం చేయడం కోసం, కావాలనే కొన్ని నిజాలను హిండెన్‌బర్గ్‌ దాచిపెట్టిందని’ తాజా నోటీసుల్లో సెబీ పేర్కొంది. ఈ ఏడాది జూన్‌ 26న సెబీ జారీ చేసిన నోటీసులపై హిండెన్‌బర్గ్‌ మంగళవారం స్పందించింది. అదానీ కంపెనీల షేర్ల ట్రేడింగ్‌ ద్వారా తాము 4.1 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.34 కోట్ల) లాభాలనే పొందినట్లు పేర్కొంది. తమ నివేదికలో అదానీ గ్రూప్‌పై చేసిన ఆరోపణలపై, నిర్వహించాల్సిన దర్యాప్తుపై దృష్టి సారించకుండా సెబీ తమపై తిరిగి ఆరోపణలు చేస్తోందని హిండెన్‌బర్గ్‌ విమర్శించింది. 

కోటక్‌ పేరును కావాలనే మరిచారా?

భారత్‌కు చెందిన కోటక్‌ బ్యాంక్‌ పేరును సెబీ నోటీసుల్లో ప్రస్తావించకుండా, కావాలనే మరిచిపోయిందని హిండెన్‌బర్గ్‌ పేర్కొంది. ‘హిండెన్‌బర్గ్‌ పెట్టుబడిదారు, భాగస్వామి వినియోగించిన ఆఫ్‌షోర్‌ ఫండ్‌ను సృష్టించింది, నిర్వహించింది కోటక్‌యేనని.. కావాలని కోటక్‌ పేరును రాయకుండా.. కేఎమ్‌ఐఎల్‌ అంటూ ఒక ‘మాస్క్‌’ను సెబీ తొడిగిందని’ని ఆరోపించింది. కోటక్‌ మహీంద్రా ఇన్వెస్ట్‌మెంట్స్‌ (కేఎమ్‌ఐఎల్‌) అనేది కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ చెందిన సంస్థ. 

గతేడాది జనవరిలో హిండెన్‌బర్గ్‌ విడుదల చేసిన నివేదికతో అదానీ గ్రూప్‌నకు చెందిన నమోదిత కంపెనీల మార్కెట్‌ విలువ 150 బిలియన్‌ డాలర్ల (ప్రస్తుత డాలర్‌ విలువ ప్రకారం సుమారు రూ.12.45 లక్షల కోట్ల) మేర తుడిచిపెట్టుకుపోయిన విషయం విదితమే. హిండెన్‌బర్గ్‌ ఆరోపణలు నిరాధారమైనవని, దురుద్దేశంతో చేసినవని అదానీ గ్రూప్‌ పేర్కొంటూ వచ్చింది. సుప్రీం కోర్టు కూడా ఈ ఏడాది జనవరిలో సెబీ దర్యాప్తునకు మించి ఇతర దర్యాప్తులేవీ అవసరం లేదనీ స్పష్టం చేసింది.

కోటక్‌ ఏమందంటే..

కోటక్‌ మహీంద్రా ఇన్వెస్ట్‌మెంట్స్‌ (కేఎమ్‌ఐఎల్‌) ఒక ఆఫ్‌షోర్‌ ఫండ్‌ ఏర్పాటు చేసిందన్న హిండెన్‌బర్గ్‌ ఆరోపణలపై కోటక్‌ స్పందించింది. కేఎమ్‌ఐఎల్‌కు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్‌గా ఉన్న కే-ఇండియా ఆపర్చునిటీస్‌ ఫండ్‌ (కేఐఓఎఫ్‌) సెబీ నమోదిత ఎఫ్‌పీఐ అని.. అది ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కమిషన్‌ ఆఫ్‌ మారిషస్‌ నియంత్రణలో ఉందని సంస్థ ప్రతినిధి వివరించారు. కేఐఓఎఫ్‌ క్లాస్‌ ఎఫ్‌ షేర్లను కింగ్డ్‌న్‌ క్యాపిటల్‌ సబ్‌స్రైబ్‌ చేసిందనీ తెలిపింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన 8.5 లక్షల ఫ్యూచర్‌ షేర్లను షార్ట్‌ పొజిషన్ల రూపంలో కేఐఓఎఫ్‌ తీసుకుంది. నివేదిక వెలువడిన అనంతరం 22.25 మి. డాలర్ల (దాదాపు రూ.183 కోట్లు) లాభం పొందిందనీ వివరించింది. ఈ ఫండ్‌ ఏ క్లయింటును తీసుకునే సమయంలోనైనా కేవైసీని పాటిస్తుందని.. కేఎమ్‌ఐఎల్‌కు కానీ కేఐఓఎఫ్‌కు కానీ హిండెన్‌బర్గ్‌ క్లయింటుగా లేనట్లు ఆ ప్రతినిధి స్పష్టం చేశారు. తమ ఫండ్‌కు చెందిన పెట్టుబడిదార్లతో హిండెన్‌బర్గ్‌ భాగస్వామిగా ఉందని తమకు తెలియదనీ తెలిపారు. విడుదలకు ముందే నివేదికను కింగ్డన్‌ క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్‌తో హిండెన్‌బర్గ్‌ పంచుకుంది. 

మమ్మిల్ని బెదిరించడానికే నోటీసులు

కేవలం తమను బెదిరించడానికే సెబీ నోటీసులు జారీ చేసిందని హిండెన్‌బర్గ్‌ పేర్కొంది. అవినీతిని, మోసాలను బయటపెట్టిన వారిని బెదిరించడానికి, భారత్‌లో ఉన్న అత్యంత శక్తిమంత వ్యక్తులను కాపాడడానికే ఈ నోటీసులని ఆరోపించింది. ‘కోటక్‌ బ్యాంక్‌ వ్యవస్థాపకుడైన ఉదయ్‌ కోటక్‌ వ్యక్తిగతంగా సెబీకి చెందిన 2017 కమిటీ ఆన్‌ కార్పొరేట్‌ గవర్నెన్స్‌కు నేతృత్వం వహించారు. కోటక్‌ కానీ, ఇతర కోటక్‌ బోర్డు సభ్యుడి పేరును కానీ సెబీ ఎందుకు పేర్కొనలేదు. మరో శక్తిమంత భారతీయ వ్యాపారవేత్తను కాపాడడానికేనా’ అని హిండెన్‌బర్గ్‌ ప్రశ్నించింది.  

21 రోజుల సమయం

కింగ్డన్‌తో హిండెన్‌బర్గ్‌ అనుబంధం 2022 చివర్లోనే మొదలైందని.. అంటే నివేదికకు ముందు ఇది జరిగిందని 46 పేజీల నోటీసులో సెబీ ఆరోపించింది. అదానీ కంపెనీల షేర్లలో షార్ట్‌ పొజిషన్లు తీసుకున్న కింగ్డన్, హిండెన్‌బర్గ్‌ నివేదిక విడుదల చేశాక.. షేర్ల విలువలు పతనం కావడంతో, ఆ పొజిషన్లను వదిలించుకోవడం ద్వారా సొమ్ముచేసుకుందని సెబీ ఆరోపించింది. ఈ ఆరోపణలపై స్పందించడానికి హిండెన్‌బర్గ్‌కు 21 రోజుల సమయం ఇచ్చింది. తాము అదానీ కంపెనీల షేర్ల షార్ట్‌ సెల్లింగ్‌ ద్వారా 4.1 మి. డాలర్లను పొందినట్లు హిండెన్‌బర్గ్‌ అంగీకరించింది. అదానీ అమెరికా బాండ్లను ఒక పెట్టుబడిదారు ద్వారా షార్ట్‌ సెల్‌ చేయడం ద్వారా 31,000 డాలర్లు పొందినట్లు తెలిపింది. అయితే ఆ పెట్టుబడిదారు ఎవరో చెప్పలేదు.

మాకు ఒక్క భాగస్వామే..

‘అదానీ షేర్లను షార్ట్‌ చేయడం కోసం డజన్ల కొద్దీ కంపెనీలతో కలిసి హిండెన్‌బర్గ్‌ పనిచేసిందా.. వందల మిలియన్ల కొద్దీ డాలర్లను ఆర్జించిందా? అని షోకాజ్‌ నోటీసులో అడిగారు. మేం అటువంటిదేమీ చేయలేదు. కేవలం ఒకే పెట్టుబడిదారుతో కలిసి పనిచేశాం. మాకు ఖర్చులకు కూడా ఆ లాభాలు సరిపోలేదు. ఇప్పటికీ మా ఆరోపణలకు అదానీ సరైన వివరణ ఇవ్వలేద’ని హిండెన్‌బర్గ్‌ పేర్కొంది. ‘ఇదేమీ పెద్ద అంతుబట్టని విషయం కాదు. అదానీ షేర్లను మేం షార్ట్‌ చేశామని ముందు నుంచీ చెబుతూనే వచ్చామ’ని ఈ సందర్భంగా పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని