Sebi: ప్రాయోజిత గ్రూపు సంస్థల షేర్లలో 25% మించి పెట్టుబడులు పెట్టొచ్చు

ప్రాయోజిత సంస్థ (స్పాన్సర్స్‌)కు చెందిన గ్రూపు కంపెనీల షేర్లలో 25 శాతానికి మించి పెట్టుబడులు పెట్టేందుకు  ప్యాసివ్‌ ఫండ్స్‌కు సెబీ అనుమతినిచ్చింది. ఈ మేరకు మ్యూచువల్‌ ఫండ్‌ నిబంధనల్లో సవరణలు చేస్తూ ఓ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Published : 04 Jul 2024 02:56 IST

ప్యాసివ్‌ ఫండ్స్‌కు సెబీ అనుమతి 

దిల్లీ: ప్రాయోజిత సంస్థ (స్పాన్సర్స్‌)కు చెందిన గ్రూపు కంపెనీల షేర్లలో 25 శాతానికి మించి పెట్టుబడులు పెట్టేందుకు  ప్యాసివ్‌ ఫండ్స్‌కు సెబీ అనుమతినిచ్చింది. ఈ మేరకు మ్యూచువల్‌ ఫండ్‌ నిబంధనల్లో సవరణలు చేస్తూ ఓ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇండెక్స్‌ ఫండ్స్, ఎక్స్ఛేంజీ ట్రేడెడ్‌ ఫండ్స్‌ను ప్యాసివ్‌ ఫండ్స్‌గా వ్యవహరిస్తారు. ఇవి మార్కెట్‌ పనితీరుకు ప్రతిబింబంగా పనిచేస్తాయి. ఇంతకుమునుపు మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలు తమ ఎన్‌ఏవీ (నికర ఆస్తి విలువ)లో 25 శాతానికి మించి స్పాన్సర్‌కు చెందిన గ్రూపు కంపెనీల షేర్లలో పెట్టుబడి పెట్టేందుకు వీల్లేదు. దీనివల్ల సూచీలో 25 శాతానికి మించి స్పాన్సర్‌కు చెందిన గ్రూపు కంపెనీల షేర్లున్న సందర్భంలో, సూచీల పనితీరును ప్యాసివ్‌ ఫండ్స్‌ పూర్తి స్థాయిలో ప్రతిబింబించ లేకపోతున్నాయి. ఈ పరిణామం సూచీలో స్పాన్సర్‌ గ్రూపు కంపెనీల షేర్లు 25 శాతానికి మించి లేని ఫండ్‌ సంస్థలకు అనుకూలంగా మారగా.. 25 శాతం మించి ఉన్న సంస్థలకు ప్రతికూలంగా మారింది. అందువల్ల అన్ని ఫండ్‌ సంస్థలకు సమాన వ్యాపార అవకాశాలను కల్పించాలనే ఉద్దేశంతో మ్యూచువల్‌ ఫండ్‌ నిబంధనలను సవరిస్తూ సెబీపై నిర్ణయాన్ని తీసుకుంది. 

బాండ్ల ముఖ విలువ రూ.10000కు తగ్గింపు: డెట్‌ సెక్యూరిటీల (బాండ్లు) ముఖ విలువను ప్రస్తుత రూ.1 లక్ష నుంచి రూ.10,000కు సెబీ తగ్గించింది. కార్పొరేట్‌ బాండ్ల విపణిలో రిటైల్‌ మదుపర్ల ప్రాతినిథ్యం పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. డెట్‌ సెక్యూరిటీలకు తక్కువ ముఖ విలువ ఉంటే.. సంస్థాగతేతర మదుపర్లు కూడా కార్పొరేట్‌ బాండ్ల విపణిలో పాల్గొనేలా ప్రోత్సహించినట్లు అవుతుందని మార్కెట్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ద్రవ్యలభ్యత పెరిగేందుకు కూడా ఈ పరిణామం దోహదం చేస్తుందని విశ్లేషిస్తున్నాయి. 

మార్కెట్‌లో అవకతవకల నియంత్రణ బాధ్యత బ్రోకర్లకూ: మార్కెట్‌లో అవకతవకల గుర్తింపు, నియంత్రణ నిమిత్తం స్టాక్‌ బ్రోకర్లు ఓ సంస్థాగత వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు బ్రోకర్లపైనా అవకతవకల నియంత్రణ బాధ్యతను ఉంచుతూ సెబీ నిబంధనలను నోటిఫై చేసింది. ఈ నిబంధనల ప్రకారం.. నిఘా, నియంత్రణ వ్యవస్థల ఏర్పాటు ద్వారా మార్కెట్లో అవకతవకలు, మోసాల గుర్తింపు, నియంత్రణ విషయంలో బ్రోకింగ్‌ సంస్థలు, వాటి ఉన్నత యాజమాన్యం జవాబుదారీ అవుతారు. ఏదేని అనుమానిత కార్యకలాపాలను గుర్తించినట్లయితే 48 గంటల్లోగా ఆ సమాచారాన్ని స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు బ్రోకర్లు తెలియజేయాల్సి ఉంటుందని తన నోటిఫికేషన్‌లో సెబీ తెలిపింది. అనుమానిత కార్యకలాపాలు, మోసాలు చోటుచేసుకున్నట్లయితే ఎలాంటి చర్యలు చేపట్టారో పూర్తి వివరాలతో ఓ నివేదికను ఆరు నెలలకోసారి ఎక్స్ఛేంజీలకు బ్రోకర్లు సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ మోసాలేవీ చోటుచేసుకోకుంటే.. ఆ విషయాన్ని కూడా ‘జీరో రిపోర్ట్‌’ కింద సమర్పించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని