SBI: ఎస్‌బీఐ ఛైర్మన్‌గా తెలుగు వ్యక్తి!

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) తదుపరి ఛైర్మన్‌ పదవికి ఇదే బ్యాంక్‌లో మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్న చల్లా శ్రీనివాసులు (సీఎస్‌) శెట్టి పేరును ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ బ్యూరో (ఎఫ్‌ఎస్‌ఐబీ) సిఫారసు చేసింది.

Published : 30 Jun 2024 03:18 IST

చల్లా శ్రీనివాసులు శెట్టి పేరు సిఫారసు
కేబినెట్‌ నియమాకాల కమిటీదే తుది నిర్ణయం

దిల్లీ: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) తదుపరి ఛైర్మన్‌ పదవికి ఇదే బ్యాంక్‌లో మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్న చల్లా శ్రీనివాసులు (సీఎస్‌) శెట్టి పేరును ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ బ్యూరో (ఎఫ్‌ఎస్‌ఐబీ) సిఫారసు చేసింది. ప్రస్తుతం ఆయన అంతర్జాతీయ బ్యాంకింగ్, గ్లోబల్‌ మార్కెట్స్, టెక్నాలజీ విభాగాల బాధ్యతలను చూసుకుంటున్నారు. 2020 జనవరిలో ఆయన ఎస్‌బీఐ ఎండీగా నియమితులయ్యారు. 2024 ఆగస్టు 28న ప్రస్తుత ఛైర్మన్‌ దినేశ్‌ కుమార్‌ ఖారా(63) పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆ స్థానంలోకి సరైన వ్యక్తిని ఎంపిక చేసే బాధ్యతను ఎఫ్‌ఎస్‌ఐబీ తీసుకుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల డైరెక్టర్లను ఎంపిక చేసే ఎఫ్‌ఎస్‌ఐబీ శనివారం ముగ్గురిని ఇంటర్వ్యూ చేసి సీఎస్‌ శెట్టి పేరును ఛైర్మన్‌ పదవికి సిఫారసు చేసింది. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేబినెట్‌ నియామకాల కమిటీ (ఏసీసీ)తుది నిర్ణయం తీసుకుంటుంది.

ఎఫ్‌ఎస్‌ఐబీకి అధిపతిగా వ్యక్తిగత, శిక్షణ విభాగం మాజీ కార్యదర్శి భాను ప్రతాప్‌ శర్మ వ్యవహరిస్తున్నారు. ఈ బ్యూరోలో ఆర్థిక సేవల కార్యదర్శి, ప్రభుత్వ సంస్థల విభాగ కార్యదర్శి, ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ సభ్యులుగా ఉన్నారు. ఓరియంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ మాజీ ఛైర్మన్, ఎండీ అనిమేశ్, ఆర్‌బీఐ మాజీ ఈడీ దీపక్, ఐఎన్‌జీ వైశ్యా బ్యాంక్‌ మాజీ ఎండీ శైలేంద్ర కూడా సభ్యులుగా ఉన్నారు.


నేనో యాక్సిడెంటల్‌ బ్యాంకర్‌ను.. 

ఈనాడు, హైదరాబాద్‌: ‘వాస్తవానికి నేను ఒక యాక్సిడెంటల్‌ బ్యాంకర్‌ను. అందరూ బ్యాంకు పరీక్షలు రాస్తున్నారు కాబట్టి, నేనూ రాశాను. ఇలా 1988లో ఎస్‌బీఐలో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా నా ప్రస్థానం ప్రారంభమైంది. నాకు చిన్నప్పటి నుంచీ ఐఏఎస్‌ అధికారి కావాలనే కల ఉండేది. కానీ, బ్యాంకులో చేరిన తర్వాత సమాజానికి సేవ చేసేందుకు బ్యాంకింగ్‌ వ్యవస్థలోనూ ఎన్నో అవకాశాలు ఉన్నాయని అర్థమయ్యింది’ అని చల్లా శ్రీనివాసులు శెట్టి ‘ఈటీవీ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

బ్యాంకరే కీలకం..: ‘వృత్తిపరంగా ఎదిగేందుకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎన్నో అవకాశాలు కల్పిస్తుంది. ఖాతాదారులకు సేవ చేస్తూ.. బ్యాంకు విలువలను కాపాడుతూ, వ్యాపారాన్ని పెంచే సామర్థ్యం ఉంటే చాలు.. బ్యాంకులో ఉన్నత స్థానానికి చేరుకోవడం సాధ్యమేన’ని సీఎస్‌ శెట్టి పేర్కొన్నారు. ‘సమాజానికి మన వంతుగా ఏం చేస్తున్నాం అనే ప్రశ్నతోపాటు మనం చేస్తున్న పని మనకు సంతృప్తి కలిగించాలి. బ్యాంకింగ్‌ రంగంలోకి రావాలనుకుంటున్న, ఇప్పటికే ఉన్న యువత ఒక విషయాన్ని తెలుసుకోవాలి. బ్యాంకు అంటే ఏదో ఒక శాఖలో పని చేస్తున్నాం, వచ్చిన ఖాతాదారులకు ఏదో ఒక పని చేసి పెడుతున్నాం అని కాదు.. సమాజానికి ఆర్థిక సేవలను పరిచయం చేయడం. ఒక వ్యక్తి వ్యాపారం చేయడానికి సహాయం చేయడం, ఒక బృందానికి నాయకత్వం వహించడం ఎలాగో తెలుసుకోవడం.. ఇలా ఎన్నో ఉంటాయి. సమాజంలో బ్యాంకర్‌ పాత్ర ఎంతో కీలకం’ అని ఆయన పేర్కొన్నారు. 

పాలమూరు నుంచి..: శ్రీనివాసులు శెట్టి జన్మస్థలం జోగులాంబ గద్వాల జిల్లా (ఉమ్మడి మహబూబ్‌నగర్‌), మానవపాడు మండలం, పెద్దపోతులపాడు గ్రామం. ఏడో తరగతి వరకూ సొంతూర్లోని ప్రాథమికోన్నత పాఠశాలలో చదువుకున్నారు. ఆ తర్వాత ఇంటర్మీడియట్‌ వరకూ గద్వాలలో విద్యాభ్యాసం జరిగింది. హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లో ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్‌సీ అగ్రికల్చర్‌ చదివారు. ఆ తర్వాత 1988లో ఎస్‌బీఐలో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా చేరారు. గుజరాత్, హైదరాబాద్, ముంబయితో పాటు న్యూయార్క్‌లోనూ పనిచేశారు. డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్, చీఫ్‌ జనరల్‌ మేనేజర్, జనరల్‌ మేనేజర్, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌గా పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. 2020 నుంచి మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ)గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఉన్న ఎండీల్లో అందరి కంటే సీనియర్‌ ఈయనే కావడంతో సంప్రదాయం ప్రకారం ఈయన పేరును ఛైర్మన్‌ పదవికి సిఫారసు చేశారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని