scams: ఫేస్‌బుక్‌, వాట్సప్‌ వేదికగా చెలరేగిపోతున్న స్కామర్లు..!

Investment scams: నిత్యం వినియోగిస్తున్న మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌ల ద్వారానే కేటుగాళ్లు పెద్ద మొత్తంలో మోసాలకు పాల్పడుతున్నారు. 

Published : 02 Jul 2024 19:56 IST

investment scams | ఇంటర్నెట్‌డెస్క్‌: స్కామ్‌.. స్కామ్‌.. స్కామ్‌.. ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న పదం ఇది. నిత్యం ఎవరో ఒకరు ఏదో ఒక చోట స్కామ్‌ బారిన పడుతూనే ఉన్నారు. ముఖ్యంగా పెట్టుబడుల పేరుతో జరుగుతున్న మోసాలు ఇటీవల కాలంలో పెరిగిపోతున్నాయి. ఏ మాత్రం అవగాహన లేకున్నా అధిక మొత్తంలో డబ్బులు ఆర్జించవచ్చంటూ కేటుగాళ్లు చెప్పే మాయ మాటలు నమ్మి డబ్బులు కోల్పోతున్న వాళ్ల సంఖ్య జాబితా పెరుగుతోంది. అదేదో గుట్టుచప్పుడు కాకుండా ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారనుకుంటే పొరపాటే. ఏకంగా సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌ల వేదికగానే ప్రచారాలు చేస్తూ ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారు. ఈ విషయం ఓ అధ్యయనంలో తేలింది.

ఫేస్‌బుక్‌, వాట్సప్‌, టెలిగ్రామ్‌ లాంటి మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌లనే నిత్యం ఎక్కువ మంది వినియోగిస్తుంటారు. ఇలా తరచూ వాడే సోషల్‌మీడియా వేదికలనే తమ ప్రచార ఆయుధాలుగా మార్చుకుని పెట్టుబడి పెట్టేలా ప్రేరేపిస్తున్నారు మోసగాళ్లు. స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులతో భారీగా సంపాదించవచ్చంటూ మాయ చేస్తారు. ఇలా నెట్టింట ఉండే ఫేక్‌ కంటెంట్‌పై CloudSEK అనే సంస్థ పరిశోధన చేసింది. అందులో విస్తుపోయే విషయాలు వెల్లడించింది. 81,000 నకిలీ వాట్సాప్ గ్రూప్‌లు, ఫేస్‌బుక్‌లో 29,000 ఫేక్‌ ప్రకటనలు  గుర్తించినట్లు పేర్కొంది. యూజర్లలో విశ్వాసం కలిగించేందుకు గుర్తింపు పొందిన ఆర్థిక సంస్థల పేరిట ఎక్స్‌లో ఏకంగా 81 వేల ఖాతాలను క్రియేట్‌ చేసినట్లు గుర్తించింది.

ఈ నెలలోనే అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌.. తేదీలు ఇవే!

‘‘ముందుగా వివిధ సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా యూజర్లకు చేరువ అవుతారు. తమ వద్ద ఉన్న డేటా సాయంతో సందేశాలు పంపుతారు. చట్టబద్ధమైన పెట్టుబడి సంస్థలతో వ్యవహరిస్తున్నామని నమ్మిస్తారు. తమ వద్ద మదుపు చేస్తే అత్యధికంగా ఆర్జించవచ్చంటూ విశ్వసించేందుకు నకిలీ రుజువులు చూపుతారు. అధిక రాబడికి హామీ ఇస్తూ నకిలీ లాభాలు చూపుతారు. చివరకు ఉన్నదంతా దోచుకొని నెట్టింట ముంచేస్తారు’’ అని పరిశోధన సంస్థ తెలిపింది.

భారత్‌, మలేషియా, అమెరికా, థాయ్‌ల్యాండ్‌, వియత్నాం వంటి దేశాలు ఈ తరహా మోసగించే వారికి ప్రధాన లక్ష్యంగా ఉన్నాయని పేర్కొంది. గతేడాదిలో భారత్‌లో లక్ష కంటే ఎక్కువ మోసాలు జరిగితే.. 2024లో మొదటి నాలుగు నెలల్లో 4,599 డిజిటల్‌ మోసాల్లో బాధితులు కోల్పోయిన మొత్తం రూ.100 కోట్ల పైమాటేనని పేర్కొంది. అదే సమయంలో 62,687 ఫిర్యాదులు నమోదయ్యాయని వెల్లడించింది. దీనిబట్టి రూ.200 కోట్లకు పైగానే సైబర్‌ కేటుగాళ్ల చేతికి చిక్కిందని క్లౌడ్‌సెక్‌ అంచనా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని