Today Stock Market: మూడో రోజూ రికార్డుల ర్యాలీ

వరుసగా మూడో రోజూ దేశీయ సూచీల రికార్డుల ర్యాలీ కొనసాగింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్, ఎయిర్‌టెల్‌ షేర్లు లాభపడటంతో సెన్సెక్స్, నిఫ్టీ జీవనకాల తాజా గరిష్ఠాలకు చేరాయి.

Updated : 27 Jun 2024 07:13 IST

తాజా గరిష్ఠాలకు సెన్సెక్స్, నిఫ్టీ

రుసగా మూడో రోజూ దేశీయ సూచీల రికార్డుల ర్యాలీ కొనసాగింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్, ఎయిర్‌టెల్‌ షేర్లు లాభపడటంతో సెన్సెక్స్, నిఫ్టీ జీవనకాల తాజా గరిష్ఠాలకు చేరాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలు ఇందుకు మద్దతుగా నిలిచాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 14 పైసలు తగ్గి 83.57 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 0.80% లాభంతో 85.69 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. 

  • మదుపర్ల సంపదగా పరిగణించే, బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ    రూ.437.02 లక్షల కోట్లుగా నమోదైంది.
  • సెన్సెక్స్‌ ఉదయం 78,094.02 పాయింట్ల వద్ద స్తబ్దుగా ప్రారంభమైంది. మదుపర్ల కొనుగోళ్లతో పరుగులు తీసిన సూచీ, ఇంట్రాడేలో 78,759.40 వద్ద జీవనకాల తాజా గరిష్ఠాన్ని తాకి చివరకు 620.73 పాయింట్ల లాభంతో 78,674.25 వద్ద ముగిసింది. నిఫ్టీ 147.50 పాయింట్లు పెరిగి 23,868.80 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో 23,889.90 పాయింట్ల వద్ద రికార్డు గరిష్ఠాన్ని నమోదుచేసింది. సూచీల ముగింపు కూడా జీవనకాల గరిష్ఠస్థాయులే. 
  • కొనుగోళ్ల మద్దతుతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు 4.09% లాభంతో రూ.3,027.40 వద్ద ముగిసింది. సంస్థ మార్కెట్‌ విలువ రూ.80,359 కోట్లు పెరిగి రూ.20.48 లక్షల కోట్లకు చేరింది.
  • సెన్సెక్స్‌ 30 షేర్లలో 20 దూసుకెళ్లాయి. ఎయిర్‌టెల్‌ 3.07%, అల్ట్రాటెక్‌ 2.78%, ఐసీఐసీఐ బ్యాంక్‌ 1.60%, యాక్సిస్‌ బ్యాంక్‌ 1.26%, ఎన్‌టీపీసీ 1.14%, సన్‌ఫార్మా 1.11% లాభపడ్డాయి. ఎం అండ్‌ ఎం 2.02%, టాటా స్టీల్‌ 1.79%, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 1.13%, టెక్‌ మహీంద్రా1.10%, టైటన్‌  0.86% నష్టపోయాయి. 
  • ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కొత్త ఎండీ, సీఈఓగా నవీన్‌ చంద్ర ఝా నియమితులయ్యారు. 
  • విదేశాల్లో బజాజ్‌ తయారీ ప్లాంటు: బజాజ్‌ ఆటో తొలిసారిగా విదేశాల్లోనూ తయారీని ప్రారంభించింది. బ్రెజిల్‌లోని మానౌస్‌లో ఏడాది వ్యవధిలో నెలకొల్పిన కొత్త ప్లాంటులో తయారీ కార్యకలాపాలకు శ్రీకారం చుట్టినట్లు బజాజ్‌ ఆటో ప్రకటించింది. ఒక షిఫ్ట్‌ ద్వారా ఏడాదికి 20,000 వాహనాలను ఇక్కడ తయారు చేయగలమని సంస్థ తెలిపింది. తమ వాహనాలను 100 దేశాల్లో విక్రయిస్తున్నట్లు వెల్లడించింది. 
  • హ్యుందాయ్‌ ఐపీఓ కోసం బ్యాంకులకు రూ.330 కోట్ల ఫీజు: తమ తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) కోసం సలహాలు ఇచ్చే బ్యాంకులకు ఫీజుగా హ్యుందాయ్‌ ఇండియా 40 మిలియన్‌ డాలర్లు (రూ.330 కోట్లు) చెల్లించనున్నట్లు తెలుస్తోంది. జేపీ మోర్గాన్, సిటీగ్రూప్, హెచ్‌ఎస్‌బీసీ వంటివి ఇందులో ఉన్నాయి. 
  • ఈక్విటీ, కన్వెర్టబుల్‌ వారెంట్‌ల జారీ ద్వారా   రూ.1,050 కోట్ల వరకు సమీకరించే ప్రతిపాదనకు ఐనాక్స్‌ గ్రీన్‌ ఎనర్జీ సర్వీసెస్‌ బోర్డు డైరెక్టర్లు ఆమోదం తెలిపారు.
  • వేదాంతాలో 2.6% వాటాను రూ.4,184 కోట్లకు, అనుబంధ సంస్థ ఫిన్‌సైడర్‌ ఇంటర్నేషనల్‌ కంపెనీ ద్వారా వేదాంతా రిసోర్సెస్‌ విక్రయించింది. దీంతో వేదాంతాలో ప్రమోటర్, ప్రమోటర్‌ గ్రూప్‌ సంస్థల వాటా 61.95% నుంచి 59.32 శాతానికి పరిమితమైంది.

మార్కెట్లలో ఐపీఓల సందడి 

  • ఆక్మే ఫిన్‌ట్రేడ్‌ షేరు ఇష్యూ ధర రూ.120తో పోలిస్తే బీఎస్‌ఈలో 4.75% లాభంతో రూ.125.70 వద్ద నమోదైంది. చివరకు 9.95% పెరిగి రూ.131.95 వద్ద ముగిసింది. 
  • డీ డెవలప్‌మెంట్‌ ఇంజినీర్స్‌ షేరు ఇష్యూ ధర రూ.203తో పోలిస్తే బీఎస్‌ఈలో 60% లాభంతో రూ.325 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభమైంది. చివరకు 65% రాణించి రూ.335 దగ్గర రపడింది. 
  • డర్లాక్స్‌ టాప్‌ సర్ఫేస్‌ షేరు ఇష్యూ ధర రూ.68తో పోలిస్తే, ఎన్‌ఎస్‌ఈ ఎస్‌ఎంఈ ప్లాట్‌ఫామ్‌పై 60.29% లాభంతో రూ.109 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభమైంది. చివరకు రూ.103.55 వద్ద ముగిసింది. 
  • అలైడ్‌ బ్లెండర్స్‌ అండ్‌ డిస్టిలర్స్‌ ఐపీఓకు రెండో రోజున 1.51 రెట్ల స్పందన లభించింది. వ్రజ్‌ ఐరన్‌ అండ్‌ స్టీల్‌ ఐపీఓకు మొదటి రోజున 3.46 రెట్ల స్పందన దక్కింది. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని