RBI Rate Hike: కీలక వడ్డీరేట్లు యథాతథమే

RBI Rate Hike: ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. మంగళవారం ప్రారంభమైన ఎంపీసీ సమావేశ నిర్ణయాలను గవర్నర్‌ శక్తికాంత దాస్‌ గురువారం ప్రకటించారు.

Updated : 08 Jun 2023 13:15 IST

ముంబయి: విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కీలక రేట్లను యథాతథంగా కొనసాగించింది. మంగళవారం ప్రారంభమైన పరపతి విధాన కమిటీ (MPC) సమావేశ నిర్ణయాలను గవర్నర్‌ శక్తికాంత దాస్‌ గురువారం ప్రకటించారు. రెపోరేటు (Repo rate)ను 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఎంఎస్‌ఎఫ్‌, బ్యాంక్‌ రేట్‌ సైతం 6.75 శాతం వద్ద స్థిరంగా ఉన్నాయి. రిటైల్‌ ద్రవ్యోల్బణం (Inflation) తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఊతమివ్వాల్సిన అవసరం ఉందనే భావనతోనే కీలక రేట్లలో ఆర్‌బీఐ మార్పులు చేయక పోవచ్చునని గతకొంత కాలంగా విశ్లేషణలు వెలువడుతున్న విషయం తెలిసిందే.

గత ఏప్రిల్‌ సమావేశంలో రెపో రేటు (Repo rate)ను ఎలాంటి మార్పు చేయకుండా 6.5 శాతంగా కొనసాగించారు. ద్రవ్యోల్బణాన్ని (Inflation) నియంత్రించేందుకు 2022 మే నుంచి వరుసగా ఆరు దఫాల్లో రెపో రేటును 250 బేసిస్‌ పాయింట్ల మేర ఆర్‌బీఐ పెంచింది. కీలక రేట్లపై నిర్ణయాన్ని తీసుకునేందుకు రిటైల్‌ ద్రవ్యోల్బణ గణాంకాలను ఆర్‌బీఐ పరిగణనలోకి తీసుకుంటుంది. ఏప్రిల్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 18 నెలల కనిష్ఠమైన 4.7 శాతానికి దిగివచ్చిన విషయం తెలిసిందే.

సర్దుబాటు విధాన వైఖరి ఉపసంహరణను కొనసాగించాలని పరపతి కమిటీ నిర్ణయించినట్లు శక్తికాంత దాస్‌ తెలిపారు. ద్రవ్యోల్బణ తీరుతెన్నులపై నిశిత, నిరంతర నిఘా కచ్చితంగా అవసరమని అభిప్రాయపడ్డారు. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నెమ్మదించే అవకాశం ఉందని అంచనా వేశారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఎంపీసీ ఎప్పటికప్పుడు కావాల్సిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. దేశీయంగా పుంజుకుంటున్న గిరాకీ వృద్ధికి ఊతమిస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ గిరాకీ క్రమంగా పుంజుకుంటోందన్నారు. 595.1 బిలియన్‌ డాలర్ల విదేశీ మారక నిల్వలు ఖజానాలో ఉన్నాయని వెల్లడించారు.

ఇప్పటి వరకు ఆర్‌బీఐ తీసుకున్న ద్రవ్య పరపతి విధాన నిర్ణయాలు సత్ఫలితాలిస్తున్నాయని శక్తికాంత దాస్‌ తెలిపారు. నాలుగో త్రైమాసికంలో ప్రస్తుత ఖాతా లోటు మరింత దిగొస్తుందని అంచనా వేశారు. జవనరి నుంచి రూపాయి మారకం విలువ స్థిరంగా కొనసాగుతోందని తెలిపారు. నాన్‌-రెసిడెంట్‌ డిపాజిట్లు వార్షిక ప్రాతిపదికన 2022-23లో 3.2 బిలియన్‌ డాలర్ల నుంచి 8 బిలియన్‌ డాలర్లకు పెరిగినట్లు వెల్లడించారు.

ద్రవ్యోల్బణ అంచనాలు..

ద్రవ్యోల్బణం ప్రస్తుతం ఆర్‌బీఐ లక్ష్యిత పరిధి అయిన 4 శాతం ఎగువనే ఉందని శక్తికాంత దాస్‌ తెలిపారు. ఈ ఏడాది మొత్తం అది అలాగే కొనసాగుతుందని అంచనా వేశారు. ఈ ఆర్థిక సంవత్సర ద్రవ్యోల్బణం అంచనాను 5.2 శాతం నుంచి 5.1 శాతానికి తగ్గించారు. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 4.6%, రెండో త్రైమాసికంలో 5.2%, మూడో త్రైమాసికంలో 5.4%, నాలుగో త్రైమాసికంలో 5.2 శాతంగా అంచనా వేశారు.

వృద్ధి ఇలా..

ఈ ఆర్థిక సంవత్సరం వృద్ధిరేటును గత అంచనాలను అనుగుణంగా 6.5 శాతం వద్ద స్థిరంగా కొనసాగించాలని ఎంపీసీ నిర్ణయించినట్లు దాస్ తెలిపారు. వృద్ధిరేటు తొలి త్రైమాసికంలో 8%, రెండో త్రైమాసికంలో 6.5%, మూడో త్రైమాసికంలో 6%, నాలుగో త్రైమాసికంలో 5.7 శాతంగా అంచనా వేశారు.

హోంలోన్‌లకు అనువైన సమయమేనా?

వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించిన నేపథ్యంలో తొలిసారి హోంలోన్‌ తీసుకునేవారికి పరిస్థితులు ఇప్పుడు అనుకూలంగా ఉన్నాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ప్రస్తుతానికి చాలా బ్యాంకుల్లో వడ్డీరేట్లు సింగిల్‌ డిజిట్లలోనే కొనసాగుతాయని తెలిపారు. ప్రస్తుతం గృహరుణ వడ్డీరేట్లు మెజారిటీ బ్యాంకుల్లో 8.7- 9.75 శాతం మధ్య ఉన్నట్లు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఆర్‌బీఐ రేట్లను పెంచితే వడ్డీరేట్లు డబుల్‌ డిజిట్లకు చేరే అవకాశం ఉందని అంచనా వేశారు.

అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థల్లో నిరంతర అనిశ్చితులు కొనసాగుతున్నాయని దాస్‌ తెలిపారు. ఈ పరిణామాల ప్రభావం భారత్‌పై కూడా ఉంటుందని చెప్పారు. అదే జరిగితే ఆర్‌బీఐ అందుకనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో భవిష్యత్‌ పరపతి విధాన సమీక్షల్లో రేట్ల పెంపును కొట్టిపారేయలేమని నిపుణులు అంచనా వేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు