RBI Interest Rates: వడ్డీరేట్లు మళ్లీ యథాతథం.. రెపోరేటు 6.5 శాతం వద్ద ఫిక్స్‌

RBI Interest Rates: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కీలక రేట్లను యథాతథంగా కొనసాగించింది. గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ద్వైమాసిక పరపతి విధాన కమిటీ (MPC) సమీక్ష నిర్ణయాలను శుక్రవారం ప్రకటించారు.

Updated : 07 Jun 2024 14:58 IST

RBI Interest Rates | ముంబయి: భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI) కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది. రెపోరేటును 6.5 శాతం వద్ద స్థిరంగా కొనసాగిస్తున్నట్లు తెలిపింది. బుధవారం ప్రారంభమైన ద్వైమాసిక ద్రవ్యపరపతి కమిటీ విధాన సమీక్ష నిర్ణయాలను గవర్నర్‌ శక్తికాంత దాస్‌ శుక్రవారం వెల్లడించారు. ఇంధన ధరల్లో ప్రతిద్రవ్యోల్బణం నమోదవుతోందని తెలిపారు. అయినప్పటికీ.. ధరల పెరుగుదలపై ఎంపీసీ అప్రమత్తంగా ఉందని వెల్లడించారు. ద్రవ్యోల్బణం, వృద్ధి మధ్య సమతుల్యత అనుకూలంగా ఉందన్నారు. ఆహార ద్రవ్యోల్బణమే కొంత వరకు ఆందోళన కలిగిస్తోందని తెలిపారు.

ఎంపీసీ సమీక్షలోని కీలక ప్రకటనలు..

  • ద్రవ్యోల్బణాన్ని 4 శాతం లోపునకు తీసుకురావడానికి ఆర్‌బీఐ కట్టుబడి ఉంది.
  • నైరుతి రుతుపవనాలతో ఖరీఫ్‌ సాగు ఉత్పత్తి పెరుగుతుందని ఆశిస్తున్నాం. రిజర్వాయర్లలో నీటిమట్టాలు పెరుగుతాయనుకుంటున్నాం.
  • 2024-2025 వృద్ధిరేటు అంచనా 7.5 శాతం. ఇది కార్యరూపం దాల్చితే వరుసగా నాలుగో ఏడాది 7 శాతం ఎగువన వృద్ధి నమోదైనట్లు అవుతుంది.
  • 2024-25 రిటైల్ ద్రవ్యోల్బణ అంచనాలు..
    • ఆర్థిక సంత్సరం - 4.5%
    • తొలి త్రైమాసికం - 4.9%
    • రెండో త్రైమాసికం - 3.8%
    • మూడో త్రైమాసికం - 4.6%
    • నాలుగో త్రైమాసికం - 4.5%
  • ఆహార ద్రవ్యోల్బణాన్ని నిశితంగా పర్యవేక్షించాల్సి ఉంది.
  • ఇతర కరెన్సీలతో పోలిస్తే రూపాయి స్థిరత్వం భారతదేశ దృఢమైన ఆర్థిక పునాదులకు నిదర్శనం.
  • 2023-24 ఆర్థిక సంవత్సర వార్షిక ఫలితాలు బ్యాంకింగ్‌ వ్యవస్థ ఎంత బలంగా ఉందో సూచిస్తున్నాయి.
  • కస్టమర్ల భద్రతకు ఆర్‌బీఐ తొలి ప్రాధాన్యం. ఇప్పటికే కొన్ని సంస్థలు వినియోగదారులకు తెలియజేయకుండా కొన్ని రకాల రుసుములను వసూలు చేస్తున్నాయి.
  • అన్‌సెక్యూర్డ్‌ లోన్ల జారీని మరింత అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటాం.
  • ప్రపంచ రెమిటెన్స్‌లలో భారత్‌ వాటా 15.2 శాతం. తద్వారా విదేశీ ద్రవ్యాన్ని పొందుతున్న అతిపెద్ద దేశంగా కొనసాగుతోంది.
  • ఎఫ్‌డీఐలు బలంగా కొనసాగుతున్నాయి. నికరంగా చూస్తే మాత్రం తగ్గుదల నమోదైంది.
  • వస్తు-సేవల ఎగుమతులు-దిగుమతులకు సంబంధించిన ఫెమా నిబంధనలను హేతుబద్ధీకరించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని