RBI Bonds: ఎఫ్‌డీ కంటే అధిక వడ్డీ.. ఆర్‌బీఐ గ్యారెంటీతో వచ్చే ఈ బాండ్స్‌ గురించి తెలుసా?

RBI Floating Rate Savings Bonds | రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఫ్లోటింగ్‌ సేవింగ్స్ బాండ్లు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కంటే ఎక్కువ వడ్డీని అందిస్తున్నాయి. ఇందులో పెట్టుబడి చేయాలంటే కొన్ని విషయాలను తెలుసుకోవాలి.

Published : 02 Jul 2024 10:15 IST

RBI Floating Rate Savings Bonds | ఇంటర్నెట్‌డెస్క్‌: అధిక వడ్డీనిచ్చే పెట్టుబడి మార్గాల కోసం చాలా మంది చూస్తుంటారు. పైగా తమ సొమ్ముకు రక్షణ ఉండాలని కోరుకుంటారు. అలాంటి వారు బ్యాంకులు అందించే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను (FD) ఆశ్రయిస్తుంటారు. ఆర్‌బీఐ రెపో రేట్లను పెంచిన తరుణంలో వీటి రేట్లు కూడా ఆకర్షణీయంగానే ఉన్నాయి. కానీ, ఎఫ్‌డీ కంటే అధిక వడ్డీ.. ప్రభుత్వ హామీ ఉన్న స్కీమ్‌ ఒకటుంది. అదే రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా (RBI) ప్రవేశ పెట్టిన ఫ్లోటింగ్‌ రేట్‌ సేవింగ్స్‌ బాండ్స్‌, 2020. ఈ బాండ్లపై అధిక వడ్డీతో పాటు ఆర్‌బీఐ సార్వభౌమ గ్యారెంటీ కూడా వర్తిస్తుంది. దీంతో మన డబ్బుకు పూర్తి భద్రత ఉంటుంది.

ఫ్లోటింగ్ రేట్‌ సేవింగ్స్ బాండ్లలో వడ్డీ రేటు ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండదు. చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ఒకటైన నేషనల్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (NSC)తో ఈ వడ్డీ రేట్లు ముడిపడి ఉంటాయి. NSC వడ్డీ రేటును పెంచితే ఈ బాండ్ల రేటు కూడా పెరుగుతుంది. అలాగే NSC వడ్డీ రేటు తగ్గితే ఈ బాండ్లపై వడ్డీ కూడా తగ్గుతుంది. ఎన్‌ఎస్‌సీ అందించే వడ్డీ రేటుకు 0.35 శాతం ఎక్కువ రేటు ఈ బాండ్లపై లభిస్తుంది. 2024 జులై- డిసెంబర్‌ అర్ధ వార్షికానికి తాజాగా ఆర్‌బీఐ వడ్డీ రేటును జులై 1న ఖరారు చేసింది. నేషనల్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ 7.7 శాతం వడ్డీ రేటు లభిస్తుండగా.. ఆర్‌బీఐ బాండ్లపై 8.05 శాతం వడ్డీ అందనుంది. ఈ వడ్డీ రేట్లు ప్రతి ఆరు నెలలకోకసారి మారుతాయి. ఏడాదికి రెండు సార్లు (జనవరి 1, జులై 1) వడ్డీ మొత్తం మీ ఖాతాలో జమ అవుతుంది.

ఐటీ రిటర్నులు ఫైల్‌ చేస్తే కలిగే ప్రయోజనాలు తెలుసా?

ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..

  • ఆర్‌బీఐ ప్రవేశ పెట్టిన ఈ ఫ్లోటింగ్‌ రేట్‌ సేవింగ్స్‌ బాండ్‌ కాలావధి ఏడేళ్లు. ఈ బాండ్లలో ముందస్తు ఉపసంహరణకు అవకాశం ఉండదు. అయితే, సీనియర్‌ సిటిజన్లు మాత్రం కనీస లాక్‌- ఇన్‌ పీరియడ్ తర్వాత పెనాల్టీతో ముందుగానే డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. 60-70 మధ్య వయసున్న వారికి ఆరేళ్లు, 70-80 మధ్య వయసున్న వారికి ఐదేళ్లు, 80 ఏళ్లు దాటిన వారికి నాలుగేళ్ల లాక్‌- ఇన్‌ పీరియడ్‌ ఉంటుంది.
  • కనిష్ఠంగా వెయ్యి రూపాయలతో ఈ బాండ్లను కొనుగోలు చేయొచ్చు. గరిష్ఠ పరిమితి లేదు. వడ్డీ రేట్లు పెరగొచ్చు, తగ్గొచ్చు.. కాబట్టి భవిష్యత్‌లో తగ్గితే రాబడిపై ప్రభావం ఉంటుందని గుర్తుంచుకోవాలి. అలాగే ఈ బాండ్లపై వచ్చే వడ్డీపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ బాండ్లపై రుణ సదుపాయం లేదు. వీటిని ఇతరులకు బదిలీ చేసుకోవడమూ కుదరదు.
  • ఎక్కువ వడ్డీ ఇచ్చే పథకం అయినా ఏడేళ్ల పాటు డబ్బుతో అవసరం లేదనుకున్న వారు ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. స్థిరమైన వడ్డీ రేటు రావాలనుకొనే వారు ఇందులో పెట్టుబడి చేయకపోవడమే ఉత్తమం. ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది ఉపయోగపడుతుంది. తక్కువ పన్ను పరిధిలో ఉండి, రిస్క్ లేకుండా పెట్టుబడి చేయాలనుకొనేవారు ఈ మార్గాన్ని ఎంచుకోవచ్చు. ప్రత్యేకించి సీనియర్ సిటిజన్‌లకు ఇది స్థిరమైన ఆదాయ వనరుగా పని చేస్తుంది.
  • ఆర్‌బీఐ ఆథరైజేషన్‌ పొందిన ఏదైనా బ్యాంక్‌ శాఖలో వీటిని కొనుగోలు చేయొచ్చు. ఇందుకోసం కేవైసీ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. బ్యాంక్‌ వెబ్‌సైట్ల ద్వారా కూడా కొనుగోలు చేయొచ్చు. ఆర్‌బీఐకి చెందిన రిటైల్‌ డైరెక్ట్‌ పోర్టల్‌ నుంచి కూడా ఈ బాండ్లను కొనుగోలు చేయొచ్చు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు