Raymond Realty: స్థిరాస్తి వ్యాపారాన్ని విభజించనున్న రేమండ్‌

స్థిరాస్తి వ్యాపారాన్ని విభజించి, స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో ప్రత్యేక సంస్థగా నమోదు చేయనున్నట్లు రేమండ్‌ లిమిటెడ్‌ గురువారం ప్రకటించింది.

Published : 05 Jul 2024 03:56 IST

ప్రతి రేమండ్‌ షేరుకు ఒక రేమండ్‌ రియాల్టీ షేరు

దిల్లీ: స్థిరాస్తి వ్యాపారాన్ని విభజించి, స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో ప్రత్యేక సంస్థగా నమోదు చేయనున్నట్లు రేమండ్‌ లిమిటెడ్‌ గురువారం ప్రకటించింది. వాటాదార్లకు మరింత విలువ చేకూర్చడంతో పాటు, దేశీయ స్థిరాస్తి విపణిలో వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. రేమండ్‌ నుంచి స్థిరాస్తి వ్యాపారాన్ని వేరుచేసి, రేమండ్‌ రియాల్టీ లిమిటెడ్‌గా ఏర్పాటు చేసే ప్రణాళికకు బోర్డు ఆమోదం తెలిపినట్లు ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో కంపెనీ పేర్కొంది. దీని ప్రకారం.. ప్రతి రేమండ్‌ షేరుకు, ఒక రేమండ్‌ రియాల్టీ షేరు వాటాదార్లకు లభిస్తుంది. ఈ విభజన ప్రతిపాదనకు ఎన్‌సీఎల్‌టీ, వాటాదార్లు, రుణదాతలు, కేంద్ర ప్రభుత్వం, ఇతర నియంత్రణ సంస్థల అనుమతులు లభించాల్సి ఉంటుంది. 

  • విభజన రోజున రేమండ్‌ వాటాదార్లకు రూ.10 ముఖవిలువ కలిగిన 6,65,73,731 ఈక్విటీ షేర్లను రేమండ్‌ రియాల్టీ జారీ చేయనుంది. విభజన తర్వాత రేమండ్‌ రియాల్టీ షేర్లు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో నమోదవుతాయి. 
  • గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో రేమండ్‌ స్థిరాస్తి విభాగ నిర్వహణ ఆదాయం రూ.1,592.65 కోట్లుగా ఉంది. రేమండ్‌ మొత్తం ఆదాయంలో ఇది 24 శాతానికి సమానం. 

గురువారం బీఎస్‌ఈలో రేమండ్‌ షేరు రూ.26.30 నష్టపోయి, రూ.2935.45 వద్ద స్థిరపడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని