Byjus: బైజూస్‌లో ₹4 వేల కోట్ల పెట్టుబడి.. ఇప్పుడు సున్నా..!

Byjus: బైజూస్‌లో రూ.4 వేల కోట్లకు పైగా పెట్టుబడి పెట్టిన సంస్థ నిండా మునిగింది. దీంతో తన వాటాను రైటాఫ్‌ చేసుకుంటున్నట్లు ప్రకటించింది.

Published : 24 Jun 2024 16:26 IST

Byjus | ఇంటర్నెట్ డెస్క్‌: ఆర్థికంగా కుదేలైన ఎడ్‌టెక్‌ సంస్థ బైజూస్‌లో (Byjus) భారీగా పెట్టుబడులు కుమ్మరించిన ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ ప్రోసస్‌ ఎన్‌వీ నిండా మునిగింది. ఆ కంపెనీ పెట్టుబడి ఇప్పుడు సున్నాకు చేరింది. ఈ క్రమంలోనే బైజూస్‌లో తమ వాటాను సాంకేతికంగా రద్దు (రైటాఫ్‌) చేసుకుంటున్నట్లు ఆ కంపెనీ వెల్లడించింది. తద్వారా తమకు 493 మిలియన్‌ డాలర్లు (భారతీయ కరెన్సీలో రూ.4 వేల కోట్ల పైమాటే) మేర నష్టం వాటిల్లినట్లు ఆ కంపెనీ నెదర్లాండ్స్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ ఫైలింగ్‌లో పేర్కొంది.

బైజూస్‌లో ఈక్విటీ ఇన్వెస్టర్ల వాటాల విలువ భారీగా క్షీణించిన నేపథ్యంలో రైటాఫ్‌ నిర్ణయం తీసుకున్నామని ప్రోసస్‌ సంస్థ తెలిపింది. దీంతో 2024 ఆర్థిక సంవత్సరంలో తమకు 493 మిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లిందని తన వార్షిక నివేదికలో పేర్కొంది. రైట్స్‌ ఇష్యూకు ముందు బైజూస్‌లో తమకు 9.6 శాతం వాటా ఉందని ఆ కంపెనీ పేర్కొంది. కంపెనీ ఆర్థిక పరిస్థితులు, అప్పులు, భవిష్యత్‌ అంచనాలకు సంబంధించి తమవద్ద ఎలాంటి సమాచారం లేకపోవడంతో బైజూస్‌ కంపెనీ విలువను తాము సున్నాకు తగ్గిస్తున్నట్లు ప్రోసస్‌ ప్రతినిధి పేర్కొన్నారు. పెట్టుబడికి ప్రతిఫలాన్ని కొలిచే ఐఆర్‌ఆర్‌ను మైనస్‌ 100 శాతంగా వాటాదారులకు తెలియజేసింది.

భారత్‌లోకి ‘మెటా ఏఐ’.. వాట్సప్‌, ఎఫ్‌బీ, ఇన్‌స్టాలో ఏఐ అసిస్టెంట్‌

బైజూస్‌పై విమర్శలు

బైజూస్‌లో 2018లో తొలి పెట్టుబడి పెట్టిన ప్రోసస్‌ సంస్థ.. కంపెనీలో పాలనాపరమైన లోపాలున్నాయంటూ గతంలోనే బహిరంగంగా విమర్శలు గుప్పించింది. 2023 జులైలో బైజూస్‌ బోర్డులో డైరెక్టర్‌గా వ్యవహరించిన వ్యక్తి రాజీనామా అనంతరం ఈ విమర్శలు చేసింది. కంపెనీలో కార్పొరేట్‌ పాలనలో లోపాల గురించి తమ డైరెక్టర్‌ పలుమార్లు సలహాలు ఇచ్చినా కంపెనీ పెడచెవిన పెట్టిందని ఆరోపించింది. ఈ క్రమంలోనే 22 బిలియన్‌ డాలర్లుగా పేర్కొన్న బైజూస్‌ విలువను 5.1 బిలియన్‌ డాలర్లకు ప్రోసస్‌ తగ్గించింది. ఇప్పుడు ఏకంగా సున్నాకు కుదించింది. కొన్ని నెలల క్రితం జరిగిన ఈజీఎం నిర్వహించి రవీంద్రన్‌ను తొలగిస్తూ తీర్మానం చేయడంలోనూ ఈ సంస్థ కీలకంగా వ్యవహరించింది. దీనిపై బైజూస్‌ సంస్థ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. దీంతో బైజూస్‌తో న్యాయపోరాటం చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని